నిర్లక్ష్యం వద్దు!

People Negligence On Train Tracks PSR Nellore - Sakshi

నగరంలో ఏడు కిలోమీటర్లు మేర రైల్వే ట్రాక్‌

ఏడాదికి 200మందికి పైగానే మృత్యువాత

ఈ ఏడాదిలో 125 మంది దుర్మరణం

అధికశాతం మంది పట్టాలు దాడుతుండగానే..

పట్టించుకోని రైల్వే శాఖ  

నెల్లూరు(క్రైమ్‌): క్షణాల్లో మృత్యువు కౌగిలిస్తుందని తెలిసినా కొందరిలో అదే నిర్లక్ష్యం. ప్రమాదమని తెలిసే వేసి ఉన్న గేట్ల కిందనుంచి దూరిపోతున్నారు. నడకకూ చోటేలేని వంతెనలపై పట్టాలు దాటుతున్నారు. అందుకే నగరంలో 7 కి.మీ రైలు మార్గంలో నిత్యం ఎక్కడో ఒకచోట పట్టాలు రక్తసిక్తం అవుతూనే ఉన్నాయి. పెన్నావారధి నుంచి వేదాయపాలెం వరకు ఉన్న పట్టాలపై సగటున వారానికి ముగ్గురు నుంచి నలుగురు మృతిచెందుతున్నారు. పాత చెక్‌పోస్ట్‌ రైల్వే గేట్, రంగనాయకులపేట, విజయమహాల్‌గేట్, కొండాయపాలెంగేట్‌తో పాటూ సౌత్‌ రైల్వేస్టేషన్, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలోని నక్కలోళ్ల సెంటర్, ఎస్‌2 థియేటర్‌ సమీపం, వేదాయపాళెం ప్రాంతాల్లోని రైలుపట్టాలు నిత్యం రక్తమోడుతున్నాయి.

ఇప్పటికి 125
జిల్లా వ్యాప్తంగా సంభవిస్తున్న ప్రమాదాల్లో ఏటా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య 250. కేవలం నగరంలోని ఏడు కి.మీ çపరిధిలోనే మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. 2016, 2017 సంవత్సరాల్లో జిల్లాలో 485 మంది దుర్మరణం చెం దారు. 2018లో ఇప్పటివరకు 125 మంది మృతి చెందారు. వీరిలో అధికశాతం మంది పట్టాలు దాటేక్రమంలో రైలుఢీకొని మృతి చెందినట్లు సమాచారం.

కారణాలివే..
రైల్వేగేట్లు ఉన్న పాత చెక్‌పోస్ట్, రంగనాయకులపేట, విజయమహల్‌గేట్, కొండాయపాలెంగేట్‌ తదితర ప్రాంతాలు నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. వాహనదారులు, పాదచారులు రైలు వచ్చే క్షణాల్లోనే తొందరగా వెళ్లాలని వేసి ఉన్నగేట్లు కింద నుంచి దూరి వెళుతున్నారు. రైలు వేగాన్ని అంచనా వేయలేక పట్టాలు దాటుతూ మృత్యువడిలోకి చేరుతున్నారు.

సౌత్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వాణిజ్య దుకాణాలు అధికంగా ఉన్నాయి. దీంతో నిత్యం వందలాదిమంది రైలుపట్టాలను దాటి వెళుతుంటారు. సౌత్‌స్టేషన్‌ నుంచి ఎస్‌2 థియేటర్‌ సమీప రైలుపట్టాల మధ్య దూరం సుమారు అర కి.మీ థియేటర్‌కు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లడం బదులుగా నిమిషాల వ్యవధిలో పట్టాలు దాటేందుకు కనీసం ఫుట్‌పాత్‌ కూడా లేని వంతెన (పట్టాలు మాత్రమే ఉన్నవి) మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు.  
ఆత్మకూరు బస్టాండ్‌ నుంచి కనకమహాల్‌కు రావాలంటే సుమారు 15 నిమిషాలు సమయం పడుతుంది. అదే నక్కలోళ్ల సెంటర్‌ నుంచి పట్టాలు దాటితే కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. దీంతో పాదచారులు నిత్యం వందలాదిమంది ఇటుగానే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో మార్గం మలుపు తిరిగి ఉండటంతో తీరా దగ్గరకు వచ్చింతేవరకు రైలు వస్తున్నట్లు తెలియక ప్రమాదాలకు గురవుతున్నారు.

