ఎన్టీఆర్ స్టేడియం వేదికగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సరికొత్త రాజకీయానికి తెరలేచింది. స్టేడియం అభివృద్ధికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
పొలిటికల్ గేమ్
Jan 1 2014 3:30 AM | Updated on Sep 17 2018 4:56 PM
సాక్షి, గుంటూరు :ఎన్టీఆర్ స్టేడియం వేదికగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సరికొత్త రాజకీయానికి తెరలేచింది. స్టేడియం అభివృద్ధికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సిఫార్సుతో ఏర్పాటు చేసిన అడ్‌హాక్ కమిటీపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకులతో పాటు, స్టేడియం శాశ్వత సభ్యులు ఈ కమిటీ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కమిటీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన మంత్రి కన్నాను నిలదీసేందుకు మంగళవారం టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ స్టేడియానికి మూడేళ్ల నుంచి అభివృద్ధి కమిటీ లేదు. తనకు అనుకూలురైన ప్రముఖులను కమిటీలో నియమిస్తే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో బలమైన వర్గం నుంచి మద్దతు లభిస్తుందని మంత్రి కన్నా ఆశించారు.
ఆ మేరకు 9 మంది సభ్యులతో కూడిన అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేయించారు. ఇందులో నగర ప్రముఖులు చుక్కపల్లి రమేష్, ఎం. వెంకటరత్నం, ముల్లంగి రామిరెడ్డి, జి. వెంకటేశ్వరరావు, పి. పోలేశ్వరరావు, బివిఎన్ చౌదరి, జాగర్లమూడి సునీత, దారపనేని తిరుపతమ్మ, కె. వెంకట నరసింహారావు(లీగల్ అడ్వైజర్)లు ఉన్నారు. అయితే దీన్ని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు, స్టేడియం శాశ్వత సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన స్టేడియం ఎన్నికలను రాజకీయం చేస్తున్నారంటూ రెండు రోజుల కిందట ఆందోళన చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు మార్నింగ్ వాక్ నిమిత్తం స్టేడియంకు వచ్చిన మంత్రి కన్నాను నిలదీసేందుకు టీడీపీ నాయకులు లాల్‌వజీర్, మన్నవ సుబ్బారావు, మరికొందరు స్టేడియం సభ్యులు ప్రయత్నించారు. దీన్ని ముందుగానే పోలీసులు పసిగట్టి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు.
సాయంత్రం ఐదుగంటలకు అడ్‌హాక్ కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారుల సమక్షంలో ప్రమా ణ స్వీకారం చేయనున్నారని తెలుసుకున్న టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, యువత నాయకుడు అబ్బూరి మల్లి, చిట్టిబాబు, లాల్‌వజీర్‌తోపాటు సుమారు వంద మంది వరకు కార్యకర్తలు ,తదిరులు స్టేడియం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే బందోబస్తులో ఉన్న డీఎస్పీ లావణ్యలక్ష్మి, పట్టాభిపురం సీఐ రాజశేఖర్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అర గంట పాటు స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మున్సిపల్ అదనపు కమిషనర్ పులి శ్రీనివాసులు ఆందోళనకారులను లోపలకు పిలిపించి మాట్లాడారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సలహా కమిటీ మాత్రమేనన్నారు. ఆరు నెలలలోపు ఎన్నికలు జరగకపోతే ఇదే కమిటీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదో ఎత్తుగడ..
ఎన్టీఆర్ స్టేడియంలో అధికారం ఎవరి పరమైతే వారి మద్దతు అసెంబ్లీకి పోటీ చేసే నాయకులకు అవసరమై ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే పశ్పిమ నియోజకవర్గంలో కీలకమైన బలమైన సామాజికవర్గం ఓట్లు పడాలి. ఇది జరగాలంటే ముందుగా ఎన్టీఆర్ స్టేడియాన్ని హస్తగతం చేసుకోవాలి. ఇదే వ్యూహంతో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ముందస్తు రాజకీయానికి శ్రీకారం చుట్టారన్నది టీడీపీ నాయకుల వాదన.
చుక్కపల్లి డుమ్మా...
మంగళవారం సాయంత్రం పులి శ్రీనివాసులు సమక్షంలో జరిగిన సమావేశానికి 9 మంది సభ్యుల్లో ముగ్గురు సభ్యులు హాజరు కాలేదు. ఇందులో చుక్కపల్లి రమేష్, రామిరెడ్డి, నరసింహారావులు ఉన్నారు. వీరు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
Advertisement
Advertisement