టెన్త్‌ ఇంటర్నల్‌ మార్కుల్లో ప్రైవేట్‌ పడగ! | Private and corporate schools Illegality For their students | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ఇంటర్నల్‌ మార్కుల్లో ప్రైవేట్‌ పడగ!

May 13 2019 3:24 AM | Updated on May 13 2019 10:33 AM

Private and corporate schools Illegality For their students - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు సాక్షాత్తూ ప్రభుత్వమే కొమ్ముకాస్తోంది. ఫలితంగా ప్రతిఏటా ఉత్తీర్ణత శాతం, జీపీఏ పాయింట్లలో ఆయా సంస్థలే పైచేయి సాధిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు తగ్గుతున్నట్లు చూపించి, క్రమంగా వాటిని పూర్తిగా మూసివేసే దిశగా సర్కారు కుట్ర పన్నిందన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణతా శాతం పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అంతా అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీనివెనుక కార్పొరేట్‌ శక్తుల కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
ప్రయోగాల్లేకున్నా పూర్తి మార్కులా? 
విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలల్లో సమగ్ర నిరంతర మూల్యాంకన విధానాన్ని(సీసీఈ) అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానాన్ని చాలాకాలం అమలుకు నోచుకోలేదు. చివరకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆలస్యంగా అమల్లోకి తీసుకొచ్చారు. విద్యార్థులు పాఠశాలల్లో ప్రయోగాలు, ఇతర అంతర్గత కార్యక్రమాల్లో పాలుపంచుకొంటూ, అందులో సాధించే నైపుణ్యాల ఆధారంగా కొన్ని మార్కులు కేటాయించాలన్నది సీసీఈ విధానం లక్ష్యం. ఇందులో భాగంగా దీనికి 20 మార్కులు కేటాయిస్తున్నారు. వీటిని అంతర్గత(ఇంటర్నల్‌) మార్కులు అంటున్నారు. వార్షిక పరీక్షలోవిద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి మిగతా 80 మార్కులు ఇవ్వాలి. ఇంటర్నల్‌ మార్కుల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లు తమ విద్యార్థులకు పూర్తి మార్కులు వేసుకుంటున్నాయని విద్యారంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులతో ప్రయోగాలు, ఇతర కృత్యాలు చేపట్టకుండానే పూర్తి మార్కులు వేసేస్తున్నారు. దీంతో ఆయా స్కూళ్ల విద్యార్థులు ఉత్తీర్ణతలో ముందంజలో ఉండడమే కాకుండా మెరుగైన జీపీఏ పాయింట్లనూ దక్కించుకుంటున్నారు. 

పత్తా లేని పర్యవేక్షణ కమిటీ 
ఇంటర్నల్‌ మార్కులకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలు, పిల్లల్లో నైపుణ్యాలను ఉపాధ్యాయులు ఏ మేరకు అంచనా వేస్తున్నారో పరిశీలించడానికి ఒక పర్యవేక్షణ కమిటీ ఉండాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. మండల విద్యాధికారులు, డిప్యూటీ విద్యాధికారుల పోస్టులు 80 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న అరకొర సిబ్బంది పాఠశాలల్లో సీసీఈ విధానం అమలును పట్టించుకోవడం లేదు. దాంతో ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. విద్యా వ్యాపారంలో భాగంగా తమ స్కూళ్ల ఉత్తీర్ణత శాతం, జీపీఏలను పెంచుకోవడానికి ఎలాంటి అంతర్గత కృత్యాలు చేపట్టకుండానే తమ విద్యార్థులకు ఇంటర్నల్‌ మార్కులను 20కి 20 పూర్తిగా కేటాయిస్తున్నాయి. వాటిని యథాతథంగా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాయి. 

90 శాతానికి పైగా ప్రైవేట్‌ విద్యార్థులే.. 
2014–15 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన వారిలో 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లకు చెందినవారే. 2018లో 6,04,527 మంది టెన్త్‌ పరీక్ష రాయగా, వీరిలో 5,71,175 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులు 2,29,405 మంది పరీక్ష రాయగా, 2,25,072 (98.11 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ మున్సిపల్‌ స్కూళ్లలో 90.40 శాతం, జెడ్పీ స్కూళ్లలో 92.57 శాతం, ఇతర ప్రభుత్వ స్కూళ్లలో 90.77 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు 5,340 ఉండగా, ఇందులో ప్రైవేట్‌ స్కూళ్లు 3,125 ఉన్నాయి. మొత్తం 29,921 మంది 10 జీపీఏ సాధించగా, వీరిలో 26,475 మంది ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులే కావడం గమనార్హం. 

తూతూమంత్రంగా కమిటీ 
సీసీఈ విధానం దుర్వినియోగం అవుతోందని, తమిళనాడు, కర్ణాటక తరహాలో ఈ విధానంతో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులు పలుమార్లు సూచించినా ప్రభుత్వం తొలుత లెక్కచేయలేదు. చివరకు ఒత్తిడి పెరగడంతో అధికారులతో ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వ పెద్దల సూచన మేరకే కమిటీ తన నివేదికను సమర్పించింది. దాంతో ఈ ఏడాది కూడా టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో సీసీఈ విధానాన్నే కొనసాగించారు. బడా కార్పొరేట్‌ విద్యా సంస్థల లాబీయింగే దీనికి కారణమని సమాచారం. ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్ల అధినేతలు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులుగా ముద్రపడ్డారు. దీంతో వారి చెప్పిందే వేదంగా మారింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తీర్ణత, జీపీఏ పాయింట్లలో ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లే పైచేయి సాధించబోతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement