అధికార పార్టీ నేతల దాష్టీకం

TDP Activists Attack on Villagers Krishna - Sakshi

గ్రామాభివృద్ధిని ప్రశ్నిస్తే ఇంటిపై దాడి

ఇద్దరికి తీవ్ర గాయాలు

మహిళలపై అసభ్య పదజాలం

బూదవాడలో ఘటన

కృష్ణాజిల్లా, బూదవాడ (జగ్గయ్యపేట) : గ్రామంలోని సమస్యలు, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించాలని ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినందుకు అతని కుటుంబంపై అధికార పార్టీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చినకేశి వీరబాబు సమీపంలోని కర్మాగారంలో కాంట్రాక్టు కూలీగా పని చేస్తున్నాడు. అయితే గ్రామంలో ఏ సమస్యైనా, అభివృద్ధికి కావాల్సిన సలహాలను ప్రచార మాధ్యమాల ద్వారా గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులకు సమాచారం అందిస్తుంటాడు. దీంతో స్పందించిన అధికారులు సమస్యను గ్రామ ప్రజా ప్రతినిధులతో కలిసి పరిష్కరించేవారు. ఈ క్రమంలో గ్రామంలో పంచాయతీ నిధుల జమాఖర్చులనూ ఈ ఏడాది మే నెలలో సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులకు దరఖాస్తు చేసుకోవటంతో వారు సమాధానమిచ్చారు.

ఈ నేపథ్యంలో వారం క్రితం వీరబాబును గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గడ్డం ఏసుబాబు సమాచార హక్కు చట్టం దరఖాస్తు ఎందుకు పెట్టావని నిలదీశాడు. నీకెంత ధైర్యం అంటూ బెదిరించటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం కుల పంచాయతీ పెట్టి ఏసుబాబును మందలించారు. దీంతో కక్ష పెట్టుకున్న ఏసుబాబు ప్రోద్బలంతో యామర్తి సైదులు, లింగయ్య, నాగరాజు, గంగయ్య, పలపాటి తిరుపతిరావు, వెంకటేశ్వర్లు, వెంకట చందు, చిన్నకేశి రామారావు, వీరయ్య, చిన్న సైదులు సోమవారం ఉదయం వీరబాబు ఇంటికి వెళ్లి దుర్భాషలాడటమే కాకుండా అతనిపై దాడి చేశారు. అడ్డు వచ్చిన చిన్నకేశి నాగరాజు, తల్లి చిన్నకేశి వెంకట్రావమ్మలతో పాటు చేతుల గోవిందమ్మ, ఆనంగి తిరుపతమ్మ, చిన్నకేశి పాపయ్య, వెంకటేశ్వర్లుపై కూడా దాడి చేశారు. అంతే కాకుండా మహిళలపై కూడా దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. టీడీపీ నేతల దాడిలో స్పృహ కోల్పోయిన నాగరాజును, గాయాలైన కుటుంబ సభ్యులను జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ చిన్నకేశి నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించటం వల్లనే దాడి జరిగిందని తెలిపారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..
సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగిన వ్యక్తిపై అధికార పార్టీ నాయకులు మూకుమ్మడిగా ఇంటికి వెళ్లి దాడి చేయటం హేయమైన చర్య అని వైఎస్సార్‌ సీపీ యూత్‌ నాయకుడు సామినేని వెంకట కృష్ణప్రసాద్‌ అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరబాబు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పోలీసులు విచారణ జరిపి అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top