
నెలలు ఆరు... హామీలు ఏమారు
ఏడుకొండలు ఏసీ చేస్తా.. ఎయిత్ వండరు నీ గుడి చేస్తా’నంటూ ఓ సినిమాలో హీరో తిరుమల వేంకటేశ్వరస్వామినే ప్రలోభాలకు గురి చేసినట్టు..
‘ఏడుకొండలు ఏసీ చేస్తా.. ఎయిత్ వండరు నీ గుడి చేస్తా’నంటూ ఓ సినిమాలో హీరో తిరుమల వేంకటేశ్వరస్వామినే ప్రలోభాలకు గురి చేసినట్టు.. ఓటర్లే దేవుళ్లని చెప్పే చంద్రబాబునాయుడు ఎన్నికల వేళ ఎడాపెడా హామీలిచ్చి వారిని ప్రసన్నం చేసుకున్నారు. మిత్రపక్షంతో కలసి జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు గడిచిపోరుుంది. నేటికీ వాటిలో ఏ ఒక్క హామీ నెరవేరలేదు. పనులు, నిధుల విడుదల మాట దేవుడెరుగు.. కనీసం ఆయూ పనులకు సంబంధించి ప్రతిపాదనలైనా చేయకపోవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఏలూరు :‘నన్ను గెలిపించకపోతే రాష్ట్రం అథోగతి పాలవుతుంది. దానివల్ల మీరే న ష్టపోతారు. పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా. అన్నదాతలకు అండగా నిలుస్తా. మీ జిల్లాకు ఏం చేయూలో అన్నీ చేస్తా’నంటూ హామీల వరద పారించిన చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు పూర్తరుు్యంది. జూన్ 8న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు అంతకు ముందు, ఆ తరువాత కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి, ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ఎన్నో హామీలిచ్చారు. ఆరు నెలల పాలనలో వాటిలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చేసిందని, కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు.
పర్యటనలు రెండు.. హామీలు మెండు
చంద్రబాబునాయుడు పాలనా పగ్గాలు చేపట్టాక రెండుసార్లు జిల్లాలో పర్యటించారు. జూలై 16, 17 తేదీల్లో చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగింది. నవంబర్ 1న ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో జన్మభూమి గ్రామ సభలకు హాజరయ్యూరు. ద్వారకాతిరుమల, కామవరపుకోటల్లో రైతు సద స్సులు, నర్సన్నపాలెం, కొయ్యలగూడెం డ్వాక్రా సంఘాల సదస్సులకు హాజరయ్యారు. అన్ని స్థానాల్లో విజయాన్ని అందించిన పశ్చిమను అగ్రస్థానంలో నిలిపి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా జిల్లా వాసులకు హామీలిచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలను మెగా టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తానని, ఈ క్షేత్రాన్ని రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలబెడతానని, భీమడోలు నుంచి ద్వారకాతిరుమల వరకు నాలుగు లేన్ల రోడ ్ల నిర్మాణం చేపడతానని హామీలిచ్చారు.
పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు 500 పడకల ఆసుపత్రి సైతం ఏర్పాటు చేస్తానన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీని ఆదర్శవంతమైన టౌన్ షిప్‌గా మారుస్తానన్నారు. ఉండి మండలం కలవపూడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పిన దాతలు ‘మీరు రూ.కోటి ఇస్తే, మేం రూ.కోటి సమకూర్చుకుని ప్రాతాళ్లమెరక గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం’ అని విన్నవించగా, తక్షణమే రూ.కోటి ఇస్తాన్న సీఎం హామీ నోటి మాటగానే మిగిలిపోయింది. పాలకొల్లులో దొడ్డిపట్ల డ్రెయిన్ నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన రూ.50 లక్షలు విడుదల చేస్తానన్నారు. యుద్ధప్రాతిపదిక అంటే ఆయన దృష్టిలో ఎన్నాళ్లు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వంద రోజుల పండగ.. హామీలు నిండుగా..
తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), విమానాశ్రయం, ఉద్యాన పరిశోధన కేంద్రం, నరసాపురంలో ఫిషింగ్ హార్బర్, ద్వారకాతిరుమలలో సిరామిక్, ఆయిల్‌పామ్ పరిశ్రమలు, పర్యాటక ప్రాంతంగా కొల్లేరు సరస్సు అభివృద్ధి, జలమార్గాల అభివృద్ధి, చింతలపూడిలో ప్రాంతంలో బొగ్గు వెలికితీత, కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు, భీమవరం ప్రాంతంలో ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్లు, మెట్ట ప్రాంతంలో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్‌కు ఏర్పాట్లు చేస్తానని సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన అనంతరం ప్రకటించారు. అరుుతే, ఒక్క నిట్ ఏర్పాటు విషయంలో స్థల పరిశీలన మాత్రం చేపట్టారు. ప్రజాప్రతినిధుల మధ్య వివాదం రేగడంతో ఈ ప్రాజెక్టు కూడా ముందుకు సాగడం లేదు.
చినబాబు హామీలూ అంతే
నరసాపురం నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హామీ ఇచ్చారు. తీర ప్రాంతంలో హార్బర్ నిర్మించి మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తామని, సఖినేటిపల్లి-నరసాపుర మధ్య వశిష్ట గోదావరిపై వారధి నిర్మిస్తామని చెప్పారు. ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నల్లి క్రీక్‌లో పూడిక తొలగింపు, వియర్ చానల్ పనులు, శేషావతారం కాలువ విస్తరణ, తీర ప్రాంతంలో భారీ మంచినీటి ప్రాజెక్టు పనులకు కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయలేదు.
పాదయాత్రలో హామీలివి..
ఎన్నికల సమయంలో ఆచంట నియోజకవర్గ పరిధిలోని మార్టేరు, పెనుగొండ గ్రామాల మీదుగా పాదయాత్ర చేసిన చంద్రబాబు సిద్ధాంతం, పెనుగొండ శ్మశాన వాటికల్లో సదుపాయాలు కల్పిస్తానన్నారు. నేటికీ ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. పెనుగొండ శ్మశాన వాటికను దాతల సహకారంతో గ్రామస్తులే అభివృద్ధి చేసుకుంటుండగా సిద్ధాంతంలోని శ్మశాన వాటిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆచంట నియోజకవర్గ రైతులకు దాళ్వాలో సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా దొంగరావిపాలెంలో బ్యాంక్ కెనాల్‌పై ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు.