సీఎం జగన్‌ను కలిసిన దక్షిణ కొరియా బృందం

South Korean Delegation Meets CM Jagan In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి : దక్షిణ కొరియా ప్రతినిధుల బృందం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా విద్య, పరిశ్రమలు తదితర విషయాల గురించి సీఎం జగన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా సీఎం జగన్‌ ఆహ్వానించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో కూడిన క్లస్టర్‌ ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి వారికి ప్రతిపాదించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఈ క్లస్టర్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ క్రమంలో దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించాలంటూ ప్రతినిధుల బృందం ఆయనకు విజ్ఞప్తి చేశారు. సముద్ర ఆహారపు ఉత్పత్తులు, మామిడి ఉత్పాదకాల ఎగుమతుల్లో నాణ్యత ఉండేలా చూసేందుకు తగిన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు ఒక ప్రతినిధి ఇక్కడ ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు.

కాగా దక్షిణ కొరియా బృందం ఇప్పటికే మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజాను కలిసిన విషయం విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్య, పరిశ్రమల రంగంలో పెట్టుబడులకు అనువుగా ఉన్న పరిస్థితులను మంత్రులు దక్షిణ కొరియా బృందానికి వివరించారు. కాన్సూల్‌ జనరల్‌ ఆఫ్‌ రిపబ్లిక్‌ ఇండియా జంగ్‌ డియోక్మిన్‌, కొరియన్‌ ఫార్మాసుటికల్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిమ్‌ ఉన్‌సూక్‌, చూ యోంగిల్‌, కిమ్‌ జేయోల్‌ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన దక్షిణ కొరియా బృందంలో ఉన్నారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top