గిర్రా.. గిర్రా.. గిర్రా..తిరుగుతోంది మీటర్‌ | Power Consumption is High In Vizianagaram | Sakshi
Sakshi News home page

గిరగిరా తిరుగుతోంది మీటర్‌..!

Jun 14 2019 9:10 AM | Updated on Jun 14 2019 9:10 AM

Power Consumption is High In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : వేసవి ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత కాలు బయటపెట్టేందుకు వెనుకాడే పరిస్థితి. పగలూ, రాత్రీ తేడా లేకుండా ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం కోసం ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం రోహిణీ కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రారంభమైనా ఉక్కపోత కొనసాగుతుండడంతో విద్యుత్‌ వినియోగం అదే స్థాయిలో పెరుగుతోంది. మీటర్‌ గిరాగిరా తిరుగుతోంది. విద్యుత్‌ బిల్లులు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. 

జిల్లాలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గడిచిన మూడు నెలల  వ్యవధిలో సుమారు 10 లక్షల యూనిట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. ఫిబ్రవరి నెల మొదటి వారంలో జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ వినియోగదారులు 6.5 మిలియన్‌ యూనిట్లు (65 లక్షల  యూనిట్లు) విద్యుత్‌ను గరిష్టంగా వినియోగించగా.. ప్రస్తుత పరిస్థితులు ఆ వినియోగం 7.8  మిలియన్‌ యూనిట్లు (78 లక్షల యూనిట్లకు) పెరిగిపోయింది.

మే నెలలో పరిశీలిస్తే సగటున 7.5 మిలియన్‌ యూనిట్లు (75 లక్షల యూనిట్లు) విద్యుత్‌ వినియోగమైనట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 7 లక్షల 22వేల 229  విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా అందులో చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో 61వేల 281 విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయి. మొత్తం సర్వీసుల్లో ఎల్‌టీ, హెచ్‌టీ, కమర్షియల్‌ సర్వీసులు ఈ ఏడాది గణనీయంగా విద్యుత్‌ వినియోగం పెరిగింది. గతేడాది సగటును రోజుకు 6 ఎంయూ (60 లక్షల యూనియట్లు) విద్యుత్‌ను వినియోగించే వారు.

అదే వేసవిలో అయితే  6.5 ఎంయూ యూనిట్లు (65 లక్షల యూనిట్ల) వినియోగం జరిగినట్లు అంచనా. ఈ ఏడాది గతం కంటే విద్యుత్‌ వినియోగం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనికి వినియోగదారులు సౌకర్యాల్లో శీతలగృహోపకరణాల వినియోగానికి ప్రాధాన్యమివ్వడమే కారణంగా తెలుస్తోంది. మరో వైపు ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు వాడకం విద్యుత్‌వినియోగం పెరుగుదలకు ఊతమిస్తున్నట్టు అధికారులు లెక్కలు వేస్తున్నారు.

ఆ సమయంలోనే అధిక వినియోగం... 
రోజుకో విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భానుడి ఉగ్రరూపం నుంచి రక్షణ పొందేందుకు ఏసీలు, ఫ్రిజలు, కూలర్‌లు తదితర శీతల గృహోపకరణ వస్తువులు వినియోగం గణనీయంగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరల రాత్రి 8 నుంచి 11 గంటల సమయంలో ఎక్కువగా విద్యుత్‌ వినియోగం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమయాల్లో ప్రజలు ఇళ్లల్లో ఎక్కువగా ఉంటారు. దీంతో విద్యుత్‌ వినియోగం అధికంగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

జిల్లాలో వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్‌ కన్నా 10 లక్షల యూనిట్లు తక్కువ కేటాయింపులు ఉన్నా అధికారులు నిరంతర విద్యుత్‌ సరఫరా అందిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో విద్యుత్‌ సరఫరాకు సంబంధించి మాచ్‌ఖండ్, సీలేరు, సింహాచలం, వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్‌ కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాలు లేవని, ఈ ఏడాది వేసవిలో నిరంతరాయ సరఫరా ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. 

వినియోగం గణనీయంగా పెరిగింది..  
పరిస్థితుల ప్రభావంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతీ ఒక్కరు కూలర్‌లు, ఏసీలు, ఫ్రిజ్‌లు వినియోగిస్తున్నారు. వినియోగదారులు కోరే డిమాండ్‌ను ఎదుర్కొనగలిగే సామర్థ్యం ఉంది. వినియోగదారులు అవసరంలేని సమయంలో విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించి పొదుపు పాటించాలి.    
– వై.విష్ణు, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement