పచ్చ రంగు ఉంటేనే పథకాలు

Schemes for yellow boats only  - Sakshi

పడవలన్నింటికీ పచ్చరంగు తప్పనిసరి

లేకుంటే పథకాలు వర్తించవు

మత్స్యకారులకు తేల్చిచెప్పిన ప్రభుత్వం

ఒంగోలు టౌన్‌ :  రాష్ట్ర ప్రభుత్వానికి పచ్చ రంగు ప్రచారం పీక్‌ స్టేజీకి చేరుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలపై పచ్చ రంగును బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పథకాలు అందాలంటే పచ్చరంగు తప్పనిసరి అంటూ నిబంధనలు విధిస్తోంది.

తాజాగా పచ్చ రంగు ప్రచారం మత్స్యకారులు వేటకు వినియోగించే పడవలపై పడింది. మత్స్యకారులంతా తమ పడవలకు విధిగా పచ్చరంగు వేయించుకోవాలని లేకుంటే పథకాలు వర్తించవంటూ తేల్చిచెప్పింది. సముద్రంలో 61రోజుల పాటు చేపల వేట నిషేధించడంతో మత్స్యకారులు పడవలు, వలలు మరమ్మతులు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదే అదనుగా భావించిన ప్రభుత్వం పడవలన్నింటికీ పచ్చరంగు ఉండాలంటూ నిబంధనలు విధించింది. సముద్ర నీటిపై పడవ తేలాడుతున్న భాగమంతా పచ్చరంగు కనిపించాలని, నీటి అడుగుభాగం నీలం రంగుతో ఉండాలని ఉత్తర్వులు జారీచేసింది.

పైపెచ్చు పడవలకు పచ్చరంగు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారంటూ స్పష్టం చేసింది. దీంతో కొంతమంది మత్స్యకారులు విధిలేని పరిస్థితుల్లో తమ పడవలకు పచ్చ రంగు వేయించుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరికొంతమంది మాత్రం ప్రభుత్వ వైఖరిని తూర్పార పడుతుండటం గమనార్హం.

‘రంగు’ పడుద్ది

సముద్రంలో వేట సాగించే మత్స్యకారులు తమ పడవలకు తమకు ఇష్టం వచ్చిన రంగులను వేసుకుంటారు. ఆ రంగులను కూడా రకరకాల డిజైన్లతో వేసుకునేవారు. అయితే పడవలన్నింటికీ యూనిఫారంగా ఉండాలన్న సాకుతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పడవలన్నింటికీ పచ్చరంగు తప్పనిసరి చేసింది. జిల్లాలోని పదకొండు మండలాల్లో 102 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది.

12వేల మంది మత్స్యకారులు మూడురకాల పడవలను ఉపయోగించుకొని సముద్రంలో వేట సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం జిల్లాలోని తీర ప్రాంతాల్లో 42 మెకనైజ్డ్‌ బోట్లు, 2505 మోటరైజ్డ్‌ బోట్లు, 1649 సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఈ పడవల ద్వారా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి చేపలను వేటాడుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు.

ఈనెల 15వ తేదీ జూన్‌ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను నిషేధించారు. ఈ నిషేధ కాలంలో మత్స్యకారులు తమ పడవలు, వలలను మరమ్మతులు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని గమనించిన రాష్ట్ర ప్రభుత్వానికి తమ పార్టీ రంగు గుర్తొచ్చింది. మత్స్యకారులంతా తమ పడవలకు పచ్చ రంగు వేయాలంటూ తీర ప్రాంత జిల్లాలకు సర్క్యులర్‌ జారీ చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top