ఇంకెన్నాళ్లిలా.?

Students Suffering In Bandaru Polytecjnic College - Sakshi

బందరు పాలిటెక్నిక్‌ కళాశాలలో సమస్యల తిష్ట

ఫలితాలు ఘనం–వసతులు శూన్యం

సొంతభవనాలు లేక     నిర్వహణకు ఇబ్బందులు

పదేళ్లుగా పరాయి పంచన కాలం వెళ్లదీస్తున్న వైనం

సాంకేతిక విద్యకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. బందరు పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు సమస్యలతో సావాసం చేస్తూ చదువులు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్‌ కళాశాలకు నేటికీ సొంత భవనాలు లేవు. చిలకలపూడి రైల్యేస్టేషన్‌కు సమీపంలో గల ఓ ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన భవనాలను అద్దెకు తీసుకొని, అందులో కళాశాలను నిర్వహిస్తున్నారు. అక్కడ సరైన మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు.

కృష్ణాజిల్లా ,మచిలీపట్నం: మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను 2009లో ఏర్పాటు చేశారు. సివిల్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బ్రాంచిలో 60 మంది విద్యార్థులకు అడ్మిషన్‌లను కల్పిస్తున్నారు. నిష్ణాతులైన అధ్యాపకుల బోధనతో కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభను చాటుతున్నారు. గత ఏడాది మెకానికల్‌లో 95 శాతం, సివిల్‌ ఇంజినీరింగ్‌లో 85 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల నమోదులో రాష్ట్రంలో నాలుగో స్థానంలో మచిలీపట్నం కళాశాల నిలుస్తోంది. కళాశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు ప్రతిభ పురస్కారాలను కూడా అందుకున్నారు.

పదేళ్లుగా పరాయి పంచన..
ఫలితాల్లో ఘనకీర్తిని సాధిస్తున్న పాలిటెక్నిక్‌ కళాశాల పదేళ్లుగా పరాయి పంచన కాలం వెళ్లదీస్తోంది. కలెక్టరేట్‌ సమీపంలోని ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన భవనాల్లో ఆరు ఏళ్ల పాటు నిర్వహించారు. ఆ భవనాలు శిథిలావస్థకు చేరటంతో, అక్కడ నుంచి చిలకలపూడిలోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలోని భవనాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు.

వసతులు కరువు..
నెలకు రూ. 23 వేలు వరకూ అద్దె చెల్లిస్తున్నప్పటకీ, ఇక్కడ కళాశాల నిర్వహణకు సరైన వసతులు లేకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాల, మరో పక్కన ఓ ప్రైవేటు సంస్థ ఉపాధి శిక్షణ, ఇదే ప్రాంగణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల నిర్వహణ, ఇలా అంతా గందరగోళంగా ఉంది. సరిపడా భవనాలు లేకపోవటంతో సాంకేతిక విద్యాబోధన కోసమని తీసుకొచ్చిన పరికరాలను కూడా వినియోగించలేని పరిస్థితి ఏర్పడుతోంది.

సమస్యలతోనే చదువులు..
పాలిటెక్నిక్‌ కళాశాలలో సరైన వసతులు లేకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంతభవనాలు లేక తరగతుల నిర్వహణకు కూడా ఇబ్బందిగానే ఉందని అధ్యాపకులు సైతం అంగీకరిస్తున్నారు. ఒక్కో బ్రాంచికి 60 మంది చొప్పున వాస్తవంగా ఇక్కడ 320 మంది విద్యార్థులు ఉండాలి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం వంటి ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అడ్మిషన్‌లు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ నెలకొన్న ఇబ్బందులను చూసిన తర్వాత విద్యార్థులు చాలా మంది వేరే కళాశాలకు బదిలీ చేయించుకోవటం, మరికొంతమంది మధ్యలోనే మానేసి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కళాశాలలో 219 మంది విద్యార్థులు ఉన్నారు. కో–ఎడ్యుకేషన్‌ అయినప్పటికీ, కళాశాలకు అనుబంధంగా హాస్టల్‌ వసతి లేకపోవటంతో బాలికలు చేరేందుకు ఆసక్తి చూపటం లేదు. సరిపడా తరగతి గదులు అందుబాటులో లేకపోవటంతో కళాశాలకు చెందిన ఫర్నీచర్‌ ఆరుబయటనే పెడుతున్నారు. సామగ్రిని తరగతి గదుల్లోనే ఉంచుతున్నారు. డిజిటల్‌ తరగతుల నిర్వహణ సవ్యంగా జరగటం లేదు. 

నిధులు మంజూరయ్యాయి..
సొంత భవనాలు లేకపోవటంతో కళాశాల నిర్వహణ కొంత ఇబ్బందిగానే ఉంది. శాశ్వత భవనాల నిర్మాణం కోసం కృష్ణా యూనివర్సిటీ సమీపంలో 11.93 ఎకరాల భూమిని కేటాయించారు. భవనాల కోసం రూ. 9 కోట్లు మంజూరైనట్లుగా సమాచారం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాల్సి ఉంది. విద్యార్థులకు నాణ్యమైన బోధన సాగేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.– ఎం. శార్వాణి, కళాశాల ప్రిన్సిపల్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top