మృత్యువుతో పోరాడి ఓడిన శృతి

Polytechnic Student Died With Jaundice - Sakshi

పొదలకూరు: ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న పొదలకూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలోని సోమశిల ఏజీ పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఎన్‌.శృతి శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఇక్కడి కళాశాలలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శృతికి కామెర్ల వ్యాధి ముదరడంతో ఆరోగ్యం విషమించింది. ఫలితంగా ఈనెల 7న ఆమె సొంతూరుకు వెళ్లి నెల్లూరు, ఒంగోలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంది. అయితే డాక్టర్లు మెరుగైన చికిత్స అవసరమని సూచించడంతో ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌కు తరలించారు.

కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో కాలేయమార్పిడి చేయాలని, అందుకు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యనిపుణులు శృతి తండ్రి కొండరావుకు వివరించారు. ఆయన అంతస్తోమత లేక దాతల సహకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో శృతి ఆరోగ్యం మరింత విషమించి తుదిశ్వాస విడిచింది. ఈ నెల 5వతేదీ వరకు ఆమె కళాశాల్లో సెమిస్టర్‌ పరీక్షలు రాసి వెళ్లింది. శృతికి వచ్చిన కామెర్ల వ్యాధి గుర్తించకపోవడం, అందరు విద్యార్థులతో పాటు సాధారణంగా ఉంటూ, వ్యవసాయ పనులు చేయడం వల్లనే వ్యాధి ముదిరినట్టుగా తెలుస్తోంది. 

కడసారి చూపులకు వెళ్లిన విద్యార్థులు
శృతి మరణాన్ని జీర్ణించుకోలేని సహచర విద్యార్థులు తమ స్నేహితురాలిని కడసారి చూసి నివాళులర్పించేందుకు ఏజీ పాలిటెక్నిక్‌ విద్యార్థులు శనివారం కనిగిరి వెళ్లారు. విద్యార్థులు వెళ్లేందుకు ప్రిన్స్‌పల్‌ ప్రత్యేకవాహనం ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ముందుగా అనుమతి లేదని కాలేజీ నిర్వాహకులు వెల్లడించడంతో విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో యూనివర్సీటీ అనుమతి పొంది విద్యార్థులను శృతి భౌతికకాయం వద్దకు తీసుకుని వెళ్లారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top