‘అనంత’ ఆక్రందన

‘అనంత’ ఆక్రందన - Sakshi


కరువుల ముప్పేట దాడి.. అమలు కాని రుణమాఫీ.. ప్రైవేటు అప్పులతో కుదేలు

జూన్ నుంచి ఇప్పటి వరకూ 40 మంది  రైతుల ఆత్మహత్య

రుణాలు మాఫీకి బాబు ఇచ్చిన హామీపై కోటి ఆశలు పెట్టుకున్న అన్నదాత

బాబు సీఎం అయి ఆరు నెలలైనా పైసా మాఫీ కాలేదు

మరోపక్క బ్యాంకుల నుంచి పెరిగిన ఒత్తిళ్లు

జిల్లా రైతులపై వడ్డీ రూపంలో పడిన అదనపు భారమే రూ. 858.41 కోట్లు

అప్పులతో అల్లాడుతున్న రైతాంగం.. పట్టించుకోని చంద్రబాబు సర్కారు

ఇప్పటివరకు ఏడు కుటుంబాలకు మాత్రమే దక్కిన పరిహారం


(బి.గణేష్ బాబు, సాక్షి ప్రతినిధి): వరుస కరువులతో అల్లాడుతన్న అనంతపురం జిల్లా రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబుపై అన్నదాత కోటీ ఆశలు పెట్టుకున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పైసా రుణం మాఫీ కాలేదు. కొత్త అప్పులు పుట్టలేదు. పంటల కోసం రుణాలిచ్చిన బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వడ్డీ భారమూ రైతు వెన్ను విరుస్తోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక రైతన్న బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన జూన్ నెల నుంచి ఇప్పటివరకు జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.అయినా సర్కారులో చలనం లేదు. కొత్త రాష్టంలో అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికలకు ముందు ఈ జిల్లా నుంచే ‘మీ కోసం’ అంటూ పాదయాత్ర ప్రారంభించారు. ఈ జిల్లాలోనే రైతుల రుణ మాఫీని ఎన్నికల వాగ్దానంగా ప్రకటించారు. అధికారం చేపట్టాక ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి జులై 24, 25 తేదీల్లో ఈ జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 6న రెండోసారి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సాక్షిగా ‘వ్యవసాయ మిషన్’ను ఈ జిల్లాలోనే ప్రారంభించారు. అయినా ఈ జిల్లా రైతాంగం దయనీయ స్థితిని పట్టించుకోలేదు.

 

ఇదీ రైతుల రుణ భారం..

అనంతపురం జిల్లాలో 6.08 లక్షల మంది రైతులు రూ.3,093 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. మరో 2.12 లక్షల మంది రైతులు బంగారు తాకట్టు పెట్టి రూ.1,851 కోట్ల రుణాలు పొందారు. రూ.1,264 కోట్ల డ్వాక్రా రుణాలు, రూ.35.05 కోట్ల చేనేత సహకార రుణాలు ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాల మొత్తం రూ.6,234 కోట్ల వరకు ఉన్నాయి. ఏటా కరువులతో వ్యవసాయ అప్పులు తడిసిమోపెడైన జిల్లా రైతులు చంద్రబాబు ఇచ్చిన రుణాల మాఫీ హామీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈ హామీని బాబు సర్కారు ఓ ప్రహసనంగా మార్చింది. మరోపక్క రుణాలిచ్చిన బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రైతులపై ఒత్తిడి పెరుగుతోంది. రుణాలకు 13.75 శాతం వడ్డీ కట్టాలంటూ బ్యాంకులు ు నోటీసులిస్తున్నాయి. జిల్లా రైతులపై ఈ వడ్డీ భారమే రూ. 858.41 కోట్లు అదనంగా పడింది.  ‘పంటల బీమా’ కూడా అమలుకావడంలేదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. గత ఖరీఫ్ పంటల బీమా రూ.226 కోట్లు మంజూరైనప్పటికీ, బ్యాంకర్లు పంట రుణాల బకాయికి జమ చేసుకునే ఉద్దేశంతో ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ఇప్పటికీ జమ చేయలేదు.

 

421జీవో స్ఫూర్తికి విరుద్ధంగా...

చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో జిల్లా యంత్రాగం జీవో నెం 421 స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తోంది.  వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వెలువడిన ఈ జీవో బాధిత రైతు కుటుంబాలకు ఆసరానిస్తుంది. జీవోలో ఎక్కడా ‘రైతు ఆత్మహత్య’ అని పేర్కొనకుండా.. ‘వ్యవసాయ సంబంధిత విషయాల్లో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు’ అని చెప్పడం వెనుక అప్పటి ప్రభుత్వ దూరదృష్టి కనిపిస్తుంది. జీవోలో రైతు ఆత్మహత్య అని పేర్కొంటే చనిపోయిన రైతు పేర భూమి ఉంటేనే ఆ కుటుంబానికి పరిహారం వస్తుంది. చనిపోయిన వ్యక్తి కౌలు రైతో, వ్యవసాయ కూలీనో, హమాలీ పనో, ఇతర చేతి వృత్తుల్లోనే ఉంటే అధికారులు ఈ జీవోను వారికి వర్తింపజేయకపోతే ప్రమాదం ఉంది. అందువల్లే ‘వ్యవసాయ సంబంధిత విషయాల్లో ఆత్మహత్యలు’ అని పేర్కొన్నారు. ఇప్పటికి జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే పరిహారం అందించింది ఏడు కుటుంబాలకు మాత్రమే.ప్రభుత్వ సాయం పొందే అర్హత ఈ తల్లికి లేదా..?

ముగ్గురు పిల్లలతో దీనంగా ఉన్న ఈ మహిళ పేరు రామాంజనమ్మ. గుంతకల్లు మండలం వై.టి.చెరువు గ్రామం. భర్త సుధాకర్. ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. ఆ పొలంలోనే రూ.4 లక్షలు అప్పుచేసి 8 బోర్లు వేశాడు. చివరి బోరు నీరిచ్చింది. జూన్ 30వ తేదీ రాత్రి ఉల్లి పైరుకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. మోటర్ వేయగానే లోవోల్టేజితో ఆది కాలిపోయింది. సుధా కర్‌కు జీవితంపై విరక్తి కలిగి పురుగు మందు తాగి చనిపోయాడు. ఆ పొలం అతని తండ్రి పేరిటే ఉంంది. ఆ కుటుంబం జీవో 421 కింద పరిహారానికి అర్హమైనది కాదని అనంతపురం ఆర్డీవో తేల్చి చెప్పారు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు అత్యంత దయనీయ స్థితిలో ఉంది.

 క్షేత్రస్థాయి పరిశీలనతో సాయం అందిస్తాం : కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్

మండల స్థాయి అధికారుల నుంచి వచ్చే సమాచారం, పత్రికల్లో వచ్చే రైతు ఆత్మహత్యల ఆధారంగా విచారణకు ఆదేశిస్తున్నాం. గతంలో ‘సాక్షి’లో రైతు ఆత్మహత్యలపై వార్త వచ్చిన వెంటనే డివిజన్ స్థాయి అధికారులను పంపి కొన్ని కుటుంబాలకు పరిహారం చెల్లించాం. మరో ఐదారు కేసులపై విచారణ జరిపిస్తున్నాం. చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బందికి మరింతగా అవగాహన కల్పిస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top