అమ్మవారి ఆభరణాలు భద్రం

Rajarajeshwari Temple Goddess Jewelry Found In Nellore - Sakshi

నెల్లూరు(బృందావనం) : నగరంలోని కరెంటాఫీస్‌ సెంటర్‌ సమీపంలో కొలువైన  రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మాయమైన నగలు ఎట్టకేలకు అమ్మవారి చెంతకు చేరాయి. ఆలయ అర్చకులు, పరిచారికల నుంచి ఆ నగలు మళ్లీ అమ్మవారి ఆలయంలో భద్రపరచనున్నామని దేవాదాయ, ధర్మాదాయశాఖ నెల్లూరు సహాయ కమిషనర్‌ వేగూరు రవీంద్రరెడ్డి, దేవస్థానం ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి, బదిలీపై వెళ్లిన సింగరకొండ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న పులి కోదండరామిరెడ్డి తెలిపారు. నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆది వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబం ధించి వివరాలను దేవాదాయ, ధర్మాదాయశాఖ నెల్లూరు  సహాయ కమిషనర్‌ వేగూరు రవీంద్రరెడ్డి వెల్లడించారు.

గత నెల 25వ తేదీన ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డికి, గతంలో పనిచేసిన కార్యనిర్వహణాధికారి పులి కోదండరామిరెడ్డి ఆభరణాలు అప్పగించేందుకు  గుంటూరుకు చెందిన జ్యూయలరీ వెరిఫికేషన్‌ అధికారి మాధవి పరిశీలన చేశారు. ఆ సమయంలో అమ్మవారికి చెందిన కాంట్రాక్ట్‌ పరిచారిక ఎ.దిలీప్‌కుమార్, కాంట్రాక్ట్‌ అర్చకుడు వి.నరసింహారావు చెంత నుంచి 147 గ్రాముల కలిగిన సుమారు రూ.3,67,500 విలువజేసే 110 బిల్వపత్రాలు, 225 గ్రాముల కలిగిన సుమారు రూ.5,58,800 విలువ కలిగిన ఎరుపురంగురాళ్లతోగల 73 çపూలు, 107 చిన్న పూలు, కాంట్రాక్ట్‌ పరిచారిక కె.హరికృష్ణ  నుంచి 48 గ్రాముల కలిగిన 110 తెలుపు, స్టోన్స్, ఒక పెద్ద ఎరుపుస్టోన్, 39 ఎరుపురాళ్లు కలిగిన సుమారు రూ.95వేలు విలువచేసే  ఆభరణాలు కనిపించకుండా పోయాయన్నారు. అయితే ఆ ఆభరణాలు ఎక్కడకూ పోలేదని తమ వద్దనే భద్రంగా ఉన్నాయని దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారయంత్రాంగం స్పష్టం చేసింది. అమ్మవారి నగలు భద్రంగానే ఉన్నాయని భావించామన్నారు.

అమ్మవారి ఆభరణాలు కనిపించకుండాపోవడంపై అన్ని వర్గాల నుంచి పలు అనుమానాలు తలెత్తాయన్నారు. ఆ అనుమానాలు నివృత్తి చేసేందుకు తాము నగలను పరిశీలించామన్నారు. ఈ నగలు వారం రోజుల క్రితం ఆలయంలోని ఆభరణాల చెంతనే తమ పరిశీలనలో ఆభరణాలు  ఉన్నాయనే విషయం వెల్లడైందన్నారు. దీంతో వారం రోజుల క్రితం ఈ విషయాన్ని బదిలీపై వెళ్లిన పులి కోదండరామిరెడ్డికి తెలిపామన్నారు. ఆయన సింగరకొండ ఆలయంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్న నేపథ్యంలో వీలుచూసుకుని ఆదివారం రావడంతో ఈ నగలను కోదండరామిరెడ్డి సమక్షంలో ఆయన ద్వారా ప్రస్తుత ఆలయ కార్య నిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డికి అప్పగించామన్నారు. ఇకపై ఎటువంటి పొరపాట్లు, సందేహాలకు తావివ్వకుండా అమ్మవారికి సంబంధించిన అన్ని ఆభరణాలను సమగ్ర సమాచారంతో రిజిస్టర్లలో నమోదుచేస్తామన్నారు. బదిలీపై వెళుతున్న అధికారుల నుంచి సర్వీసులో ఉండడం వల్ల వారి నుంచి పూర్తి అప్పగింతలు పరిపాలనాపరంగా జరగవన్నారు. అధికారి ఉద్యోగ విరమణ చేస్తే ఆయన నుంచి అప్పగింతలన్నీ నిబంధనల మేరకు జరుగుతాయని వేగూరు రవీంద్రరెడ్డి వివరించారు. 

పరిశీలనలో వెలుగుచూశాయి 
ప్రస్తుతం నేను సింగరకొండ దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్నా. గత నెలలో జ్యూయలరీ వెరిఫికేషన్‌ సమయంలో నగలు కనిపించకపోవడంతో నేను ప్రస్తుత కార్యనిర్వహణాధికారికి నగలను అప్పగించలేకపోయా. దేవాదాయ, ధర్మాదాయశాఖ నిబంధనల మేరకు నగలు చూపించలేకపోయిన పరిచారికలకు నోటీసులు ఇచ్చాం. నోటీసులు అందుకున్న పరిచారికలు తిరిగి పరిశీలనచేసిన సమయంలో నగలు కనిపించాయన్న విషయాన్ని నాకు వారం రోజుల క్రితం తెలిపారన్నారు. మా దేవస్ధానంలో జరుగుతున్న ఉత్సవాల నేపథ్యంలో ఈ ఆదివారం వెసులుబాటుచూసుకుని నెల్లూరుకు వచ్చి ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డికి అప్పగించా.          
–కోదండరామిరెడ్డి, బదిలీపై వెళ్లిన కార్యనిర్వహణాధికారి 

రిజిస్టర్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తాం 
అమ్మవారి నగలు నాగు అప్పగించారు. ఇకపై ఎటువంటి వివాదాలకు తావులేకుండా ఆభరణాలకు సంబంధించిన అన్ని విషయాలను రిజిస్టర్‌గా మెయిన్‌టెయిన్‌చేస్తాం. నగలను లాకర్‌లో భద్రపరుస్తున్నాం. అమ్మవారి నగలు కనిపించడం తిరిగి అమ్మవారి చెంతకు చేర ఆనందంగా ఉంది.
–వెండిదండి శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి, శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top