జిల్లాలో రూ.195 కోట్ల విద్యుత్‌ బకాయిలు

Rs 195 crore electrical arrears in Nellore District - Sakshi

నాయుడుపేటటౌన్‌: నెల్లూరు జిల్లాలో విద్యుత్‌ బకాయిలు రూ.195 కోట్లకు పైగా పేరుకుపోయాయని, వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి జోన్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నందకుమార్‌ సూచించారు. నాయుడుపేట విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయంలో గురువారం ఆయన ఏడీఏలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో మండలాల వారిగా విద్యుత్‌ బకాయిలు, వినియోగదారుల సమస్యలు, మీటర్‌ రీడింగ్‌ విషయాలపై నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు అధికారులపై విరుచుకుపడ్డారు.

 సాయంత్రం డివిజన్‌ పరిధిలోని పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించి విద్యుత్‌ సమస్యలపై చర్చించారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి రేంజ్‌ పరిధిలోని కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి విద్యుత్‌ వినియోగదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, రివ్యూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమంగా విద్యుత్‌ను వినియోగించిన వారిపై దాడులు నిర్వహించి, వారికి విధించిన అపరాధరుసుము పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదని, ఒక్క నాయుడుపేటలోనే ఇందుకు సంబంధించి రూ.25 లక్షల బకాయిలు ఉన్నాయని తెలిపారు.

 వీటిపై వారం రోజుల లోపు నోటీసులు జారీ చేసి, నగదు వసూలయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ విజయ్‌కుమార్‌రెడ్డి, డీఈ ఆదిశేషయ్య, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి ఏడీఏఈలు ప్రభాకర్, విజయకుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, 12మండలాలకు చెందిన ఏఈలు, విద్యుత్‌ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

రైతులకు నిరాటంకంగా విద్యుత్‌
నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లాలోని రైతులకు నిరాటంకంగా 7 గంటల పాటు విద్యుత్‌ను అందిస్తున్నామని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కె.విజయకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని దర్గామిట్ట విద్యుత్‌భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 246 సబ్‌స్టేషన్ల ద్వారా 558 అగ్రికల్చర్‌ ఫీడర్లతో విద్యుత్‌ను అందిస్తున్నామని, ఈ ఏడాది 5,668 అగ్రికల్చర్‌ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు.

ఇంకా 7,220 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వాదేశాలతో వాటికి కూడా త్వరలో కనెక్షన్లు ఇవ్వనున్నామన్నారు. అలాగే వినియోగదారులు 46 రకాల విద్యుత్‌ సేవల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే 9440811749 నంబరుకు ఫోన్‌ చేసి, ఫిర్యాదు చెయ్యొచ్చని వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురైతే నగరంలో 12 గంటలలోపు, రూరల్‌లో 24 గంటలలోపు వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. వీటిపై ఫిర్యాదులు చేయాలనుకుంటే 1912 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top