మేకవన్నె మృగాడు

Special Story On Children Sexual Assaults  - Sakshi

జనారణ్యంలో మానవ మృగాలు

బాలికలపై నానాటికీ పెరుగుతున్న అత్యాచారాలు 

‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు’ అన్న సినీ కవి మాటలు అక్షర సత్యమయ్యాయి. ఎక్కడో ఒక చోట నిత్యమూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోయి కబళిస్తున్నాయి. తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తులు, విద్యా బుద్దలు నేర్పించే గురువులు, వయస్సుతో సంబంధం లేకుండా అకృత్యాలకు ఒడిగడుతున్నారు. ముక్కుపచ్చలారని బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఏటా జిల్లాలో సగటున 50 వరకు  ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బుధవారం రాత్రి అనంతపురంలోని ఎర్రనేలకొట్టాలలో ఐదేళ్ల బాలికపై స్థానికంగా నివాసముంటున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన నగర వాసులను భయభ్రాంతులకు గురి చేసింది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు అమలవుతున్నా..  క్షేత్రస్థాయిలో నేరాలకు అడ్డుకట్ట పడకపోవడం వ్యవస్థ పతనావస్థకు అద్దం పడుతోంది.     – అనంతపురం సెంట్రల్‌ 

నేరాల నియంత్రణకు కఠినమైన చట్టాలు 
అత్యాచార నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో ఆమోదం లభించింది. ఆ ఏడాది జూన్‌ 19న ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జూన్‌ 20న భారతదేశం గెజిట్‌లో నోటిఫై చేశారు. చట్టంలో పేర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలపకపోయినా 18 సంవత్సరాలలోపు ఏ వ్యకిపైనైనా లైంగిక కలయిక జరిగితే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. ఇప్పటి వరకూ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 375 ప్రకారం 16 సంవత్సరాలలోపు వ్యక్తి ఆమోదం తెలిపినా, తెలపకపోయినా అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. కానీ, ఇప్పుడు కొత్త చట్టం, నిబంధనల ప్రకారం అది 18 సంవత్సరాల వయసు గల ఏ వ్యక్తికైనా వర్తిస్తుంది.
 
పిల్లలపై లైంగిక అత్యాచారం చేస్తే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, అపరాధ రుసుము లేదా జీవిత ఖైదు కూడా విధించవచ్చు. (ఇటీవల రాష్ట్రపతి ఉరిశిక్ష అమలుపై ఆమోదం తెలిపారు. )  
పిల్లలపై అత్యాచారం లేదా వేధింపులకు గురిచేస్తే మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము, అశ్లీల దృశ్యాలకు, సాహిత్యానికి వాడుకుంటే ఐదేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము,       రెండోసారి అదే నేరంపై దొరికితే  ఏడేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము విధించవచ్చు.  
నిపుణులకు, ప్రత్యేక అధ్యాపకులు, అనువాదకులు, వ్యాఖ్యాతలకు ఉండాల్సిన అనుభవం, అర్హతలను పొందుపరిచారు. అలాగే బాలల అత్యవసర వైద్య చికిత్స, ఆదరణ, రక్షణకు కావాల్సిన ఏర్పాట్ల గురించి, లైంగిక దాడి బాధితులైన పిల్లలకు కు ఇచ్చే నష్టపరిహారం పొందుపరిచారు.  
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలో ఉన్న మహిళా పోలీసు అధికారి, బాధిత పిల్లలు తెలిపే విషయాలను, ప్రామాణిక న్యాయసాక్ష్యంలాగా లిఖితపూర్వకంగా భద్రపరుస్తారు. పిల్లలను పోలీసు స్టేషన్‌లో రాత్రి వేళల్లో ఏ కారణంగానూ ఉంచరాదు. పిల్లల నుంచి విషయాలను  లిఖిత పూర్వకంగా సేకరించేటప్పుడు పోలీసు అధికారి యూనిఫాంలో ఉండరాదు. పిల్లలు ఏ మాటలతో విషయాన్ని వివరిస్తారో, అదే రీతిలో దానిని రికార్డు చేయాలి.  
పిల్లల అవసరం మేరకు చెప్పిన మాటలను అనువదించడానికి సహకారం కల్పించాలి. ఒకవేళ పిల్లలు వికలాంగులై అశక్తతకు గురైనవారైతే, వారికి ప్రత్యేక శిక్షకులు, లేదా వారిని అర్థం చేసుకునేలా చెప్పేవారి సహకారాన్ని తీసుకోవాలి.  
వైద్య పరిశీలన/విచారణ సమయంలో పిల్లల తల్లి/తండ్రి కానీ, వారికి నమ్మకం కలిగిన వ్యక్తి సమక్షంలో జరపాలి. బాలిక పరిశీలన/విచారణ మహిళా డాక్టర్లు చేయాలి.  
విచారణ, పరిశోధన, సాక్షి రికార్డింగ్, నేరాలను నిషేధించేటప్పుడు బాలల స్నేహ పద్ధతులను ఈ చట్టం, నిబంధనలను అందిస్తుంది. న్యాయవిచారణ జరిగే సమయంలో బాలలకు తరచూ విరామం కలిగించాలి. పిల్లలను విచారణ జరిపేటప్పుడు, మళ్లీ మళ్లీ సాక్ష్యమివ్వడానికి పిలవరాదు. పిల్లల విచారణ అనేది దాడి చేసే మాదిరిగా ఉండరాదు. వారి ప్రతిష్టకు అవమానం కలిగించేటట్లు ఉండరాదు. విచారణ అందరి సమక్షంలో కాకుండా గోప్యంగా జరపాలి.  
పలు అంశాలు (బాధితురాలు గర్భవతి అయితే, లైంగిక వ్యాధులు ప్రబలితే వైద్య చికిత్సకు అవసరమైన డబ్బును బట్టి మొదలగునవి) పరిగణలోకి తీసుకుని ప్రత్యేక కోర్టు విచారణ త్వరగా జరపాలనే ఉద్దేశ్యంతో బాలల విచారణ, విషయాలను భద్రపరిచే చర్యను 30 రోజలలోపు చేయాలి. ప్రత్యేక కోర్టు న్యాయ విచారణ ఏడాదిలోపు పూర్తి చేయాలి.
 
ఫిర్యాదు అందిన తక్షణమే ప్రత్యేక బాలల పోలీసు బృందం (ఎన్‌.జె.పి.యు) రంగంలో దిగి బాధితుల సహాయం, పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. పిల్లలకు ఆదరణ, రక్షణ కల్పించే షెల్టర్‌ హోం కానీ, అస్పత్రికి కానీ తరలించాలి. ఫిర్యాదు వచ్చిన తరువాత స్థానిక పోలీసు లేదా ఏస్‌జేపీయూ ‘బాలల సంక్షేమ సమితి’ ఎదుట 24 గంటలలోపు నివేదికను ప్రవేశపెట్టాలి.  
ఈ చట్టం, నిబంధనల సదుపాయాలను జాతీయ లేదా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌లు పర్యవేక్షణ చేస్తాయి.  

పిల్లలు సురక్షితంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అన్ని అసమానతల నుంచి వారిని కాపాడాలని అనుకుంటారు. రోజు వారి పనుల్లో భాగంగా చాలా మంది వ్యక్తులతో పిల్లలు సంప్రదిస్తుంటారు. ఇలాంటి వారిలో మంచి వారు, చెడ్డ వారు ఉంటారు. వారిలో ఉన్న నైజాన్ని పిల్లలు పసిగట్టగలగాలి. తద్వారా వారు ఏదైనా విచిత్రమైన పరిస్థితి లేదా వ్యక్తి తారసపడితే ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. ఇందులో భాగంగానే పిల్లలకు మంచి స్పర్శ.. చెడు స్పర్శ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.  రండి, పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరిగేందుకు చేతులు కలపండి. మంచి, చెడు స్పర్శల గురించి పిల్లలకు నేర్పండి.    – సాక్షి, అనంతపురం 

తల్లిదండ్రులు దేని కోసం చూడాలి? 
పిల్లలను పెంచేటప్పుడు అప్రమత్తత అవసరం. పిల్లల చుట్టూ ఉన్న అపరిచితులను గుడ్డిగా నమ్మరాదు. ఎదుటి వ్యక్తి వింత ప్రవర్తనను పసిగట్టగలగాలి. పిల్లలు బాధపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. ప్రత్యేకించి దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి స్నేహితుడో, కుటుంబ సభ్యుడో, జీవిత భాగస్వామినో అయితే పిల్లల భద్రత, వారి ఆనందం పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లలకు శరీరంలోని కొన్ని ప్రాంతాలు వారి సొంతమనే భావనను పెంపొందించాలి.