పట్టించుకోని రైల్వేశాఖ
రైలుపట్టాలపై నడక చట్టరీత్యానేరం. అయితే రైల్వే పోలీసులు తమ కళ్లెదుటే ఎంతోమంది హడావుడిగా పట్టాలు దాటుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పట్టాలపై చావులకు గల కారణాలు గురించి ఆరా తీయకుండానే ప్రమాదవశాత్తు చోటుచేసుకుందని తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి సరిపెట్టుకొంటున్నారు. మరోవైపు రైల్వే శాఖలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఉన్న ఆరాకొర సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. 

ఒక్కక్షణం ఆలోచించాలి
మలుపుల వద్ద, ఫుట్‌పాత్‌లు లేని వంతెనలు, త్వరగా వెళ్లాలన్న ఆలోచనతో పట్టాలు దాటుతున్నప్పుడే అధిక మంది మృతిచెందుతున్నారన్న విషయాన్ని పాదచారులు గమనించాలి.
రైల్వేస్టేషన్లలో వంతెనల మీదుగానే నడవడం మంచిది. గేట్లు వేసి ఉన్న సమయంలో కిందనుంచి దూరి వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోరాదు.
పట్టాలపై నిర్లక్ష్యంగా నడిచేవారిపై, గేట్‌ కింద నుంచి దూరే వాహనదారులు, పాదచారులపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయాలి.
జనసంచారం ఉన్న ప్రాంతాల్లో, ప్రమాదకర మలుపుల వద్ద పాదచారులు రైలుపట్టాలపై నుంచి రాకపోకలు సాగించకుండా రైల్వే పోలీసులు సిబ్బందిని నియమించాలి.
ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు పట్టాలకు ఇరువైపులా జనం రాకుండా గోడలు నిర్మించాలి. నగర వాసులకు అవగాహన కల్పించాలి.   

డేంజర్‌స్పాట్‌ ఇదే  
విజయమహాల్‌గేట్‌ నుంచి సౌత్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మృతిచెందుతున్న వారిలో ఎక్కవమంది 20 నుంచి 40 ఏళ్లలోపు వయస్సున్న వారే. ఈ ప్రాంతంలోని రైలుపట్టాల వెంబడి రాత్రి, పగలు అన్నతేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం మత్తులో ఇక్కడకు వచ్చే వ్యక్తులు కొందరు రైళ్లు ఢీకొని మృత్యువాతపడుతుండగా మరికొందరు ఘర్షణలకు దిగి పరిగెత్తుతూనో, మద్యం మత్తులోనే రైలుఢీకొని చనిపోతున్నారు. ఈ విషయం రైల్వే శాఖ అధికారులు, సిబ్బందికి తెలిసినా పట్టించుకోవడం లేదు. స్థానిక పోలీసులు సైతం అటువైపుగా కన్నెతైనా చూడకపోవడంతో ఈ ప్రాంతం డేంజర్‌స్పాట్‌గా మారింది. రెండురోజులకొకరు రైలు ఢీకొనో?, కిందపడో? ఇతర కారణంతోనో మృతిచెందుతున్నారు. రైల్వే పోలీసులు మాత్రం ఏ చావైనా ఒక్కటే కేసుగా భావిస్తున్నారు.  

కొన్ని ఘటనలు
జూన్‌ 30వ తేదీన చింతారెడ్డిపాలెం బలిజపాళేనికి చెందిన వి.వెంకటసురేంద్ర (49) బాబా సమోసా సమీపంలోని రైలుపట్టాలు దాటుతుండగా కావలి వైపు వెళ్లే గుర్తుతెలియని రైలుఢీకొని మృతిచెందాడు
జూలై 1వ తేదీన గూడూరు పట్టణానికి చెందిన టి.శ్రీధర్‌రావు (45) విజయమహాల్‌గేట్‌ – ఎస్‌2 మధ్యలో పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలుఢీకొని మృత్యువాడపడ్డాడు.
జూలై 3వ తేదీన అందరూ చూస్తుండగానే హైదరాబాద్‌కు చెందిన కృష్ణకుమారి (32) నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది.
జూలై 4వ తేదీన వేదాయపాళెం రైల్వేస్టేషన్‌ సమీప రైలుపట్టాలను దాటుతున్న కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన ఆటోడ్రైవర్‌ జి.వీరరాఘవులు (38) రైలు ఢీకొనడంతో మృతిచెందాడు.  
ఈనెల 10వ తేదీన విజయమహాల్‌గేట్‌ సమీప రైలుపట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని 30 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతిచెందాడు.
రంగనాయకులపేట రైలు గేట్‌ వద్ద పట్టాలు దాటుతుండగా ఓ యువకుడ్ని రైలు ఢీకొంది. గాయాలపాలైన అతడిని స్థానికులు చికిత్సనిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top