బోడోల చెరలో ప్రకాశం జిల్లా ఇంజనీర్ | Prakasam District engineer abducted in Assam | Sakshi
Sakshi News home page

బోడోల చెరలో ప్రకాశం జిల్లా ఇంజనీర్

Dec 24 2013 3:47 AM | Updated on Sep 2 2017 1:53 AM

బోడోల చెరలో ప్రకాశం జిల్లా ఇంజనీర్

బోడోల చెరలో ప్రకాశం జిల్లా ఇంజనీర్

అసోంలోని చిరంగ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజనీర్ బత్తుల అంకమ్మరావును బోడో తీవ్రవాదులు ఆదివారం నిర్బంధించారు.

 అసోంలో నిర్బంధించిన తీవ్రవాదులు
 ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కుటుంబసభ్యుల వినతి


 చీరాల, న్యూస్‌లైన్/గువాహటి: అసోంలోని చిరంగ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజనీర్ బత్తుల అంకమ్మరావును బోడో తీవ్రవాదులు ఆదివారం నిర్బంధించారు. తాను పనిచేస్తున్న సైట్లో పనులు ముగించుకుని మరో ముగ్గురు సూపర్‌వైజర్లతో కలిసి కారులో బస చేసిన ప్రాంతానికి తిరిగి వస్తుండగా.. సాయంత్రం ఆయుధాలు ధరించిన బోడో మిలిటెంట్లు వారిని అటకాయించారు. వారిపై దాడి చేసిన మిలిటెంట్లు, అంకమ్మరావును బంధించారు. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులు అంకమ్మరావు భార్యకు ఆదివారం రాత్రి సమాచారమిచ్చారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామానికి చెందిన అంకమ్మరావు హైదరాబాద్‌కు చెందిన బొల్లినేని శీనయ్య నిర్మాణ కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తున్నారు.

ఆ కంపెనీ అసోంలోని ఆమ్‌గుడి గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టు చేపట్టింది. అక్కడి అంకమ్మరావు ఏడాది నుంచి సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. అంకమ్మరావు గురించి అన్వేషణ ప్రారంభించామని, మిలిటెంట్ల డిమాండ్లు ఇంకా చెప్పలేదని అన్నారు.
 రోజూ ఫోన్ చేసేవారు: అంకమ్మరావు భార్య వాణి స్వగ్రామమైన చీరాల రూరల్ మండలం రామకృష్ణాపురంలో కొంతకాలంగా నివసిస్తున్నారు. కంపెనీ ఉద్యోగులు తన భర్త అపహరణ వార్త చెప్పినప్పటి నుంచి ఆందోళన చెందుతున్నారు. ప్రతీ రోజూ రాత్రి సమయంలో ఫోన్ చేసి మాట్లాడేవారని, కానీ ఆదివారం మధ్యాహ్నం నుంచి తన భర్త ఫోన్ స్విచాఫ్‌లో ఉందని ఆమె వాపోయారు. ఎనిమిదిరోజుల క్రితమే ఆయన స్వగ్రామం వచ్చి వెళ్లారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ బిడ్డ విడుదలకు కృషి చేయాలని బాధితుని తల్లిదండ్రులు మంగమ్మ, వెంకటేశ్వర్లు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement