వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం కనంపల్లె గిరిజన కాలనీకి మంగళవారం అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
జగన్ హెచ్చరికతో కదిలిన అధికార యంత్రాంగం
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం కనంపల్లె గిరిజన కాలనీకి మంగళవారం అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రూ.వేలల్లో కరెంటు బిల్లులు అందజేసి.. వాటిని చెల్లించేవరకూ విద్యుత్ సరఫరా చేయబోమని అధికారులు తేల్చిచెప్పడం పట్ల ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ‘ఎస్సీ, ఎస్టీల పట్ల ఇంత అన్యాయమా?’ శీర్షికన ‘సాక్షి’లో ప్రముఖంగా వార్త ప్రచురితం కావడంతో అధికారులు గ్రామానికి చేరుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ బకాయిలను చెల్లించలేదనే కారణంతో మార్చి 31వ తేదీ నుంచి కనంపల్లె ఎస్టీ కాలనీలో విద్యుత్ సరఫరాను బంద్ చేశారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదు.
పదేళ్ల బిల్లులు కడితేనే కరెంటు కనెక్షన్ ఇస్తామని చెప్పడంతో.. గిరిజనులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో గడిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోమవారం పులివెందులకు రావడంతో సుమారు 70 మంది గిరిజనులు ఆయనను కలిసి తమ గోడు వివరించారు. దీంతో చలించిన జగన్.. మంగళవారంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకుంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పులివెందుల రూరల్ ఏఈ పద్మనాభుడు ఆధ్వర్యంలో సిబ్బంది కనంపల్లెలోని గిరిజన కాలనీకి వెళ్లి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని గ్రామంలోని గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు.