నిధులు కొల్లగొట్టు! 

Robbery the Funds - Sakshi

పాత గుంతలకే కొత్తగా బిల్లులు

బండరాళ్లతో చెక్‌డ్యాంల నిర్మాణం

సిబ్బంది కొరతతో నాణ్యతకు ఎగనామం

రైతులకు దక్కని ప్రయోజనం

ధర్మవరం : ‘నీరు– చెట్టు’’ టీడీపీ నాయకుల జేబులు నింపే పథకంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కింద మొక్కలు పెంచడం, చెరువుల్లో పూడిక తీత పనులు చేసి సారవంతమైన మట్టిని రైతుల పొలాల్లోకి తోలాల్సి ఉంది. అయితే అధికారంలో ఉన్నవారే పనులు దక్కించుకోవడం.. బదిలీల భయంతో అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతో నిధులన్నీ పక్కదారి పట్టాయి. రికార్డుల్లో చూపినట్లుగా పూడికతీతతో చెరువులు అభివృద్ధి చెందలేదు... తీసిన మట్టితో వేసిన రోడ్లు బాగుపడిందీ లేదు. ఇక బండరాళ్లతో చెక్‌డ్యాంలు నిర్మించిన కాంట్రాక్టర్లు..పైన సిమెంట్‌ పూసి మమ అనిపిస్తున్నారు.  దీంతో వందల కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయి.     

జిల్లాలోని ధర్మవరం, పెనుకొండ, అనంతపురం ఇరిగేషన్‌ డివిజన్లకు కలిపి మొత్తం 7,848 పనులు చేపట్టేందుకు రూ.83,092.42 లక్షల నిధులు కేటాయించారు. ఆయా నిధులతో జంగిల్‌ క్లియరెన్స్, చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, చెరువు కట్టలు, కుంట కట్టలను గట్టిపరచడం, అవసరమైన చోట కాంక్రీట్‌ రివిట్‌మెంట్‌ చేయడం, చెరువులు, కుంటల తూములు మరమ్మతులు చేయడం తదితర పనులు చేసేందుకు గాను మూడు డివిజన్ల పరిధిలో 3,640 పనులకు పరిపాలనా అనుమతి పొందారు. అయితే ఆయా పనులు ఎక్కడా నిబంధనల మేరకు జరగడంలేదు. ఈ మొత్తం నీరు–చెట్టు పనులన్నింటనీ అధికార పార్టీ నాయకులే చేపడుతుండటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

 అధికారులు కనీసం మార్కింగ్‌ కూడా ఇవ్వకముందే టీడీపీ నాయకులు ఆ పనులు చేసేశారు. ముఖ్యంగా పూడిక తీత పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలలో పూడిక తీస్తే నీరు పుష్కలంగా చేరుతుందని, తద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని రైతులు భావించారు. చెరువులోని సారవంతమైన మట్టిని పొలాలకు తోలుకోవచ్చునని భావించారు. అయితే చెరువులలో నామమాత్రంగా పనులు చేసి పూర్తిగా బిల్లులు చేయించుకున్నారని రైతులు పేర్కొంటున్నారు.  

జన్మభూమి కమిటీలదే హవా.! 
నీరు–చెట్టు పనులు మొత్తం జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులే దక్కించుకున్నారు. మొత్తం వారు చెప్పినట్లే అన్ని నియోజకవర్గాల్లోనూ పనులు జరిగాయి. కొన్ని గ్రామాల్లో ‘నీరు–చెట్టు’ పథకం కింద చేపట్టే పనులు తమకు దక్కలేదన్న కారణంతో  అధికార పార్టీకే చెందిన నేతలు వర్గాలు చీలిపోయిన సందర్భాలున్నాయి. అధికార పార్టీ సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్న ప్రాంతాలకు మాత్రమే నిధులు మంజూరు చేశారన్న ఆరోపణలు లేకపోలేదు.

అధికారుల తీరుపై విమర్శల వెల్లువ 
నీరు – చెట్టు పథకం నిధులు స్వాహా అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులకు బదిలీల భయం పట్టుకుంది. ఏ చిన్న అభ్యంతరం చెప్పినా ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’ అని నేతల నుంచి ఫోన్లు వస్తుండటంతో వారు చేసేదిలేక మిన్నకుండిపోతున్నారు. మరికొందరు అధికారులు మాత్రం ‘‘నాదేం పోయింది.. నీ ఇష్టం వచ్చినట్లు పనిచేసుకో.. మాకు ఇవ్వాల్సింది మాత్రం మాకు ఇచ్చేయ్‌’’.. అని  కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులతో జేబులు నింపుకున్నారన్న ఆరోపణలున్నాయి. 


ఈ చిత్రంలో కనిపిస్తున్న చెక్‌డ్యాం యల్లనూరు మండలం కూచివారిపల్లి వద్ద ఓ టీడీపీ నేత నిర్మించినది. ఇక్కడ చెక్‌డ్యాం నిర్మాణా నికి రూ.9.6 లక్షలు మంజూరైంది. అడిగేవారు లేరన్న ఉద్దేశంతో సదరు నాయకుడు ఏకంగా బండరాళ్లతో చెక్‌డ్యాం నిర్మించాడు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో అధికారులు జేసీబీలతో చెక్‌డ్యాంను తొలగించగా బండరాళ్లు కనిపించాయి. దీంతో సదరు టీడీపీ నాయకునికి బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. 


ధర్మవరం మండలం సీసీ కొత్తకోట చెరువులో టెక్నికల్‌ అనుమతి లేకుండా, అధికారులు మార్కింగ్‌ ఇవ్వకుండానే చేస్తున్న పనులివి. చింతల చెరువులో మట్టిని తొలగించి, ఆ మట్టిని పాడుబడిన బావులు/ పాడైన రోడ్లలో వేయాల్సి ఉంది. అయితే ఇవేవీ లేకుండానే ఓ టీడీపీ నేత ఏకంగా గతంలో పూడికతీత పనులు చేపట్టిన ప్రాంతంలోనే తిరిగి జేసీబీలతో పనులు చేస్తున్నాడు. ఈ పనులకుగాను రూ. 4.42 లక్షలు మంజూరైంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top