విద్యార్థిని అనుమానాస్పద మృతి

Student mysterious death In Anantapur - Sakshi

కళాశాల యాజమాన్యమే  కారణమని బంధువుల ఆరోపణ 

 బాధ్యులపై చర్యలు  తీసుకోవాలని ఆందోళన   

తెలతెలవారుతుండగా చదువులమ్మ ఒడిలో చావుకేక. విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలేజీ టాపర్‌గా పేరు తెచ్చుకున్న అమ్మాయి జీవితం ఎవ్వరూ ఊహించని విధంగా అర్ధంతరంగా ముగియడం తోటి విద్యార్థినులకు షాక్‌ ఇచ్చింది. ఉరికి వేలాడుతున్న స్నేహితురాలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు.  

అనంతపురం సెంట్రల్‌: ‘అనంత’లో ఇంటర్‌ విద్యార్థిని మృతి కలకలం రేపింది. వివరాల్లోకెళితే.. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లికి చెందిన వెంకట    లక్ష్మి, సూర్యనారాయణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె  నాగేశ్వరి(17) అనంతపురం నగర శివారులోని ఎస్‌ఎల్‌ఎన్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి గదిలో నిద్రించిన నాగేశ్వరి శనివారం తెల్లవారుజామున వసతిగదులకు (డార్మెటరీ) సమీపంలో ఉన్న ల్యాబ్‌ గదిలో ఫ్యానుకు చీరతో వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. తోటి విద్యార్థినులు గమనించి కళాశాల యాజమాన్యానికి విషయం చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న కళాశాల యాజామన్యం కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమందించారు. తల్లిదండ్రులు హుటాహుటిన అనంతపురం చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.  

కళాశాల వద్ద ఉద్రిక్తత  
తమ కుమార్తె మృతికి యాజమాన్యమే కారణమని నాగేశ్వరి తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, సూర్యనారాయణ బంధువులతో కలిసి కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం 6.30 గంటలకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారని, తాము వచ్చేలోగానే మృతదేహాన్ని మార్చురీకి తరలించేయడం అనుమానాలు కలిగిస్తోందని ఆరోపించారు. అమ్మాయిల హాస్టల్‌కు పురుష వార్డెన్‌ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. నాగేశ్వరి చనిపోయిన వెంటనే వార్డెన్‌ ఎలా పారిపోతారని నిలదీశారు. 

తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు బుర్రా జయరవర్దన్‌రెడ్డి, సీమకృష్ణ, రామన్న, లింగారెడ్డి, రవీంద్రరెడ్డి, వెంకటప్ప తదితరులు ఆందోళనకు మద్దతు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆందోళన కొనసాగించారు. కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా పీడీఎస్‌యూ నాయకులు విజయ్‌ను స్పెషల్‌పార్టీ పోలీసులు కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనతో కళాశాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎస్పీ వెంకట్రావ్, సీఐలు రాజశేఖర్, ఆరోహణరావు, విజయభాస్కర్‌గౌడ్, పదుల సంఖ్యలో ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం సదరు విద్యార్థి నేత సర్వజనాస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top