విభిన్న విద్యావంతులపై వింత ప్రేమ!

Strict rules in handicapped bikes distribution

పెట్రోల్, బ్యాటరీ వాహనాల మంజూరులో కఠిన నిబంధనలు

80 శాతం వైకల్యంతోపాటు పీజీ విద్యార్హత

మండిపడుతున్న దివ్యాంగులు

ప్రభుత్వం ప్రకటిస్తున్న కొన్ని పథకాలు కేవలం ప్రచారానికే అన్న అనుమానం కలిగిస్తున్నాయి. ఊరించేలా ప్రకటనలు గుప్పించడం.. తర్వాత కఠిన నిబంధనలు విధించడం పరిపాటిగా మారింది. విభిన్న విద్యావంతుల(దివ్యాంగులు)కు మూడు చక్రాల పెట్రోల్‌ వాహనాలు, బ్యాటరీ వీల్‌ చైర్స్‌ అందించే కార్యక్రమం కూడా ఇదే కోవలోకి చేరుతోంది.

శ్రీకాకుళం, సీతంపేట:  దివ్యాంగులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. శారీరక వైకల్యం కలిగిన వారికి మూడు చక్రాల పెట్రోల్‌ వాహనాలు, బ్యాటరీ సాయంతో నడిచే వీల్‌ చైర్‌లను ఉచితంగా అందిస్తామంటూ గత నెల 15న సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో దరఖాస్తులు ఆహ్వానించే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల శాఖ ద్వారా ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దివ్యాంగులు సైతం తమకు వాహనాలు వస్తాయని ఎంతో ఆనందించారు. అయితే నిబంధనలు చూస్తే అవాక్కవ్వడం తప్పదు. వీటిని నిశితంగా పరిశీలిస్తే వాహనాలు ఇవ్వడానికా, లేక ప్రకటనలకేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2,450 మందికి  మూడు చక్రాల మోటార్‌ వాహనాలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీని ప్రకారం సగటున జిల్లాకు రెండు వందల వరకు యూనిట్లు మంజూరవుతాయి. వీటిలో పాటు బ్యాటరీతో నడిచే వీల్‌చైర్లు 175 మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇవి కూడా జిల్లాకు 15లోపు వస్తాయి. ఈ నెల 16లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆ పత్రాలను ప్రింట్‌ అవుట్‌ తీసి ఈ నెల 23లోపు వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయానికి అందజేయాలని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 40 వేల మంది వరకు శారీరక వైకల్యం ఉన్నవారు ఉన్నారని అంచనా. వీరిలో 80 శాతం అర్హులంటే సుమారు 8 వేల వరకు ఉంటారని సమాచారం. వీరిలో పీజీ చేసి స్వయం ఉపాధి యూనిట్లు నిర్వహించే వారు మరింత అరుదుగా ఉంటారు.

ఇవేం నిబంధనలు..
మూడు చక్రాల వాహనానికి దరఖాస్తు చేసుకోవాలంటే 80 శాతం వైకల్యంతో పాటు 18– 40 ఏళ్లు లోపు వయస్సు, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివి ఉండాలి. లేదంటే పదో తరగతి చదివి, స్వయం ఉపాధిలో మూడేళ్లు అనుభవం ఉండాలి. పీజీ విద్యార్హత సర్టిఫికెట్‌తో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్, స్వయం ఉపాధి యూనిట్‌ ఫొటో జత చేయాల్సి ఉంది. బ్యాటరీ వీల్‌చైర్స్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి చదివి ఉండాలనే నిబంధన విధించారు.

లైసెన్స్‌లు ఎలా..?
సాధారణంగా ఉండే పురుషులు, స్త్రీలు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు పొందేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటిది దివ్యాంగులకు వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తప్పనిసరని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దివ్యాంగులకు ఇన్‌వ్యాలిడిటీ వెహికిల్‌ కింద ఎల్‌ఎల్‌ఆర్‌ను అందించే వీలుంది. దివ్యాంగులు నడపగలిగిన వాహనాన్ని కొనుగోలు చేసి రవాణా శాఖా కార్యాలయంలో సంప్రదిస్తే అక్కడ నిబంధనలు పాటిస్తే ఎల్‌ఎల్‌ఆర్‌ను జారీ చేస్తారు. వాహనాలు కొనుగోలు చేసే స్థోమత ఉన్న వారే లైసెన్స్‌లకు వెళ్తారని, అలాంటప్పుడు ముందస్తు డ్రైవింగ్‌ లైసెన్స్‌ అడగడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇవీ అర్హతలు...
పెట్రోల్‌స్కూటర్లు/బ్యాటరీ వాహనా లు పొందాలంటే 80 శాతం వికలాంగత్వం ఉండాలి.సదరం వైద్య ధ్రువపత్రం ఉండాలి.
18–40 ఏళ్ల వయస్సు కలిగినవారు.
పీజీ/ప్రొఫెషనల్‌ కోర్సులను ప్రస్తుతం అభ్యసిస్తున్న విద్యార్థులు గానీ, కనీసం పదోతరగతి ఉత్తీర్ణులై ఉండి, మూడేళ్ల వ్యాపార అనుభవం ఉన్నవారు.
ప్రభుత్వం ఆర్థోపెడిక్‌ సివిల్‌ సర్జెన్‌ ఇచ్చిన మెడికల్‌ ఫిట్‌నెస్‌ ధ్రువపత్రంతో పాటు నోఅబ్జెక్షన్‌ ఫర్‌ డ్రైవింగ్‌ ధ్రువపత్రం సమర్పించాలి.
మోటార్‌ వాహన చట్టం ప్రకారం లైసెన్స్‌ కలిగి ఉండాలి
మూడు చక్రాల కుర్చీకోసం వైద్యనిపుణుడి ధ్రువీకరణ పొందాలి.

దివ్యాంగులకు ఇన్ని నిబంధనలా?
దివ్యాంగులకు ఇన్ని నిబంధనలు విధించడం తగదు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలు పరిశీలిస్తే ఏ ఒక్కరికీ యూనిట్లు మంజూరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వాహనాలకు దరఖాస్తు చేయడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికైనా నిబంధనలు సడలించి అర్హులందరీకి పెట్రోల్‌ వాహనాలు మంజూరు చేయాలి.
–విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top