
స్వైన్‌ఫ్లూ కలకలం
జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధిపై కలకలం రేగుతోంది. రాష్ట్రంలో వరుసగా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధిపై కలకలం రేగుతోంది. రాష్ట్రంలో వరుసగా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇటీవల బాపట్లకు చెందిన ఓ వివాహిత మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే. పొరుగు జిల్లా ప్రకాశంలో కూడా ఓ కేసు నమోదు చేశారు. ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో వందలాది కేసులు నమోదుకావడంతోపాటు పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలని వైద్యులు సూచిస్తున్నారు.
గుంటూరు మెడికల్:స్వైన్‌ఫ్లూ అంటువ్యాధి కావటం, వ్యాధిసోకిన వ్యక్తి దగ్గినా తుమ్మినా గాలిద్వారా అతి వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన జిల్లా వైద్యఆరోగ్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం విమర్శలకు తావిస్తోంది.
ఈ వ్యాధిని నిర్ధారించి చెప్పే ల్యాబ్ సౌకర్యాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద లేవు. ఒకవేళ వ్యాధి సోకినట్లు లక్షణాలను బట్టి నిర్ధారించినా, మరొకరికి సోకకుండా ప్రత్యేక(ఐసోలేటెడ్) వార్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. కాని ఇంతవరకు అలాంటి వార్డుల ఊసేలేదు.
వ్యాధి నియంత్రణ కోసం అవసరమైన టామిఫ్లూ మాత్రలు తమ వద్ద ఉన్నాయని చెపుతున్న అధికారులు వాటిని వైద్యం చేసే వైద్య సిబ్బందికి, ఆస్పత్రులకు పంపించకుండా చోద్యం చూస్తూ ఉండటంతో ఒకవేళ అనుమానిత కేసులు వచ్చినా వారికి వైద్యం చేసేందుకు వైద్య సిబ్బంది ఎవ్వరూ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు.
కనీసం మెడికల్ కోటెడ్ మాస్క్‌లను కూడా వైద్య సిబ్బందికి ఇంతవరకు అందించకపోవటం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
వ్యాధి లక్షణాలు... డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్, గుంటూరు
స్వైన్‌ఫ్లూ వ్యాధి ఎచ్1, ఎన్1 వైరస్ ద్వారా పందుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.
వ్యాధి సోకినవారిలో మొదట సాధారణ జ్వర ం, గొంతునొప్పి, తుమ్ములు, ముక్కు, కళ్ళ వెంట నీరుకారడం, ఒళ్ళునొప్పులు తదితర లక్షణాలు ఉంటాయి. తరువాత దగ్గు ప్రారంభమై నీరసం, నిస్సత్తువ, వాంతులు, విరోచనాలు, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి.
ఉబ్బసం లాంటి దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధులున్నవారిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు త్వరగా ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. వ్యాధి సోకకుండా ఉండేందుకు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి. దగ్గినా, తుమ్మినా ముఖానికి క్లాత్ అడ్డుపెట్టుకోవాలి.
ప్రత్యేకవార్డు ఏర్పాటుకు చర్యలు...
డీఎంహెచ్‌ఓ
స్వైన్‌ఫ్లూ కేసులు ఇటీవల కాలంలో తరచుగా పలుచోట్ల నమోదవుతున్న దృష్ట్యా గోరంట్ల జ్వరాల ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటుకు పరిశీలన చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి తెలిపారు. టామిఫ్లూ మందులు పంపిణీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను కోరామన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో కూడా ప్రత్యేక వార్డు ఏర్పాటుకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు.