తెల్లారిన బతుకులు | road accident | Sakshi
Sakshi News home page

తెల్లారిన బతుకులు

Mar 1 2014 4:14 AM | Updated on Aug 30 2018 3:56 PM

తెల్లారిన బతుకులు - Sakshi

తెల్లారిన బతుకులు

పూర్తిగా తెల్లవారకుండానే వారి బతుకులు తెల్లారిపోయాయి. వ్యాపారరీత్యా గుంటూరు జిల్లా బాపట్లకు వెళ్లిన ఆక్వా రైతు తన కారులో స్వగ్రామానికి వస్తుండగా, పి.గన్నవరం అక్విడెక్టుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

గన్నవరం / అమలాపురం,
 పూర్తిగా తెల్లవారకుండానే వారి బతుకులు తెల్లారిపోయాయి. వ్యాపారరీత్యా గుంటూరు జిల్లా బాపట్లకు వెళ్లిన ఆక్వా రైతు తన కారులో స్వగ్రామానికి వస్తుండగా, పి.గన్నవరం అక్విడెక్టుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

 

ఈ ప్రమాదంలో అతడి కారు డ్రైవర్ కూడా చనిపోయాడు. పి.గన్నవరం అక్విడెక్టుపై శుక్రవారం తెల్లవారుజామున క్వారీ లారీ, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెం దిన ఆక్వా రైతు అల్లూరి వెంకట్రాజు(చంటిరాజు)(48), కారు డ్రైవర్ పంపన అశోక్‌కుమార్(25) అక్కడికక్కడే మరణిం చారు. పోలీసుల కథనం ప్రకారం..

 

వెంకట్రాజు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలోని తన చెరువులకు అవసరమైన రొయ్య సీడు కోసం బయలుదేరాడు. అమలాపురం వేంకటేశ్వర స్వామి గుడి ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ పంపన అశోక్‌కుమార్‌తో కలిసి కారులో గురువారం సాయంత్రం గుం టూరు జిల్లా బాపట్లకు పయనమయ్యారు. అక్కడ సీడు కొనుగోలు చేసి, లారీలో ఎగుమతి చేయించి అమలాపురం పంపిం చారు. అనంతరం కారులో అమలాపురానికి తిరుగు ప్రయాణమయ్యారు.

 

తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు పి.గన్నవరం అక్విడెక్టుపైకి చేరుకుంది. రాజమండ్రి నుంచి రాజోలు గ్రావెల్ లోడుతో వెళుతున్న క్వారీ లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు ముందు భాగం పూర్తిగా లారీ కింద ఇరుక్కుంది. కారులో ఇరుక్కుపోయిన వెంకట్రాజు, డ్రైవర్ అశోక్‌కుమార్ అందులోనే చనిపోయారు. పోలీసులు ట్రాక్టర్ సాయంతో లారీ నుంచి కారును వేరు చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.హరీష్‌కుమార్ చెప్పారు.

 

ప్రమాదం జరిగిన తీరు, మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడం చూసిన స్థానికులు చలించిపోయారు. వెంకట్రాజుకు భార్య సంధ్యారాణి, కుమారులు అనిరుధ్ వర్మ, వివేక్ వర్మ ఉన్నారు. వెంకట్రాజు స్వగ్రామం మలికిపురం మండలం లక్కవరం గ్రామం కాగా, వ్యాపారరీత్యా అమలాపురంలో దుకాణం ఏర్పాటు చేసుకుని, ఇక్కడే నివసిస్తున్నారు. ఐటీఐ చదివిన అశోక్‌కుమార్ డ్రైవింగ్‌పై ఉన్న ఆసక్తితో ఏడాదిగా వెంకట్రాజు వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి ఇంకా పెళ్లి కాలేదు. గురువారం ఉదయం అశోక్‌కుమార్ తన తల్లి రమాదేవికి బాపట్ల వెళుతున్నానని చెప్పి, ఇంటి నుంచి బయలుదేరాడు. శుక్రవారం ఉదయం కొడుకు మరణవార్త విని రమాదేవి గుండెలవిసేలా రోదించింది. వెంకట్రాజు కుటుంబీకులు, బంధువులు ప్రమాద స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఆక్వా రంగంలో రాణిస్తున్న ఆయన ఆకస్మిక మరణం కోనసీమ ఆక్వా రైతులను కూడా విషాదం నింపింది.
 పావుగంట గడిస్తే... ప్రాణాలు దక్కేవి
 సుమారు 250 కిలోమీటర్లు కారులో ప్రయాణించిన వీరు మరో పావు గంటలో ఇళ్లకు చేరుకోవాల్సి ఉంది. ఇంతలోనే మృత్యువు లారీ రూపంలో వచ్చి వారిద్దరినీ కబళించింది. ఆక్వా రైతు అల్లూరి వెంకట్రాజు, డ్రైవర్ అశోక్‌కుమార్ మరణించిన సంఘటనతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వారు నివసించే హౌసింగ్‌బోర్డు కాలనీ, వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతాల్లోని విషాదం అలముకుంది. ఆక్వా సీడు కోసం వెంకట్రాజు, డ్రైవర్ అశోక్‌కుమార్‌తో కలిసి ఇతర జిల్లాలకు వెళ్లడం, రాత్రికిరాత్రే ఇళ్లకు చేరుకోవడం జరుగుతోంది. ఎప్పటిలాగే సీడు కోసం వెళ్లిన వారు.. ఇంటిముఖం పడుతూ శుక్రవారం తెల్లవారకుండానే వారి జీవితాలు కడతేరిపోయాయి.
 లక్కవరంలో విషాదం
 మలికిపురం : రోడ్డు ప్రమాదంలో వెంకట్రాజు మరణించడంతో అతడి స్వగ్రామమైన లక్కవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్ట్‌మార్టం అనంతరం వెంకట్రాజు మృతదేహాన్ని లక్కవరానికి తరలించారు. మృతదేహాన్ని చూసి బంధువుల రోదనలు మిన్నంటా యి. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement