
శిక్షలు పడేది 10 శాతం మేరకే
ఈ 10 శాతంలోనే హత్య, పోక్సో, దాడుల వంటి తీవ్ర కేసులు
మిగిలినవి ట్రాఫిక్, పెట్టీ, చిన్న కేసులు
స్పెషల్ డ్రైవ్‌లో మిగిలినవి కొట్టుకుపోతాయంటున్న పోలీసులు
2016 సెప్టెంబర్ 23న జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెర్లకొండాపూర్ గ్రామానికి చెందిన దువ్వాక రాజు (45) అనే మహిళను వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇప్పటివరకు నిందితులు దొరకలేదు. పోలీసులు దర్యాప్తులో పురోగతి కనిపించలేదు. ఆ తర్వాత ఎస్పీ నుంచి ఎస్‌హెచ్‌వోల దాకా అధికారులు బదిలీలు కావడంతో ఈ కేసు దర్యాప్తు గురించి అంతగా ఎవరూ పట్టించుకోలేదు.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మండల నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు బొడ్డు శ్రీధర్‌రెడ్డిని 2024 మే 23 అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి వీలైనంత త్వరగా కేసును ఛేదించాలని ఆదేశాలిచ్చారు. ఐజీ సత్యనారాయణ గ్రామాన్ని స్వయంగా సందర్శించారు. అయినా నేటికీ కేసు మిస్టరీగానే మారింది. మృతుని కుటుంబ సభ్యులు డీజీపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని కలిసి విన్నవించినా, 15 నెలలుగా ఆ మిస్టరీ వీడలేదు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో రెండేళ్లుగా నమోదవుతున్న కేసుల్లో పురోగతి నెమ్మదించింది. దర్యాప్తు విషయంలో ఆధారాలు లభించక కొన్ని, ఆలస్యంగా వెలుగుచూసిన కేసుల్లో ఆధారాలు చెదిరిపోవడం వల్ల మరికొన్ని, దర్యాప్తులో శాస్త్రీయత లోపించడం వల్ల ఇంకొన్ని కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. నమోదైన కేసులు వేలల్లో ఉంటుండగా.. పరిష్కారమైనవి వందల్లోనే ఉంటుండటం ఇందుకు నిదర్శనం.
కేవలం 10% కేసుల్లోనే కోర్టుల్లో కన్విక్షన్ వస్తుంది. మిగిలిన కేసుల్లో దర్యాపు సాగుతూనే ఉంది. అన్నింటికంటే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కేసుల్లో మాత్రం సాగదీతే కనిపిస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను మినహాయించి ఆయా ఉమ్మడి జిల్లాల్లో కేసులు నమోదవుతున్న తీరు, పరిష్కారమవుతున్న తీరును పరిశీలించినప్పుడు ఇదే విషయం స్పష్టమైంది.
కేసుల్లో సగం ట్రాఫిక్‌వే..
పోలీసులు నమోదు చేసే కేసుల్లో తీవ్ర నేరారోపణలు కలిగిన కేసులు, పెట్టీ కేసులు అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే, హత్య, దొంగతనాలు, దోపిడీలు, హత్యాయత్నా లు, దాడులు, కిడ్నాప్‌లు, రేప్, రేప్ అటెంప్‌్ట, పోక్సో, అట్రాసిటీ తదితరాలు తీవ్ర నేరారోపణలు. ఈ కేసుల దర్యాప్తు విషయంలో జిల్లా ఎస్పీలు, సీపీలు సీరియస్‌గానే ఉంటారు. నెలా నెలా నిర్వహించే క్రైం మీటింగుల్లో కేసుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు.
వాస్తవానికి సీరియస్ కేసుల్లో దర్యాప్తుపై పోలీసులు నిందితుల గుర్తింపు 24 గంటల నుంచి 48 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. 90% కేసుల్లోనే సకాలంలోనే చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నారు. కొన్ని హత్య కేసుల్లో దర్యాప్తు అధికారులు సరి గ్గా వ్యవహరించక, ఆధారాలు సేకరించలేక కేసుల్లో నిందితులు నేటికీ పట్టుబడటం లేదన్నది మాత్రం వాస్తవం. ప్రతీ జిల్లా, కమిషనరేట్లలో నమోదవుతున్న కేసుల్లో సగానికి కంటే అధికంగా ట్రాఫిక్ కేసులే ఉన్నాయి. ఇవన్నీ సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంటాయి. స్పెషల్ డ్రైవ్ పెట్టినప్పుడు కేసులు డిస్పోజ్ అవుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
మరికొన్ని సంచలనాలు..
» 2020 డిసెంబర్‌లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పొలానికి వెళ్లిన మహిళను దారుణంగా హతమార్చిన కేసులో నేటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు జాప్యాన్ని నిరసిస్తూ.. బంధువులంతా కలిసి పోలీస్‌స్టేçషన్‌పై దాడికి దిగారు. కేసులో ఎలాంటి సాంకేతి క ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు అటకెక్కింది.
» 2024 డిసెంబర్‌లో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరి ఎల్లారెడ్డి పెద్దచెరువులో బిక్కనూరు ఎస్సై, బీబీపేట మహిళా కానిస్టేబుల్, మరో కంప్యూటర్ ఆపరేటర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసును పోలీసులు ఛేదించలేకపోయారు. వీరిది హత్యా, ఆత్మహత్యా అన్న విషయంలో నేటికీ స్పష్టత లేదు.
