పాపం పసివాళ్లు!

school building come to collaps students studying on rachabanda - Sakshi

శిథిల పాఠశాలకు పంపించబోమన్న గ్రామస్తులు

ఐదు రోజులుగా రచ్చబండపైనే చదువులు

కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు, ఆలస్యంగా వెళ్లిన అధికారులు

అభం, శుభం తెలియని చిన్నపిల్లలు రచ్చబండపై కూర్చుంటున్నారు. పాఠశాల వదిలేసి అక్కడెందుకు కూర్చుంటున్నారో వారికి తెలియదు. ఎండ తీవ్రత ఉన్నా... మబ్బులేసినా... చివరకు చినుకులు పడినా కదలడం లేదు. వారి గురించి పట్టించుకునే తీరికగాని, ఆలోచన కాని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులకూ లేకపోవడం ఇక్కడ చర్చాంశనీయమయ్యింది. వారి పుణ్యమాని రేపటి పౌరులు రచ్చబండపైనే మగ్గిపోతున్నారు.

విజయనగరం , చీపురుపల్లి: మండలంలోని యలకలపేట గ్రామానికి రెండేళ్లుగా పాఠశాల భవనం మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఉన్న భవనం శిథిలావస్థకు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు పైపెచ్చులు కాస్తా ఊడిపడ్డాయి. ఇక గ్రామస్తులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపించబోమని ఆ భవనానికి తాళాలు వేసి భీష్మించుకు కూచున్నారు. ఉపాధ్యాయుల చొరవతో రచ్చబండపై చదువులు చెబుతున్నారు. ఇదంతా జరిగి ఐదు రోజులు కావస్తోంది. ఇంతవరకు ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకు కన్నెత్తి అటువైపు చూడలేదు. మంగళవారం ఉదయం వర్షం ప్రారంభమైనప్పటికీ గ్రామస్తులు పాఠశాల తాళం తీయనివ్వలేదు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు రచ్చబండపైనే చినుకుల్లో తడుస్తూ గడిపారు.

ప్రమాదకరంగా రెండు భవనాలు....
ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడి పాఠశాలలో ఉన్న రెండు భవనాలు స్లాబుల పెచ్చులు ఊడి, శిథిలావస్థకు చేరుకున్నాయి. రెండేళ్లుగా నూతన భవనాలు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను స్థానికులు కోరుతూనే ఉన్నారు. కానీ అవన్నీ అరణ్యరోదనే అయింది. భవనాల పరిస్థితి దిగజారడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక చేసేదేమీ లేక ఈ నెల 6న పాఠశాలకు వారు తాళం వేశారు. గ్రామంలో రచ్చబండపైనే విద్యార్థులకు బోధన జరుగుతుందని తెలిసినా ప్రజాప్రతినిథులు కన్నెత్తి చూడలేదు. మరోవైపు విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో పరిస్థితుల్లో మార్పు రాలేదు.

ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత
పాఠశాల శిథిలావస్థకు చేరుకుం ది. స్లాబు పెచ్చులూడుతోంది. రెండేళ్లుగా భవనాలు మంజూరు చేయాలని అడుగుతున్నా ఎవ్వ రూ పట్టించుకోవడం లేదు. అం దుకే పిల్లలను పాఠశాలకు పంపించటం మానేశాం. పాఠశాల తలుపులు తెరవనివ్వకుండా తాళాలు వేశాం. ఐదురోజులుగా రచ్చబండపై ప్రస్తుతం బోధన సాగుతోంది.
 – పున్నాన సూర్యకాంతం, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, యలకలపేట

ఆ భవనం పనికిరాదు
యలకలపేట ప్రాధమిక పాఠశాల భవనం వినియోగించేందుకు పనికిరాదని ఇంజినీరింగ్‌ అధికారులు ధ్రువీకరించారు. అందుకే ఆ పాఠశాలను మరి తెరిచే అవకాశం లేదు. ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం. నూతన భవనాలు మంజూరుకు సర్వశిక్ష అభియాన్‌ పీఓకు, జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నాం. – పి.రామకృష్ణ, ఎంపీడీఓ, చీపురుపల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top