వాటి సంరక్షణపై జాగ్రత్తలు వివరించాలి. చొరబాటుదారుల నుంచి వాటిని ఎలా రక్షించుకోవాలో చైతన్య పరచాలి. విందులు.. వినోదాలు అంటూ ఆహ్వానించే అపరిచితులకు ‘నో’ చెప్పమనే స్థాయికి వారిని ఎదగనివ్వాలి. శరీరంలోని వ్యక్తిగత ప్రాంతాలను తాకితే తమకు అందుబాటులో ఉన్న వారిని వెంటనే అప్రమత్తం చేయగలిగేలా తీర్చిదిద్దాలి. గట్టిగా అరవడమో.. లేదా తిరగబడి పోరాటం చేసేలా సిద్ధపరచాలి.  
మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ గురించి పిల్లలకు అవగాహన కల్పించే చిట్కాలు లైంగిక విషయాలను పిల్లలకు తెలిసిన ఉదాహరణలతో వివరించండి.  
పిల్లలతో ముభావంగానో, టెక్నికల్‌గానో ఉండరాదు. ప్రశ్నించబడుతున్నట్లు వారు భావించేలా ఉండరాదు. తీవ్రమైన చర్చను వెంటనే కత్తిరించాలి. సున్నితమైన, ప్రశాంతమైన స్వరాన్ని ఉపయోగించండి. 
పిల్లలలకు తల్లిదండ్రులకు మధ్య నమ్మకమనే దృఢమైన బంధం ఉండాలి. ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రేమతో దగ్గరకు తీసుకుని నచ్చచెప్పగలగాలి. మీరు వారి కోసం ఉన్నారని భావనను వారికి తెలియజేయాలి.  
చెడు స్పర్శ గురించి చాలా చిన్న పిల్లలకు బోధించేటప్పుడు పాటించాల్సిన సాధారణ నియమం ఇది. లోదుస్తులతో కప్పబడిన వారి శరీరంలోని ఏదైనా భాగాలు వారి ప్రైవేట్‌ ప్రాంతం అని వివరించండి, అది వారు తప్ప మరెవరూ తాకకూడదు, చూడకూడదు అనే విషయంపై పూర్తి అవగాహన కల్పించాలి. వారి శరీరాలపై ఎక్కడైనా తాకితే వారు అసౌకర్యంగా భావిస్తే మీకు తెలియజేయాలని పట్టుబట్టండి.
మంచి స్పర్శ గొప్పగా అనిపిస్తుంది ఇది ఒక బంధం. చెడు స్పర్శ అసౌకర్యం, ఒత్తిడిని పెంచుతుంది.  
మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి పిల్లలకు నేర్పించేందుకు చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాలు సాధారణంగా మానవ శరీర నిర్మాణ శాస్త్రం యొక్క చిత్ర ప్రాతినిధ్యాలతో ఉంటాయి. దాని నుంచి వారు వారి శరీరాల గురించి కూడా తెలుసుకోవచ్చు. 
పిల్లలు ప్రాథమిక వివరణ కంటే దృశ్యమాన కథనాలకు అనుకూలంగా ఉంటారు. మీరు వారితో చిన్న ఆటలను ఆడవచ్చు, అక్కడ వారు సహాయం కోసం అరవడం లేదా ఎవరైనా వారిని వేధిస్తుంటే ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధం చేయవచ్చు.   
ఎవరైనా మీ ప్రైవేట్‌ భాగాలను కారణం లేకుండా తాకినట్లయితే, ఎవరైనా మిమ్మల్ని తాకి, ఎవరికీ చెప్పవద్దని చెబితే , ఇవన్నీ చెడ్డ స్పర్శకు సంకేతాలు.  
పిల్లలతో ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. వారు పగటిపూట చేసిన పనిని వివరిస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. వారు మీతో ఏదైనా పంచుకోవచ్చుననే భరోసా ఇవ్వగలగాలి. మా పని ఇంకా పూర్తి కాలేదనో,  గట్టిగా అరుస్తూ హెచ్చరికలు చేయడం సరికాదు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా ఎదుర్కొంటే ఏమి చేయాలో నేర్పించాలి.   

నిందితులను వదిలే ప్రసక్తే లేదు 
ఆడపిల్లలపై అత్యాచార యత్నాలు, అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.  క్రూరులను వదిలే ప్రసక్తే లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు. అనంతపురంలో గురువారం జరిగిన ఘటన చాలా దారుణమైనది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిందితుడికి కఠిన శిక్ష పడేలా కృషి చేస్తా.                   – ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం  

చావు తప్పదన్న భయం ఉండాలి 
ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు ఉండాలి. కొన్ని నెలలు జైలులో ఉండి బయటకు వస్తామనే భావన వారిలో ఏ మాత్రం రానివ్వరాదు. తప్పు చేస్తే మరణశిక్ష పడుతుందనే భయం ఉండాలి.  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక బాలికపై జరిగిన యాసిడ్‌ దాడి ఘటనలో నిందితులను ఎలా శిక్షించారో.. ఆ తరహా శిక్షలను ఇక్కడ కూడా అమలు చేయాలి. అనంతపురం ఘటనను ఖండిస్తున్నా.   
– జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే, శింగనమల  

కఠిన చర్యలు తప్పవు 
బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నాయి. లైం గిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ప్రస్తుతం మారిన చట్టం ప్రకారం ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. జిల్లాలో బాలికల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటాం. జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనపై కఠినంగా వ్యవహరిస్తున్నాం.  
– బూసారపు సత్యయేసుబాబు, ఎస్పీ  

మార్పు రావాలి 
మానవత్వానికి, మృగత్వానికి జరుగుతున్న సంఘర్షణ ఇది. మానవత్వాన్ని గెలిపించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు మగ పిల్లలను పెంచే విధానంలో మార్పు రావాలి. ఆడపిల్లలను తనను తాను రక్షించుకునే విధంగా తయారు చేయాలి. చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమాజం కూడా ఇలాంటి వారిని బహిష్కరించాలని కోరుతున్నా.    – కె. చౌడేశ్వరి, అదనపు ఎస్పీ 

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం 
అమ్మాయిల ర క్షణ కోసం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అ నేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ము ఖ్యంగా ఫోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం. అయినా నేరాలు జరుగుతుండడం బాధాకరం. ప్రస్తుత బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇద్దరు పిల్లలకు బాలసదనంలో ఆశ్రయం కల్పించి వారి చదువుకు సహకరిస్తాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం.  
– చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్‌   

దురదృష్టకరం 
భగవంతుడితో స మానమైన ప సిమొగ్గల్ని  చిదిమేస్తున్న నరరూప రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలి. చట్టాలు కఠినంగా ఉంటే ఇలాంటి ప రిస్థితులు పునరావృతం కావు. ఏదేమైనా పిల్లల భద్రత పరమైన అంశాల్లో తల్లిదండ్రుల్లో జాగ్రత్తతో ఉండడం మంచిది. విపరీత ప్రవర్తన గల వారికి ప్రత్యేకమైన కౌన్సెలింగ్‌ నిర్వహించే వ్యవస్థ ఉండాలి.  
– ప్రొఫెసర్‌ ప్రశాంతి, డైరెక్టర్‌ , జేఎన్‌టీయూఏ 

గల్ఫ్‌ చట్టాలు రావాలి 
గల్ఫ్‌ దేశాల్లో అమలు చేసే కఠిన చట్టాలు ఇక్కడ కూడా అమలు కావాలి. అప్పుడే నేర ప్రవృత్తి తగ్గే అవకాశం ఉం టుంది. నరరూప రాక్షసుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి. పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్బడే వారికి తక్షణమే శిక్ష పడేలా వ్యవస్థలో మార్పు రావాలి.  – ప్రొఫెసర్‌ కృష్ణకుమారి, జియాగ్రఫీ, ఎస్కేయూ అనంతపురం  

ఒకరిని ఉరి తీయాలి 
చిన్నారిపై అఘాయిత్యం జరిగిందని ఊహించుకుంటుంటేనే ప్రాణం పోయినట్లైంది. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన ఒకరిని నడి రోడ్డులో ఉరి తీయాలి. అప్పుడే అంతా సెట్‌ అవుతారు. ఇలాంటి విషయాలు మళ్లీ జరగకుండా న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. ప్రజలే శిక్షించేలా అవకాశం కల్పించాలి. నడిరోడ్డుపై రాళ్లు, కట్టలతో కొట్టి చంపాలి.  
– మృదుల, నర్సింగ్‌ విద్యార్థిని, అనంతపురం 

ఉరిశిక్షే సరైంది 
తప్పులు బహిరంగంగా చేస్తూ..శిక్ష మాత్రం రహస్యంగా అనుభవిస్తున్నారు. దీని ద్వారా తప్పు మీద తప్పులు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు, బాలికలు, అమ్మాయిలపై రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు నరరూప రాక్షసులు కూతుళ్లు, మనవరాళ్ల వయసున్న వారి పట్ల పాశవికంగా ప్రవరిస్తున్నారు. ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే ఉరి శిక్షే సరైంది. బహిరంగంగా ఉరి తీయాలి. అప్పుడే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు.       – డాక్టర్‌ ఉషశ్రీనాగ్, హౌస్‌సర్జన్, సర్వజనాస్పత్రి, అనంతపురం    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top