ర్యాలి మాజీ సర్పంచ్ మృతి | Rally former Sarpanch, ysrcp leader pericarla Narsimharaja no more | Sakshi
Sakshi News home page

ర్యాలి మాజీ సర్పంచ్ మృతి

Aug 22 2013 1:04 AM | Updated on May 29 2018 4:06 PM

రాజకీయ దురంధరుడు, ర్యాలి మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు పేరిచర్ల నరసింహరాజు(85) మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మృతి చెందారు.

 ర్యాలి (ఆత్రేయపురం), న్యూస్‌లైన్ :రాజకీయ దురంధరుడు, ర్యాలి మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు పేరిచర్ల నరసింహరాజు(85) మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మృతి చెందారు. సుమారు 20 ఏళ్లు సర్పంచ్‌గా, ఒక పర్యాయం ఎంపీటీసీ సభ్యునిగా సేవలందించిన నరసింహరాజు మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరసింహరాజు మృతికి సంతాపంగా ర్యాలిలో బుధవారం బంద్ పాటించారు. పార్టీలకు అతీతంగా నాయకులు నరసింహరాజు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  నరసింహరాజు భౌతిక కాయంతో బుధవారం ర్యాలి నుంచి రాజమండ్రి కోటి లింగాల క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.
 
 అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ  ఓటమి ఎరగని నేత నరసింహరాజు అని, ర్యాలి గ్రామస్తుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలు, దళితుల అభ్యున్నతికి ఆయన విశేషంగా కృషి చేశారన్నారు. ర్యాలి గ్రామాభివృద్ధికి నరసింహరాజు అందించిన సేవలు మరవలేనివన్నారు. తన తండ్రి సోమసుందరరెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ కొత్తపేట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నరసింహరాజు తనకు రాజకీయంగా అండదండలు అందించారని కొనియాడారు. 
 
 సమైక్యాంధ్ర ఆందోళనలు వాయిదా : నరసింహరాజు మృతికి సంతాప సూచికంగా బుధవారం ఆలమూరు మండలం నుంచి  కొత్తపేట మండలం వరకు సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించ తలబెట్టిన బస్సు యాత్ర, ఆత్రేయపురం మండలంలో నిర్వహించే కార్యక్రమాలు, ఈనెల 24 నుంచి చేపట్ట బోయే నిరాహార దీక్షలు వాయిదా వేస్తున్నట్టు చిర్ల తెలిపారు. నరసింహరాజు మృతికి సంతాపం తెలిపిన వారిలో  డీసీఎంఎస్ చైర్మన్ కె.వి. సత్యనారయణరెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి , గొలుగూరి మునిరెడ్డి,  మాజీ ఎంపీపీ పి.ఎస్. రాజు, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు, ర్యాలి సొసైటీ అధ్యక్షుడు పేరిచర్ల పుల్లంరాజు, డీసీసీబీ డెరైక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు తదితరులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement