
తిరుమలలో తొక్కిసలాట
తిరుమలలో ఆదివారం కూడా గంటగంటకూ రద్దీ పెరిగి క్యూలలో తొక్కిసలాటలు జరిగాయి. పలువురు భక్తులు గాయాలపాలయ్యారు.
సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం కూడా గంటగంటకూ రద్దీ పెరిగి క్యూలలో తొక్కిసలాటలు జరిగాయి. పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. క్యూలలో చంటి బిడ్డలు, వృద్ధుల రోదనలు మిన్నంటాయి. బ్రహ్మోత్సవాలు ముగిసినా దసరా, బక్రీద్ సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ ఇంకా పెరిగింది. ముందుజాగ్రత్తగా ఆదివారం కూడా కాలిబాట భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వలేదు. ముందుగా ఇచ్చిన రూ. 300 ఆన్‌లైన్ టికెట్ల భక్తులు 11వేల మందితో పాటు సర్వదర్శనం మాత్రమే అమలు చేశారు.
గంటగంటకూ పెరిగిన భక్తుల రద్దీ వల్ల తొక్కిసలాటలు జరిగాయి. గాయపడినవారిని అంబులెన్స్‌లో అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. పరిస్థితి గుర్తించిన జేఈవో శ్రీనివాసరాజు రెండు రోజులుగా తిరుమలలో నిలిచిపోయిన చంటి బిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులకు సోమవారం నుంచి ప్రత్యేక దర్శనం అమలు చేయాలని ఆదేశాలిచ్చారు.
సర్వ దర్శనానికి ప్రాధాన్యం : జేఈవో
కనీవినీ ఎరుగని రీతిలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారని, దానివల్ల కేవలం సర్వదర్శనానికే ప్రాధాన్యం ఇచ్చామని జేఈవో కే ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. రెండు వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లలోనూ సర్వదర్శనం భక్తులనే అనుమతించి త్వరగా దర్శనం కల్పించామన్నారు. కాలిబాట భక్తులకు ఆదివారం కూడా దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వలేదని, సోమవారం కూడా రద్దు చేశామన్నారు. వీఐపీ దర్శనాలు కూడా రద్దు చేశామన్నారు. రద్దీ తగ్గిన తర్వాతే రూ. 300 టికెట్ల కరెంట్ బుకింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.
పెరిగిన రద్దీ..
ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 50 వేల మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. గదుల కోసం భక్తులు నిరీక్షించారు.