
గంజాయి తరలిస్తున్న ఆరుగురి అరెస్టు
కోటవురట్ల, కొత్తకోట ప్రాంతాల్లో గంజాయి తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను ఆయా ప్రాంతాల పోలీసులు అరెస్టు చేశారు.
కోటవురట్ల, కొత్తకోట ప్రాంతాల్లో గంజాయి తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను ఆయా ప్రాంతాల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి గంజాయి, తరలించేందుకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
కోటవురట్ల : గంజాయి తరలిస్తూ నలుగురు వ్యక్తులు స్థానిక పోలీసులకు పట్టుబడినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఆయన కథనం ప్రకారం ఏజెన్సీ నుంచి కోటవురట్ల మీదుగా గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతరోడ్డు సమీపంలో ఆటోలో గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 30 కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రోలుగుంట మండలం కన్నంపేటకు చెందిన పిల్లి కళ్యాణం, పిల్లి నూకరత్నం, ఎర్రి ప్రసాద్, బీబీపట్నానికి చెందిన కె.కృష్ణ ఉన్నట్టు ఎస్‌ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు ఆయన వివరించారు.
కొత్తకోటలో...
కొత్తకోట(రావికమతం): కొత్తకోట గ్రామం నుంచి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను, రూ.30వేల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు కొత్తకోట పోలీసులు తెలిపారు. హెచ్‌సీ సూరిబాబు కథనం మేరకు వివరాలిలావున్నాయి. గురువారంరాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా కొత్తకోట శివారు వాటర్ ప్లాంట్ వద్ద తమిళనాడుకు చెందిన శేఖర్ ప్రియస్వామి(44), ఆతని భార్య శకుంతల శేఖర్(40) అనుమానాస్పదంగా సంచరిస్తూ కన్పించారన్నారు. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, రూ.30 వేల విలువైన 12 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటిని రోలుగుంట మండలం దిబ్బలపాలెం గ్రామంలో కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చామని ఆయన వివరించారు.