
సర్వే యువకుడిని పోలీసులకు అప్పగిస్తున్న గ్రామస్తులు
కాణిపాకం: పూతలపట్టు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పలువురు యువకులు విస్తృతంగా సర్వే చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఓటర్ల వ్యక్తిగత సమాచారంతోపాటు వారి ఆధార్, రేషన్, ఓటరు కార్డుల వివరాలను అడుగుతుండటంతో ఓటర్లు దీనిపై నిలదీశారు. గురువారం ఐరాల మండలం పుత్రమద్ది, మిట్టూరు, వడ్రాంపల్లె, తవణంపల్లె మండలంలో గోవిందరెడ్డి పల్లె, మత్యం గ్రామాలలో సర్వే చేశారు. వీరి సర్వే తీరును అనుమానించిన గ్రామస్తులు పోలీసు అధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలొస్తున్నాయి.
సర్వే కథేమిటంటే...
విజయవాడకు చెందిన స్వాట్ డిజిటల్ అండ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీకి చెందిన పది మంది యువకుల బృందం పలు ప్రాంతాల్లో సర్వే పేరిట ఓటర్ల వివరాలను ట్యాబుల్లో నమోదు చేస్తున్నారు. మత్యం, గోవిందరెడ్డి పల్లె గ్రామస్తులు వీరిని అనుమానించి ప్రశ్నించారు. తనపేరు రాజు అని, కర్నూలు వాసి అని, విజయవాడ కంపెనీ తరఫున సర్వే చేస్తున్నట్లు ఓ యువకుడు పేర్కొన్నారు. సర్వే చేసి 25 మంది పేర్లు ట్యాబ్‌లో నమోదు చేస్తే రూ.800 కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. ఏ కారణంతో సర్వే చేస్తున్నారని నిలదీస్తే వారు తమ సూపర్‌వైజర్ నగేష్‌ను సంప్రదించమంటూ సెల్ నంబర్లు: 90104 14154, 81063 90350 ఇచ్చారు. ఆ నంబర్లకు డయల్ చేసి గ్రామస్తులు మాట్లాడారు. సర్వే చేసే అధికారం తమకుందని, అడ్డుకుంటే చట్టపరంగా బాధ్యులవుతారని ఆవలి వ్యక్తి ఫోన్‌లో గద్దించే ధోరణిలో మాట్లాడారు. పోలీసులకు యువకులను అప్పగిస్తామని చెబితే..దానికి పోలీసుల నుంచి ఎలా వారిని విడిపించుకోవాలో మాకు తెలుసు.. తాము ఇప్పుడే పోలీసులను మీ వద్దకు పంపుతామని హుంకరించాడు. ఆ తరువాత అరగంట వ్యవధిలో ఇద్దరు ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి సర్వే యువకులను తమవెంట తీసుకెళ్లారు. దీనిపై ఎస్‌ఐ మధుసూదన్ వివరణ కోరగా.. సర్వే చేసుకునే హక్కు వారికి ఉందన్నారు.
ట్యాబులో నమోదు చేస్తున్న వివరాలు
యువకులు దళితవాడల్లో ప్రధానంగా సర్వే చేస్తూ వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. మీరు ఏ పార్టీకి అనుకూలం? చంద్రన్న బీమాలో సభ్యులుగా ఉన్నారా? పసుపు–కుంకుమ చెక్కులు ఎన్ని వచ్చాయి? ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు? ఏ పార్టీ నాయకులు మీకు అందుబాటులో ఉంటారు? యువనేస్తం పథకంలో ఎంత మంది మీ కుటుంబ సభ్యులు ఉన్నారు? సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడు జగన్‌లో మీకు ఆకర్షించిన అంశాలేమిటి? అని ఓటర్లను ప్రశ్నిస్తూసమాధానాలను ట్యాబ్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ తంతు అంతా అయ్యాక ఓటర్ల ఓటరు కార్డు, ఆధార్ కార్డు, ఓటరు ఫోన్ నంబర్‌ను నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీయే ఇలా చేయిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇస్తాం
ఓటర్ల వ్యక్తిగత వివరాలను ఎవరూ అడుగరాదు. అది నిబంధనలకు విరుద్ధం. ఓటర్లను మభ్యపెడితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.ఉన్నతాధి కారులకు తెలియజేసి స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇస్తాం.–రవీంద్ర,ఎన్నికల రిటర్నింగ్ అధికారి
ఓటు ఉంటుందో..ఊడగొడ్తాడో..!
ఈరోజు మధ్యాహ్నం మా ఊర్లోకి ఐదు మంది యువకులు వచ్చారు. వారిలో ఒకరు నావద్దకు వచ్చి మీరు ఏ పార్టీకి ఓటేస్తారని అడిగాడు. నేను ఫలాన పార్టీ అని చెప్పడంతో అతడు నా ఓటరు, ఆధార్ నంబర్లను అడిగాడు. ఆ వివరాలను ట్యాబ్ లోకి ఎక్కించాడు. నాఓటు ఉంటుందో, ఊడగొడ్తారో తెలియ డం లేదు. - మునిరాజ్, మత్యం, తవణంపల్లె