కన్నతల్లి ఆవేదనకు 'స్పందించిన' హృదయాలు

People Reacted To Mother Petition For Her Child In Spandana Pragramme In Ongole  - Sakshi

సాక్షి, ఒంగోలు : ఓ మాతృమూర్తి స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుకు అనేక హృదయాలు స్పందించాయి. దీంతో పసిగుడ్డు బుధవారం రాత్రి తల్లి చెంతకు చేరాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒంగోలుకు చెందిన ఒక యువతి బెంగళూరులో బీడీఎస్‌ (డెంటల్‌ కోర్సు) చేస్తున్న సమయంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అతను కలిగిన వాడే. ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆమె ప్రియుడే సర్వస్వం అంటూ వివాహం చేసుకుని అత్తవారింట అడుగుపెట్టింది. ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చింది.

ఈ క్రమంలో ఆరోగ్య సమస్య తలెత్తడంతో తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. దీంతో వారు వియ్యంకుల ఇంటికి వెళ్లి కూతుర్ని ఇంటికి తీసుకువెళతామన్నారు. ఇందుకు వారు కూడా ఏమీ అనలేదు. కాకుంటే బిడ్డ మాత్రం తమ వద్దే ఉంటాడని స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక 22 రోజుల పసిబిడ్డను అక్కడే వదిలి స్వగ్రామం బాట పట్టింది. అయితే వచ్చింది మొదలు బిడ్డపై బెంగ ఒక వైపు, మరో వైపు పాలిండ్లలో పాలు ఎక్కువై బాబుకు పట్టించే అవకాశం లేక గడ్డలు కడుతున్న దృశ్యం మరో వైపు తీరని వెతగా మారింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో స్పందనలో ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మహిళా పోలీసులకు అప్పగించారు. 

తల్లి చెంతకు బాబు..
మహిళా సీఐ జ్యోతి రాణి తమ సిబ్బందిని జగ్గయ్యపేటకు పంపించారు. అక్కడి పోలీసుల సాయంతో ఫిర్యాది అత్తింటివారితో చర్చించా రు. ఎట్టకేలకు వారికి నచ్చజెప్పిబాబును తీసుకువచ్చి ఒంగోలులో తల్లిని పిలిపించి అప్పగించా రు. పసిబిడ్డను, తల్లిని వేరుచేయడం  దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. దీనిపై మహిళా పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జ్యోతి రాణి మాట్లాడుతూ సోమవారం స్పందనలో ఫిర్యాదు వచ్చిందని, బుధవారం కల్లా బాబును తల్లి చెంతకు చేర్చగలిగామన్నారు.

సాధారణంగా ఇటువంటి కేసుల పరిష్కారం జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయని, కానీ స్పందన  వల్లే త్వరితగతిన సమస్యను పరిష్కరించగలిగామన్నారు. ఎందరో మహిళలు కన్నీటితో వస్తారని వారందరి కళ్లల్లో వెలుగులు నిం పేందుకు మహిళా పోలీసుస్టేషన్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.  తనను, బిడ్డను కలిపినందుకు తల్లి, ఆమె కుటుంబసభ్యులు మహిళా పోలీసుస్టేషన్‌ అదికారులకు,  ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top