పుణ్యస్నానమే లక్ష్యంగా.. | Sakshi
Sakshi News home page

పుణ్యస్నానమే లక్ష్యంగా..

Published Sun, Jul 19 2015 2:16 AM

ramadan festival

పద్మ పురాణం, బ్రహ్మ పురాణాలలో గోదావరి నది ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించారు.. నదీనదాల్లో గోదావరికి ఎంతో ప్రాధాన్యం ఉంది.. గంగానది ఎంతో పవిత్రం.. అలాంటి గంగలో అరవైసార్లు స్నానం చేస్తే లభించే పుణ్యం గోదావరిలో ఒక్కసారి చేస్తే లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.. దీనిని బట్టి గోదావరి పుష్కరాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయ జీవనంలో ఎంత ముఖ్యమైనవో చెప్పవచ్చు. ఈ గోదావరిలో పుణ్యస్నానం ఆచరించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
 
 సాక్షి, గుంటూరు : రంజాన్ పండగ, ఆదివారం వరుసగా రెండు రోజుల పాటు సెలవులు రావడంతో జిల్లా నలుమూలల నుంచి  పుష్కరాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు బయలుదేరారు. ప్రధానంగా రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో యాత్రికులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు వేలసంఖ్యలో తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి నుంచి సొంత వాహనాల్లో ఎక్కువ మంది వెళ్లారు. అయితే శనివారం ఉదయం నుంచి బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. గుంటూరు నుంచి ఏలూరుకు 90 కిలోమీటర్లు ఉంటుంది. మామూలు రోజుల్లో కేవలం రెండు గంటల్లో ఏలూరు చేరుకోవచ్చు. అయితే శనివారం ఏలూరు వెళ్లాలంటే ఏడు నుంచి ఎనిమిది గంటల సమ యం పట్టింది. ఏలూరు నుంచి రాజమండ్రి వంద కిలోమీటర్లు వరకు ఉంటుంది. రాజ మండ్రి, కొవ్యూరు వెళ్లేందుకు సుమారు పది నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని యాత్రికులు చెబుతున్నారు.
 
 మార్గమధ్యంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీ గా నిలిచిపోయింది. దీం తో పాటు కాజా టోల్‌గేటు వద్ద సైతం వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భక్తుల రద్దీతో ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. రాజమండ్రి, భద్రాచలం వెళ్లే బస్సులు కిటకిటలాడాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేకంగా కొన్ని సర్వీసులను పెంచినా అవి ఏమాత్రం సరిపోలేదు. అలాగే ప్రత్యేక రైళ్లు సమయపాలన లేదు. ఎప్పుడు రైళ్లు వస్తాయో ప్రయాణికులకు సరైన సమాచారం లేదు. దీంతో అనేక మంది రైల్వే స్టేషన్‌లో పడిగాపులు కాస్తున్నారు.
 
 ప్రయాణికుల ఇబ్బందులు..
 ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి సైతం యాత్రికులు గుంటూరు జిల్లా మీదగా వెళ్లాల్సి ఉంది. దీంతో చెన్నై, కొలకొత్తా హైవేై ఎన్‌హెచ్-5 పై వాహనాల రద్దీ తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం రాజమండ్రి, కొవ్యూరుల్లో 50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారంటే భక్తుల రద్దీ ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
 

Advertisement
Advertisement