ఫిట్‌.. లెస్‌..

School Bus Fitness Tests In West Godavari Rta - Sakshi

బస్సుల భద్రతను విస్మరిస్తున్న విద్యా సంస్థల యాజమాన్యాలు

జిల్లాలో ఫిట్‌నెస్‌ లేని బస్సులు 616

చర్యలు తప్పవంటున్న అధికారులు

తణుకు: పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో పిల్లలను చేర్పించుకునేందుకు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించిన పాఠశాలల యాజమాన్యాలు సకాలంలో అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకున్నాయి. అయితే పిల్లలను ప్రతిరోజు ఇంటి నుంచి స్కూల్‌కు, స్కూల్‌ నుంచి ఇంటికి తరలించే బస్సులను నిబంధనల ప్రకారం సిద్ధం చేయడంలో మాత్రం ఆసక్తి చూపడంలేదు. చిన్నారులను కొందరు తల్లిదండ్రులు తమ సొంత వాహనాలపై తీసుకెళుతున్నారు. మరికొందరు పాఠశాల బస్సుల్లో పంపుతున్నారు. ఇదిలా ఉంటే ఎక్కువ శాతం విద్యాసంస్థలు వారి బస్సుల ఫిట్‌నెస్‌ విషయంలో ఆర్టీఏ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. వి ద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లు తెరిచే నాటికి అన్ని స్కూళ్లు, కాలేజీల బస్సులకు ఫిట్‌నెస్‌లు పొందాలని ఇప్పటికే రవాణాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గత నెల 15 నుంచి ఆయా రవాణాశాఖ కార్యాలయాల్లో ప్రత్యేకంగా స్కూల్, కాలేజీ బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కార్పొరేట్, ప్రైవేట్‌ స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు వాటినే ఆశ్రయిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా వాటికి ఉన్న క్రేజ్‌తో రూ.వేలకు రూ.వేలు వెచ్చించి తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఫీజులు, పుస్తకాల ధరలమోత ఆకాశాన్నంటుతుంటే మరోవైపు ట్రాన్స్‌పోర్ట్‌ ఫీజు అంటూ కనీసం రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఆ బస్సులు ఏ కండిషన్‌లో ఉన్నాయనే విషయాన్ని పట్టించుకోవటం లేదు. జిల్లాలో మొత్తం 2,485 స్కూలు బస్సులు ఉండగా వీటిలో శుక్రవారం నాటికి 1,869 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించారు. మరో 616 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

ఉదయం పిల్లలతో స్కూలుకు బయల్దేరిన సరైన కండిషన్‌ లేని బస్సులు మధ్యలో మొరాయిస్తుంటే రోడ్డు పక్కన గంటల తరబడి నిలిపి  వాహనం మరమ్మతులు పూర్తయిన తర్వాత బయల్దేరిన సంఘటనలు కూడా లేకపోలేదు. స్కూల్‌ బస్సులు చిన్నపాటి ప్రమాదాలతో గండం గట్టెక్కిన సందర్భాలు గతేడాదిలో పదికి పైగానే ఉన్నాయి. తణుకు ప్రాంతంలోనే మూడు పర్యాయాలు బస్సులు మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ సంఘటనల్లో íపిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే పాఠశాలలు తెరిచినా ఇంకా జిల్లాలో 616 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించకపోవటం ఆయా విద్యాసంస్థల యాజమాన్యాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

పాటించాల్సిన నిబంధనలు ఇవే..
ప్రైవేటు విద్యాసంస్థలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు వాహనంలో కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించాలి. అయితే తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇష్టమొచ్చినట్లు పాతవాహనాలను, అనుభవంలేని డ్రైవర్లను నియమించి విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను తిప్పుతున్నారు.
మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం పాఠశాల బస్సులో తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
సామర్థ్యాన్ని బట్టి పిల్లలను ఎక్కించుకోవాలి. సామర్థ్యానికి మించి రెండు, మూడు రెట్లు పిల్లలను ఎక్కించుకుని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
స్కూల్, కాలేజీ బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు ఎక్ట్సింగ్విషర్‌ తప్పకుండా అమర్చాలి. అయితే బస్సుల్లో అది కనిపించదు.
బస్సులు అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు విద్యార్థులు బయట పడేందుకు వీలుగా అత్యవసర ద్వారం ఉండాలి. అయితే బస్సులకు గ్రిల్‌ వేసి అత్యవసర ద్వారం లేకుండా చేస్తున్నారు.
పాఠశాల బస్సులను నడిపే డ్రైవర్‌కు అయిదేళ్ల అనుభవంతోపాటు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి. తక్కువ జీతానికి వృద్ధులను డ్రైవర్లుగా తీసుకుని విద్యార్థులను ప్రమాదాలకు గురి చేస్తున్నారు. డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులతో అప్పుడప్పుడు పరీక్షలు చేయించి సంబంధిత ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉన్నప్పటికీ అవేమీ లేకుండానే కొనసాగిస్తున్నారు.
ప్రయాణంలో పిల్లలను ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం చేయడానికి ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు కూడా అందుబాటులో లేకుండా బస్సులు నడుపుతున్నారు.
చిన్నపిల్లలు బస్సు ఎక్కడానికి వీలుగా మెట్లు ఏర్పాటు చేయాలి. అయితే ప్రైవేటు స్కూలు బస్సులు ఎత్తుగా ఉండటంతో ఎక్కలేక విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top