సంచయిత భావోద్వేగం..

Sanchaita Gajapati Raju Questioned Ashok Gajapathi Raju - Sakshi

విశాఖపట్నం: తాను ఎవరికీ భయపడబోనని, తానేంటో నిరూపించుకుంటానని సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సంచయిత గజపతిరాజు తెలిపారు. తన పనితీరు చూడకుండానే విమర్శలు చేయడం సరికాదని అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాన్సాస్‌ ట్రస్ట్‌ను సమర్థవంతంగా నడిపిస్తానన్న నమ్మకాన్నివ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. చీకటి జీవోతో తాను పదవి దక్కించుకున్నానని టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. చట్టబద్ధంగా తాను ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ అయ్యానని స్పష్టం చేశారు.

గతంలో అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని ట్రస్ట్‌ సభ్యురాలిగా నియమించి తనను విస్మరించారని వాపోయారు. ఆ రోజు తనను ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించారు. తన పట్ల టీడీపీ నాయకుల వ్యాఖ్యలు వివక్షాపూరితంగా ఉన్నాయని, మహిళలకు వారసత్వ హక్కు కల్పించింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. పురుషులతో సమానంగా పనిచేయగల సామర్థ్యం తనకు ఉందన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో చదువుకుంటున్న వారిలో 60 శాతానికిపైగా బాలికలు ఉన్నారని వెల్లడించారు. మహిళలను తక్కువగా అంచనా  వేయడం సరికాదని హితవు పలికారు. (చదవండి: మాన్సాస్‌లో పెనుమార్పు..!)

బాబాయ్‌ ఇలా మాట్లాడతారని అనుకోలేదు..
తాను హిందువుని కాదన్నట్టుగా తన బాబాయ్‌ అశోక్‌ గజపతిరాజు మాట్లాడటం పట్ల సంచయిత ఆవేదన చెందారు. బాబాయ్‌ ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదని కంటతడి పెట్టారు. ‘వాటికిన్‌ వెళ్లి ఫొటో దిగినంత మాత్రాన క్రిస్టియన్‌ అవుతానా? మీరెప్పుడూ మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు వెళ్లలేదా? ఎన్నోసార్లు వెళ్లి మీరు ఫొటోలు కూడా తీయించుకున్నారు. అంతమాత్రన మీరు హిందువు కాకుండా పోయారా? మీలాగే నేను ఇతర మతాల ప్రార్థనాలయాలకు వెళ్లాను. మహిళగా నాకు ఈ అవకాశం రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను హిందువును కాదంటూ నాపై కొందరు తప్పుడు ప్రచారం చేయడం దారుణం. సింహాచలం దేవస్థానాన్ని, మాన్సాస్‌ ట్రస్ట్‌ను రాజకీయంగా చూడొద్దు. నేను సేవ చేయడానికే వచ్చా. నాపై తప్పుడు ఆరోపణలు చేసే వారికి ఒకటే విజ్ఞప్తి. నా పనితీరును చూసి తీర్పు ఇవ్వండి. నాపై విమర్శలు చేసేవారికి పనితీరుతోనే సమాధానం ఇస్తా. మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఎన్టీఆర్‌ కల నెరవేరినందుకు టీడీపీ నేతలు సంతోషపడాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ మహిళలను కించపరిచేలా చూడటం తగదు. అవకాశాలిస్తే మహిళలు అన్నింటా రాణిస్తున్నారు.

 నా కుటుంబంలో వివాదాలపై న్యాయంపోరాటం కొనసాగిస్తున్నా. నా తల్లిదండ్రులు ఆనంద గజపతిరాజు, ఉమా గజపతిరాజు హిందువులు. వారి కుమార్తెగా నేను కూడా అదే బాటలో నడుస్తున్నాను. కుటుంబంలో ఎన్ని వివాదాలు ఉన్నా నేనెప్పుడూ చెడుగా చెప్పలేదు. పెద్దల పట్ల గౌరవంతో మౌనంగా ఉన్నాను.  ఈ దేశ న్యాయవ్యవస్ధపై, ప్రజలపైనా నాకు అచంచల విశ్వాసముంది.  సింహాచలం దేవస్ధానాన్ని పూర్తిస్ధాయిలో అభివృద్ది చేయడమే నా లక్ష్యం. ఇంటి కుటుంబ సభ్యులే నాపై ఆరోపణలు చేయడం బాధాకరం. అశోక్‌ గజపతిరాజు లాంటి పెద్దవాళ్లను నేను విమర్శించను. పెద్దవారిని గౌరవించాలని మా అమ్మ నాకు సంస్కారం నేర్పారు.

మహిళా సాధికారికత మా తాతగారి ఆశయం. ఆయన ఆశయాలకు అనుగుణంగా మాన్సాస్‌ ట్రస్ట్‌ని నడిపిస్తా. ఈ రోజు మాన్సాస్‌ ద్వారా మహిళలకి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేను దేశంలో‌ వివిధ ప్రాంతాలలో పెరిగా. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీలకతీతంగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నా.  మహిళగా నన్ను తక్కువ అంచనా వేసి చూడద్దు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. నేను రాసిన లేఖకి స్పందించి ప్రభుత్వం నాకు చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించడం నా అదృష్టం. ఏపీ ప్రభుత్వం మహిళలకి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం అభినందనీయం.  ప్రధాని‌ మోదీ కార్యక్రమాలకు ఆకర్షితులై నేను బీజేపీలో చేరాను.  పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగానే పనిచేస్తున్నా. బీజేపీలో నన్ను అభిమానించి, ప్రోత్సహించేవాళ్లూ ఉన్నారు. మహిళలపై చిన్నచూపుతోనే పార్టీలో కొందరు వ్యతిరేకించి ఉండవచ్చు.’అని సంచయిత వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top