అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి ఉసురు తీశాడు ఆ కర్కోటకుడు.
అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి ఉసురు తీశాడు ఆ కర్కోటకుడు. కారణాలేమిటో కానీ ముక్కుపచ్చలారని చిన్నారిని కడతేర్చాడు. ముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి రవి-రాజేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె లయశ్రీ(4)కి విషప్రయోగం చేసి ఆపై బావిలో పడేశాడు.
చిగురుమామిడి, న్యూస్‌లైన్ : ఈ నెల 22న అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న లయశ్రీని ఇంటికి తీసుకొచ్చిన తండ్రి వ్యవసాయ పనులకు వెళ్తూ తన బిడ్డను చూడండని ఇంటి పక్కన ఉన్నవారికి చెప్పి వెళ్లాడు. రవి ఇంటి సమీపంలోనే తన అన్న కుమారుడు పందిపెల్లి అనిల్ ఉంటాడు. సమీపంలోనే ఉండే మేరి రమ సహాయంతో అనిల్ లయశ్రీని తమ ఇంటికి పిలిపించాడు. విషం కలిపిన వేరుశనగలు(పల్లీలు) ఆ చిన్నారికి ఇచ్చి తినిపించి, వెంటనే లయశ్రీని బయటకు తీసుకెళ్లారని, గ్రామ శివారుకు వెళ్లేప్పటికి విషప్రభావంతో చిన్నారి మరణించగా.. కరుణాకర్‌రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో పడేసి ఇంటికి వచ్చినట్టు తెలిసింది. అనంతరం తమకేమీ తెలియనట్లుగా మిన్నకుండిపోయారు. వీరికి అనిల్ మేనమామ కొడుకు హుస్నాబాద్‌కు చెందిన గడిపె చందుతోపాటు మరొకరు, సుందరగిరికి చెందిన ఇంకొకరు సహకరించినట్లు సమాచారం. ఇంటి వద్దనే ఉండాల్సిన తమ చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెదికినా జాడలేకపోవడంతో గురువారం చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌లో అనుమానితులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో విచారించగా అనిల్, రమ కలిసి లయశ్రీని బయటకు తీసుకెళ్లినట్లు... అనంతరం ఇద్దరే తిరిగి వచ్చినట్లు తేలింది. అనిల్, రమ, చందులను అదుపులోకి తీసుకుని విచారించగా లయశ్రీని హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది.
వ్యవసాయ బావిలో పడేశామని చెప్పడంతో హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్, చిగురుమామిడి ఎస్సై జె.శంకర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బావిలో లయశ్రీ మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో బయటకు తీయించారు. విగతజీవిగా మారిన బిడ్డను చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణ సాగుతోందని, పోస్టుమార్టం నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ చెప్పారు. హత్యకు దారితీసిన కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.