పేర్ని నాని ‘హ్యాట్రిక్‌’ విజయం

Perni Nani Holds Hatric Victory In Machilipatnam Assembly Constituency - Sakshi

సాక్షి, చిలకలపూడి : బందరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని) ముచ్చటగా మూడోసారి ఘన విజయం సాధించారు. ఏప్రిల్‌ 11వ తేదీన నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ విజయకేతనం ఎగురవేసింది. నియోజకవర్గంలో 1,84,506 ఓట్లు ఉండగా వీరిలో 1,46,476 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు.

15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్, సర్వీస్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్‌ నుంచి పేర్ని నాని ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. రెండో రౌండ్‌లో 18వ నెంబరు బూత్‌కు సంబంధించి ఈవీఎం మొరాయించడంతో లెక్కింపు ప్రక్రియను నిలిపివేశారు. అనంతరం రౌండ్ల ప్రక్రియ కొనసాగుతుండగా 148వ నెంబరు బూత్‌కు సంబంధించిన ఈవీఎం కూడా మొరాయించింది.

దీంతో రౌండ్ల సంఖ్య పూర్తైన అనంతరం ఆయా బూత్‌లకు సంబంధించిన వీవీప్యాట్ల స్లిప్‌లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. తొలుత లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్, సర్వీస్‌ ఓట్లలో పేర్ని నానికి ఆదిక్యత లభించింది. నియోజకవర్గవ్యాప్తంగా 2,161 పోస్టల్‌ బ్యాలెట్లు, 37 సర్వీస్‌ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో 1121 పోస్టల్‌ బ్యాలెట్లు, 12 సర్వీస్‌ ఓట్లు ౖవైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పేర్ని నానికి లభించాయి. 511 పోస్టల్‌ బ్యాలెట్లు, 9 సర్వీస్‌ ఓట్లు టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు లభించాయి.

వీటిలో 613 ఓట్లు పేర్ని నానికి ఆధికంగా వచ్చాయి. అనంతరం 15 రౌండ్లలో ఈవీఎంల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. వీటిలో 65,008 వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని)కి రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు 59,770 ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓటర్లు ఈవీఎంల ద్వారా వచ్చిన ఓట్లను మొత్తం లెక్కిస్తే టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కంటే పేర్ని నానికి 5,852 ఓట్లు ఆధిక్యత లభించింది. ఆయా రౌండ్ల వారీగా ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top