రైతన్నకు అండగా..నంద్యాల బ్రాండ్‌ ఉండగా | Regional Agriculture Research Center Nandyal Produce Best Seeds In Ap | Sakshi
Sakshi News home page

రైతన్నకు అండగా..నంద్యాల బ్రాండ్‌ ఉండగా

Jun 28 2019 7:29 AM | Updated on Jun 28 2019 7:31 AM

Regional Agriculture Research Center Nandyal Produce Best Seeds In Ap - Sakshi

వాతావరణ మార్పులు.. గతి తప్పుతున్న రుతుపవనాలు.. అకాల వర్షాలు.. ఉష్ణోగ్రతలు పెరగడం.. నీటి వనరులు తగ్గడం.. ఇలా ఎన్నో పరిణామాలతో కొన్నేళ్లుగా వ్యవసాయం తిరోగమనం దిశగా పయనిస్తోంది. పంటల సాగులో రైతులకు వరుసగా నష్టాలే. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులను ఎవరూ మార్చలేరు. ఆ పరిస్థితులను అధిగమించే నూతన వంగడాలను సృష్టించడమే వ్యవసాయ శాస్త్రవేత్తల లక్ష్యం. ఈ మేరకు నంద్యాల ( ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం) ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు నూతన వంగడాల ఆవిష్కరణలో ముందంజలో ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా, తెగుళ్ల బారిన పడకుండా.. అధిక దిగుబడి వచ్చేలా నూతన వంగడాలను సృష్టిస్తున్నారు. వ్యవసాయంలో రైతులు రాణించేలా మేలు రకం విత్తనాలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల పరిశోధన కేంద్రానికి మంచి గుర్తింపు తెస్తున్నారు.      

సాక్షి, నంద్యాల : ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం  1906లో నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో 125 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.  25 ఎకరాలలో భవనాలు ఉండగా మరో 100 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తూ పరిశోధనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పది పంటలపై పరిశోధన కొనసాగుతుంది. దాదాపు 25 మంది శాస్త్రవేత్తలు ఇక్కడ పని చేస్తున్నారు. ఈ పరిశోధన కేంద్రానికి 2017లో గుంటూరు ఆచార్య విశ్వవిద్యాలయం నుంచి బెస్ట్‌ పరిశోధన సంస్థగా అవార్డు దక్కింది. ఇక్కడ ఆవిష్కరించిన పత్తి, నంద్యాల సోనా వంగడాలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరొందాయి. 1950లో పత్తి, 1980లో జొన్న, పొద్దుతిరుగుడు, శనగ, పొగాకు, తదితర పంటలపై పరిశోధనలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పంటలపై పరిశోధనలు చేయడం, వాటి గురించి రైతులకు అవగాహన కల్పించడం, ఆ మేరకు కొత్త వంగడాలను సృష్టించడంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌కు మంచి గుర్తింపు వచ్చింది. పత్తి, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాలు, పొగాకు, శనగ, జొన్న, వరిలో అధిక దిగుబడులు వచ్చే నూతన వంగడాలను సృష్టించి అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. నంద్యాల శాస్త్రవేత్తలు రామారెడ్డి, విజయలక్ష్మి, గాయత్రి, జాఫర్‌బాషా తదితరులు నూతన వంగడాల ఆవిష్కరణలను వివరించారు. 

శనగకు నంద్యాల బ్రాండ్‌..  
రాయలసీమలో శనగ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ పంటకు ఉన్న ప్రాము ఖ్యతను గుర్తించి 2009లో నంద్యాల పరిశోధన స్థానంలో అధిక దిగుబడి వచ్చే మేలైన విత్తనాల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. 2012లో నంద్యాల శనగ–1, 2015లో నంద్యాల ధీర, 2016న నంద్యాల గ్రామ్‌–49, 2015లో నంద్యాల గ్రామ్‌–119 శనగ విత్తనాలను ఆర్‌ఏఆర్‌ఎస్‌ నుంచి ఉత్పత్తి చేశారు. ఈ విత్తనాలను ఎక్కడ వాడినా నంద్యాల పేరు గుర్తుండాలనే ఉద్దేశంతో పేరుకు ముందుగా నంద్యాలను చేర్చినట్లు తెలుస్తోంది. శనగను ఇంగ్లిష్‌లో బెంగాల్‌ గ్రామ్‌ను అంటారు. అందుకే నంద్యాల గ్రామ్‌–119, నంద్యాల గ్రామ్‌–49 పెట్టారు. నూతన వంగడాలకు 1, 2 తడులు నీరు పెడితే చాలి. ఈ రకాలు దృఢమైన వేరువ్యవస్థ నీటి బెట్ట, ఎండ తెగులును తట్టుకుంటాయి. శనగ గింజ బరువు 38 నుంచి 40 గ్రాములు ఉంటుంది. వర్షాధారం నేలలు అయితే ఎకరాకు 10 నుంచి 11 క్వింటాళ్లు, మిగిలిన పొలాల్లో ఎకరాకు ఏడెనిమిది క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. వీటి పంట కాలం 90 నుంచి 105 రోజులు. 

వ్యవసాయ యాంత్రీకరణ.. 
కొత్త వంగడాలను సృష్టించడంతో పాటు రైతులకు అవసరమైన యంత్రాలను ఆర్‌ఏఆర్‌ఎస్‌లో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన 16హెచ్‌పీ ట్రాక్టర్‌తో అనుసంధానం చేసే పరికరాలు, రెండు చెక్కల నాగలి, ఆరు చెక్కల కల్టీవేటర్, ఐదు చెక్కల విత్తనం, ఎరువు వేసే పరికరం, పంట నూర్పిడి, క్రిమి సంహారక మందు పిచికారీ యంత్రాలు   రైతులకు ఎంతో ఉపయోగపడు తున్నాయి.  

శిక్షణ.. అవగాహన
ఈ కేంద్రంలో పని చేసే శాస్త్రవేత్తలు ప్రతి నెల రైతులకు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చీడ, పీడల యాజమాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేగాకుండా చుట్టుపక్కల రైతులు వేసిన పంట పొలాలను పరిశీలించి వాటికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మట్టి, నీటి నమూనాల పరీక్షలు నిర్వహించి అధిక దిబడులు సాధించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు.  

పత్తికి పుణ్యక్షేత్రాల పేర్లు 
జిల్లాలో రైతులు అధిక విస్తీర్ణంలో వరి, శనగ, పత్తి పంటలు సాగు చేస్తారు. ఈ మేరకు పత్తి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేసి నూతన వంగడాలను సృష్టించారు.  2012లో శివనంది, శ్రీరామ 2015–16లో ఉత్పత్తి చేశారు. వీటికి నరసింహ, శివనంది, యాగంటి, అరవింద, శ్రీనంది వంటి పేర్లు పెట్టడానికి ఇక్కడ ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు ఉండటం కారణం. అరవింద, శివనంది రకాలకు ఎర్రనేలలు, యాగంటి, నరసింహ, శ్రీరామ రకాలకు నల్లరేగడి నేలలు అనువైనవి. రసం పీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు, గులాబీ రంగు పురుగును ఈ వంగడాలు ఎదుర్కొంటాయి. ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. శ్రీరామ రకం పంట విత్తనాలు ఏడు రాష్ట్రాలకు ఎగుమతి అయి ఆ రాష్ట్రాల్లో పంటలు పండిస్తున్నారు. 

సన్నని సోనాలు 
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2016లో విడుదలైన నంద్యాల సోనా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచింది. నంద్యాల సోనా కాలపరిమితి 130 నుంచి 140 రోజులు ఉంటుంది. గింజ చాలా సన్నగా ఉండి బియ్యం రుచిగా ఉంటుంది. ఈ బియ్యంలో ఇతర బియ్యాన్ని కల్తీ చేయడానికి సాధ్యం కాదు. వీటికి చీడపీడ తెగుళ్లు తక్కువ, అగ్గితెగులు, ముడత తెగులును తట్టుకుంటాయి. ఎకరాకు 35 నుంచి 45 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. కర్నూలు, కడప, గుంటూరు, నిజామాబాద్, రంగారెడ్డి, కర్ణాటక వంటి ప్రాంతాల్లో నంద్యాల సోనా బాగా ప్రాచుర్యం పొందింది. 

నాణ్యమైన పొగాకు 
1992లో తూర్పుగోదావరి జిల్లా వెంకటరామన్న గూడెం నుంచి అఖిత భారత పొగాకు సమన్వయ పథకం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి మార్చారు.  నంద్యాల పొగాకు–1  2015లో ఉత్పత్తి చేశారు.  మూడు కేజీల విత్తనాలు ఎకరాకు నారువేస్తే 150 నుంచి 200 ఎకరాలకు విత్తనాలు వస్తాయి. అదే విధంగా నాటు పొగాకు, బీడీ పొగాకులు పరిశోధనల సహకారంతో విడుదల చేశారు. ఈ పంటను సెప్టెంబర్, అక్టోబర్‌ నెలలో 70 సెం.మీ దూరంలో మొక్క నాటుకోవడం వలన అధిక దిగుబడులు వస్తాయి. రసం పీల్చే పురుగు, లద్దెపురుగు వంటి వాటిని ఈ పంట తట్టుకుంటాయి. ఈ పంటలపై అధిక దిగుబడి, నాణ్యతలపై పరిశోధనలు పురోగతిలో ఉన్నాయి.  

బెస్ట్‌ పరిశోధన కేంద్రంగా అవార్డులు
నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 14 సంవత్సరాలు పని చేశాను. 12 సంవత్సరాలు శాస్త్రవేత్తగా, రెండు సంవత్సరాలు ఏడీఆర్‌గా పని చేశా. నా హయాంలో శనగలు నాలుగు రకాలు, కొర్రలు మూడు రకాలు, జొన్నలు రెండు రకాలు, పొగాకు ఒక రకం వంగడాలను విడుదల చేశాను. నా హయాంలో విడుదల చేసిన నంద్యాల సోనా బియ్యానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. రాష్ట్రంలో పది పంటలపై పరిశోధనలు చేసి కొత్త వంగడాలను సృష్టిస్తున్న ఒకే ఒక పరిశోధన స్థానం నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రాంతీయ కేంద్రమే.
– గోపాల్‌రెడ్డి, రిటైర్డు ఏడీఆర్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement