ఫిబ్రవరిలో ‘పాలమూరు జాతర’


కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా విశిష్టత, సంస్కృతి ప్రతిబింబించే విధంగా పాలమూరు జాతర ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వెల్లడించారు. సోమవారం రాత్రి తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..పాలమూరు సంస్కృతి, ప్రాచీనచరిత్రను ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఈ జాతరను ఫిబ్రవరి 7, 8, 9తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహిస్తామన్నారు. జాతరకు సంబంధించి ఆయా శాఖలకు అప్పగించిన బాధ్యతలను విధిగా నెరవేర్చాలని సూచించారు. ఈనెలాఖరులోగా కమిటీలను నియమించి, కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగేలా చూడాల్సిందిగా అధికారులను కోరారు. మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో రోజుకొక కార్యక్రమం ఉండేవిధంగా ప్రణాళికలు సిద్ధంచేయాలని కోరారు. ఇందులో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పూలు, పండ్ల ప్రదర్శనలతోపాటు, మండలాల ఫొటోలు ఉండేవిధంగా చూడాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా బాలల చిత్రాలను ప్రదర్శించడంతోపాటు కార్నివార్, శోభాయాత్ర, హస్తకళలు, చేనేత వస్తుప్రదర్శన, జానపదాలు, సంగీత విభావరి, కవి సమ్మేళనం, ఆదర్శ రైతుల ఉత్పత్తులు ప్రదర్శించాలని సూచించారు. అదేవిధంగా పాటలపోటీలు, హాస్యవల్లరి, పాలమూరు థీమ్‌సాంగ్, వంటి కార్యక్రమాలు జిల్లావాసులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని కోరారు.

 

 పలువురికి సన్మానాలు

 పాలమూరు జాతర సందర్భంగా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లతోపాటు, కవులు, రచయితలు, పారిశ్రామిక వేత్తలను సన్మానించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను ముందుస్తుగానే సిద్ధంచేసి వారికి సమాచారం అందేవిధంగా చూడాలని డీఆర్వో రాంకిషన్‌ను కోరారు. ఈ సన్మానాలతో వారికి పాలమూరు వైభావాన్ని చాటిచెప్పే విధంగా కార్యక్రమాలు ఉండాలని  కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఏజేసీ డాక్టర్ రాజారాం, జెడ్పీ సీఈఓ రవీందర్, హౌసింగ్ పీడీ రవీందర్‌రెడ్డి, కేఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ హన్మంతరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top