శ్రీవారి ఆలయ సిబ్బందిపై టీడీపీ నాయకుల దాడి | tdp activists attack temple outsourcing staff | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయ సిబ్బందిపై టీడీపీ నాయకుల దాడి

May 19 2014 1:24 AM | Updated on Aug 10 2018 9:40 PM

శ్రీవారి ఆలయ సిబ్బందిపై టీడీపీ నాయకుల దాడి - Sakshi

శ్రీవారి ఆలయ సిబ్బందిపై టీడీపీ నాయకుల దాడి

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భీమడోలుకు చెందిన టీడీపీ నాయకులు దేవస్థానం అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు.

 ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ :  ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భీమడోలుకు చెందిన టీడీపీ నాయకులు దేవస్థానం అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. వివరాలు ఇవి.. భీమడోలు నుంచి కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రగా ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి ఆదివారం వచ్చారు. కాలి నడకన వచ్చిన వారికి ఇచ్చే ఉచిత దర్శనం టికెట్లు కావాలని ఆలయ సిబ్బందిని అడిగారు. సమాచార కేంద్రం వద్ద ఉండే రిజిస్టర్‌లో సంతకం చేసి టికెట్లు పొందాలని సిబ్బం ది వారికి సూచించారు. దీంతో వారు రిజిస్టర్ ఇక్కడికే తేవాలని డిమాండ్ చేయగా సిబ్బంది అందుకు నిరాకరించారు.
 
 టికెట్ల కోసం సమాచార కేంద్రం వద్దకు వెళ్లిన టీడీపీ నాయకులు అక్కడ ఉన్న స్వీపర్ దుర్గ, సూపర్‌వైజర్ శివతో వాగ్వివాదానికి దిగారు. ఆ నేతల్లో ఒకరైన గన్ని గోపాలరావు తాను ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తమ్ముడినని చెప్పారు. ఇప్పటి వరకు మీరెవరో తెలియదని సిబ్బంది వారికి క్షమాపణ చెప్పారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా శివపై దాడి చేశారు. వారిని ఆపేందుకు సమాచారకేంద్రం గుమాస్తా బొక్కా బాబ్జి, సిబ్బంది నరేష్, సెక్యురిటీ గార్డు నాయుడు, పలువురు స్వీపర్లు ప్రయత్నించినా వారు శాంతించలేదు. అడ్డు వెళ్లిన వారిని సైతం కొట్టారు.
 
శివ చేసేదిలేక ఓ టీడీపీ నాయకుడి చేతిని కరిచి తప్పించుకున్నాడు. అధికారం చేతిలో ఉందని కొట్టేస్తారా అంటూ దేవస్థానం సిబ్బంది ధ్వజమెత్తారు. సిబ్బంది దురుసుతనం వల్లే ఈ గొడవ జరిగిందని, తమ తప్పేమి లేదని టీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు. ఇరువర్గాల వారు దేవస్థానం కార్యాలయంలో ఉన్నతాధికారులకు  ఫిర్యాదులు చేశారు. విషయం తెలుసుకున్న ఈవో వేండ్ర త్రినాథరావు తక్షణ చర్యగా గొడవలో ఉన్న స్వీపర్ దుర్గ, సూపర్‌వైజర్ శివలను విధులనుంచి ప్రక్కన పెట్టాలని ఏఈవో దుర్గారావుకు సూచించారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement