కిక్కెక్కుతోంది! | Political parties distributing money to the voters | Sakshi
Sakshi News home page

కిక్కెక్కుతోంది!

Mar 10 2014 3:25 AM | Updated on Sep 17 2018 5:36 PM

వరుస ఎన్నికలతో జిల్లా మత్తులో జోగుతోంది. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం నిల్వలను భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి.

కర్నూలు, న్యూస్‌లైన్ : వరుస ఎన్నికలతో జిల్లా మత్తులో జోగుతోంది. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం నిల్వలను భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. డబ్బుతో పాటు మద్యాన్ని ఏరులై పారించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 30న పురపాలక ఎన్నికలు నిర్వహించనుండటం.. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో అభ్యర్థులు ఓటర్లకు గాలమేసేందుకు ముమ్మర ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో సుమారు 200 పైగా గ్రామాల్లో నాటుసారా కుటీర పరిశ్రమగా మారింది. ముఖ్యంగా తండాలు తయారీ కేంద్రాలుగా పేరొందాయి.
 
 నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లా నుంచి నాటుసారా విరివిగా సరఫరా అవుతోంది. సాధారణ రోజుల్లో జిల్లాలో రోజుకు రూ.50 లక్షలకు పైగా విలువైన నాటుసారా వ్యాపారం సాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారుల అనధికార అంచనా. ఎన్నికల సీజన్ ప్రారంభమైనందున ఆ వ్యాపారం మరింత జోరందుకుంది. నంద్యాల, ఆదోని, కర్నూలు కేంద్రాలుగా ఎక్సైజ్ శాఖలో యాక్షన్ టీమ్‌లు ఉన్నాయి.
 
 అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై నిరంతరం నిఘా ఉంచి నిరోధించాల్సిన యాక్షన్ టీమ్ సిబ్బంది కొందరు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. డోన్ నియోజకవర్గ పరిధిలోని రాచర్ల, నేరేడుచెర్ల, కొమ్మెమర్రి, బూర్గుల, బోంచెర్వుపల్లె, క్రిష్ణగిరి మండలం అమకతాడు, పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గుడుంబాయితాండ, ఎర్రకత్వ ప్రాంతాల నుంచి కర్నూలు నగరానికి నాటుసారా రవాణా అవుతోంది.
 
 సంచుల్లో రహస్యంగా పల్లెవెలుగు బస్సుల్లో.. మోటార్‌సైకిళ్లపై నగరానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు శివారులోని వీకర్‌సెక్షన్ కాలనీ నాటుసారా వ్యాపారానికి కేంద్రంగా మారింది. హుసేనాపురం, రంగాపురం, కలుగొట్ల, పులగుమ్మి తదితర ప్రాంతాల నుంచి సారా కేంద్రాలు లేని గ్రామాలకు తరలించి వ్యాపారం నిర్వహిస్తున్నారు.
 
 లీటరు రూ.40 నుంచి రూ.50లకు విక్రయిస్తుండటంతో మంద్రుబాబులు లిక్కర్‌కు ప్రత్యామ్నాయంగా ఇటువైపు ఆకర్షితులవుతున్నారు. జిల్లా కేంద్రం బంగారుపేటలో సారా దందా బహిరంగమే అయినా అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వానికి లెక్కలు చూపేందుకు తూతూమంత్రంగా దాడులు జరపడం.. అమాయకులపై కేసులు బనాయించడం పరిపాటిగా మారింది. బంగారుపేటలో రెండు రోజుల క్రితం దాదాపు 30వేల సారా ప్యాకెట్లు ఒక పాడుబడ్డ ఇంట్లో నిల్వ ఉంచడం, స్థానికుల సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి ధ్వంసం చేయడం తెలిసిందే. రోజుకు రెండు వేల లీటర్లకు పైగా సారా ఇక్కడ సారా తయారవుతోంది. ఈ లెక్కన జిల్లాలో రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల లీటర్ల సారా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం.
 
 సరిహద్దు గ్రామాల్లో కర్ణాటక మద్యం జోరు
 సరిహద్దు గ్రామాల్లో కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది. జిల్లాలోని కోసిగి, కౌతాళం, మాధవరం, నాగులదిన్నె, మంత్రాలయం ప్రాంతాల్లోని మద్యం వ్యాపారులు ఎన్నికల దృష్ట్యా కర్ణాటక నుంచి నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను పెద్ద ఎత్తున తరలించి నిల్వ చేసుకుంటున్నారు. తుంగభద్ర నదిలో నాటు పడవల ద్వారా బాక్సుల కొద్దీ మద్యాన్ని తరలిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. కొందరు నదిలో కాలినడకన కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి మద్యం బాక్సులను రవాణా చేస్తున్నారు. అలాగే ఫ్రూటీ ప్యాకెట్ తరహాలో టెట్రా(సారా) ప్యాకెట్లను, 90 ఎంఎల్ మద్యం బాటిళ్లను కూడా జిల్లా సరిహద్దు గ్రామాల వ్యాపారులు కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
 
 శిథిలావస్థలో చెక్‌పోస్టులు
 కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి జిల్లాల నుంచి జిల్లాకు నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ భారీ ఎత్తున రవాణా జరుగుతోంది. అక్రమ మద్యం రవాణాపై నిఘా ఉంచేందుకు జిల్లాలోని ఛత్రగుడి, హొళగుంద, పెద్దహరివాణం, బాపురం, మాధవరం, నాగులదిన్నె ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ శిథిలావస్థలో ఉండటంతో నిఘా కొరవడింది. చెక్‌పోస్టుల్లో కనీసం ఒక టేబుల్, రెండు కుర్చీలు, రోడ్డుకు ఇరువైపులా డ్రమ్ములు తదితరాలు లేకపోవడంతో సిబ్బంది లాఠీలతో రోడ్లపై నిల్చొని పర్యవేక్షించాల్సి ఉంటోంది. విధిలేని పరిస్థితుల్లో ఇక్కడి సిబ్బంది కూడా మామూళ్లు దండుకొని వదిలేస్తున్నట్లు తెలుస్తోంది.
 
 భారీగా బెల్లం నిల్వలు
 ఎన్నికల నేపథ్యంలో సారా తయారీకి అవసరమైన బెల్లాన్ని వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. కర్నూలు, ఆదోని, నంద్యాలలో హోల్‌సేల్ వ్యాపారస్తులు కర్ణాటకలోని భద్రావతి, తమిళనాడులోని సేలం నుంచి లారీల కొద్దీ బెల్లాన్ని దిగుమతి చేసుకొని గోడౌన్లలో నిల్వలు చేసుకుంటున్నారు. సారా తయారీకి గతంలో ప్రత్యేకంగా నల్లబెల్లం వినియోగిస్తుండగా.. ప్రస్తుతం కొరత నేపథ్యంలో మామూలు బెల్లాన్నే వాడుతున్నారు. వ్యాపారులకు ఎంత స్టాకు వస్తుంది, వ్యాపార లావాదేవీలు ఎలా నిర్వహిస్తున్నారనే విషయంపై నిఘా లేకపోవడమే ఇందుకు కారణమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement