పురంలో సర్వే కలకలం

Survey In Hindhupuram YSRCp Voters Red Mark Anantapur - Sakshi

వార్డుల వారీగా రహస్య సర్వే

ప్రతిపక్ష బూత్‌ కన్వీనర్లు, సానుభూతిపరుల వివరాల సేకరణ

అభ్యంతరం తెలిపిన వైఎస్సార్‌ సీపీ నేతలు

అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

హిందూపురం అర్బన్‌: ‘‘స్పార్క్‌ సోషియో పొలిటికల్‌ అనాలసిస్‌ అండ్‌ రిఫ్రెష్‌ సెంటర్‌’’ పేరుతో శుక్రవారం హిందూపురంలో కొందరు యువకులు చేస్తున్న ఓ సర్వే కలకలం రేపింది. వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లు, సానుభూతిపరులను సర్వే చేస్తున్న యువకులు.. ఓటరు లిస్టులో పేరు పక్కన రెడ్‌మార్క్‌ పెట్టడం గమనించిన ప్రతిపక్ష పార్టీ నేతలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంటింటి సర్వే కోసం అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన డిగ్రీ చదివిన 12 మంది యువకులకు కొందరు హిందూపురం తీసుకువచ్చారు. వారికున్న గైడ్‌లైన్స్‌ మేరకు వీరంతా శుక్రవారం పట్టణంలో వార్డుల వారీగా సర్వే చేపట్టారు. ముఖ్యంగా బూత్‌ కన్వీనర్లు, వార్డుల వారీగా బలమైన కార్యకర్తలు, నాయకుల గురించి సర్వే చేస్తున్నారు. అలాగే ఇంటింటికీ వెళ్లి టీడీపీ పాలన ఎలా ఉంది..? ఎవరికి ఓటు వేస్తారు..? అని ప్రశ్నిస్తూ వివరాలు రాబడుతున్నారు. ఎవరైనా వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తామని చెబితే ఓటరులిస్టులో వారి నంబర్‌ పక్కన చుక్కలు పెడుతున్నారు. ఎవరైనా గట్టిన నిలదీస్తే సర్వే చేస్తున్న యువకులు పలాయనం చిత్తగిస్తున్నారు. ఇది తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నేతలు సదరు యువకులను ప్రశ్నించగా...వారు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ చిన్నగోవిందు, సిబ్బంది అక్కడికి చేరుకుని సర్వేచేస్తున్న యువకులను వద్ద ఉన్న ట్యాబ్‌లు, సర్వే బుక్కులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని టుటౌన్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు.  

వైఎస్సార్‌ సీపీ నేతలపై కేసులకు యత్నం
సర్వేచేస్తున్న యువకుల్ని పట్టించిన వైఎస్సార్‌సీపీ నాయకులపైనే కేసు బనాయించే విధంగా పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తమను కొట్టారని.. నిర్బంధించి దూషించారని యువకుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. కొందరు టీడీపీ నేతలు నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చి సర్వేకోసం వచ్చిన యువకులను కలుసుకుని వారితో ఫిర్యాదు ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది రాజ్యాంగ విరుద్ధం
సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లు, నాయకులు, ఓటర్ల వివరాలు సేకరించడం పూర్తిగా రాజాంగ్య విరుద్ధం. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటరును భయపట్టడం... ప్రభావితం చేసేలా చేయడం నేరం. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటరు నంబర్లు గుర్తించి తొలగించడానికి టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర ఇది.
– నవీన్‌నిశ్చల్, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top