పైరవీల కొండ

Pairavies in TTD Chittoor - Sakshi

టీడీపీ నేతల అనుచరులకే లైసెన్స్‌లు

అనుమతుల కోసం చేతులు మారిన రూ.కోట్లు

తిరుమల నిర్వాసితులకు మొండిచేయి

ఫలించనున్న అధికార పార్టీ నేతల పైరవీలు

నేడు టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం

టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నాయకులు తిరుమలను తమ వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను అమ్ముకోవడంతో పాటు.. వ్యాపార దుకాణాలు, హాకర్స్‌ అనుమతులకు సైతం పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకుని తమకు అనుకూలమైన వారికి కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారి ఒకరు టీటీడీ నిర్వాసితుల వద్ద వెల్లడించడం ఇందుకు నిదర్శనం. నిర్వాసితులకు టీటీడీ ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, తిరుపతి: తిరుమలలో తమ అనుచరులకు హాకర్స్‌ లైసెన్సులు ఇప్పించుకునేందుకు టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు. అన్నమయ్య భవన్‌లో మంగళవారం నిర్వహించనున్న పాలకమండలి సమావేశంలో హాకర్స్‌ లైసెన్స్‌లకు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కొత్త, పాత లైసెన్స్‌ల విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే వేలాదిమంది భక్తులు సంప్రదాయంగా భావించి దేవుని చిత్రపటాలు, కంకణ దారాలు తీసుకుని వెళ్తుంటారు. వాటిని దుకాణాల్లోనూ, తిరుమల పురవీధుల్లో తిరుగుతూ హాకర్లు విక్రయిస్తుంటారు. అలా విక్రయించాలంటే టీటీడీ అనుమతులు తప్పనిసరి. తిరుమలలో ఇటువంటి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేవారందరూ స్థానికులే. అటువంటి వారికోసం టీటీడీ గతంలో 250 హాకర్స్‌ లైసెన్సులు ఇచ్చింది. ప్రస్తుతం వాటిని రెన్యూవల్‌ చేయాల్సి ఉంది. వాటితో పాటు మరో 450 కొత్త లైసెన్సులు పొందేందుకు టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు. పాత వాటికి అనుమతులు ఇవ్వడంలో పాలకమండలి సభ్యులు ఆలస్యం చేస్తున్నారు. అయితే అనుమతుల కోసం స్థానికులు ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, దేవదాయశాఖ అధికారులను కలిసి విన్నవించారు. తిరుమలలో హాకర్స్‌ లైసెన్సులకుమంచి డిమాండ్‌ ఉండడంతో టీడీపీ నేతలు వాటి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ వారికి అనుమతులు ఇప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఒకసారి హాకర్‌ లైసెన్స్‌ అనుమతి పొందితే.. తిరుమలలో సొంతంగా వ్యాపారం చేయలేకపోయినా.. ఎవరికో ఒకరికి అద్దెకు కట్టబెడితే నెలకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు అద్దె రూపంలో ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు తిరుమలను తమ పార్టీ వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తిరుమల నిర్వాసితులకు శఠగోపం
మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా 2003లో నాలుగు మాడవీధుల్లో నివసిస్తున్న 190 కుటుంబాల వారిని తిరుపతి మంగళం సమీపంలోని తిరుమలనగర్‌కు తరలించారు. ఆ సమయంలో ఆస్తులు పోగొట్టుకున్న వారిని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో నిర్వాసితులు ప్రతి కుటుంబానికి తిరుమలలో షాపు కేటాయించడం, నివాస స్థలంతో పాటు పక్కాగృహం నిర్మించి ఇస్తామని టీటీడీ హామీ ఇచ్చింది. ఆ హామీని టీ ఇంతవరకు అమలు చేసిన దాఖలాలు లేవని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్వాసితుల హామీలను పక్కనబెట్టి తిరుమలలో హాకర్స్‌ అనుమతులను అధికార పార్టీ అనుచరులకు కట్టబెట్టుతుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇవ్వనున్న లైసెన్స్‌లకు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పుచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రిని కలిసిన టీడీపీ నేతలు, టీటీడీ ముఖ్య అధికారులు సమావేశమయ్యారు. ఆ సమయంలో హాకర్స్‌ అనుమతులు ఎవరెవరికి ఇవ్వాలనే జాబితా వివరాలను టీటీడీ అధికారులకు సమర్పించారు. హాకర్స్‌ అనుమతుల కోసం తిరుమల నిర్వాసితులు గత కొంతకాలంగా టీటీడీ అధికారులు, సీఎం, మంత్రి, స్థానిక ఎమ్మెల్యేకి పలుమార్లు మొరపెట్టుకున్నారు. ఎంతకీ స్పందించకపోవడంతో వారం రోజులకుపైగా ఆందోళన చేశారు. అదే సమయంలో జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారిని కూడా కలిసి విన్నవించారు.

త్రిసభ్య కమిటీ
హాకర్స్‌ లైసెన్సుల జారీపై పాలకమండలి త్రిసభ్య కమిటీని వేసింది. ఆ కమిటీలో చైర్మెన్‌గా బోర్డు సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి, సభ్యులుగా రుద్రరాజు, బోండా ఉమ నియమించారు. హాకర్స్‌ను లీడ్‌ చేస్తున్న ఓ మహిళను ఇటీవల టీటీడీ ఉన్నతాధికారి పిలిచి త్వరలో లైసెన్స్‌లు ఇస్తున్నట్లు ఆమెకు సమాచారం ఇచ్చారు. అందులో భాగంగా ఈనెల 5న హాకర్స్‌ అనుమతులపై చర్చలకు రమ్మని స్థానికులను ఆహ్వానించారు. ఆ సమయంలో టీటీడీ బోర్డు సభ్యులు చల్లా బాబు స్థానికులను దురుసుగా మాట్లాడినట్లు వాపోయారు. దీంతో వారు బోర్డు సభ్యుని కారుకు అడ్డుగా పడుకుని నిరసన తెలియజేశారు. తమ ఇంటిని విక్రయించి హాకర్స్‌ అనుమతి కోసం డబ్బులు చెల్లించానని, ప్రస్తుతం పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి అని కన్నీరుపెట్టుకున్నట్లు సమాచారం.

పాలకమండలి సభ్యుల మెలిక
తాము ఇచ్చిన 450 మంది జాబితాకు ఒప్పుకుంటే పాత లైసెన్సులు 250కి అనుమతులు ఇస్తామని పాలకమండలి సభ్యులు మెలిక పెట్టినట్లు తెలిసింది. అయితే ఎంతకీ స్థానికులు ఒప్పుకోకపోవడం, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మంగళవారం తిరుమలలో నిర్వహిస్తున్న పాలకమండలి సమావేశంలో హాకర్స్‌ లైసెన్సులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో హాకర్స్‌ లైసెన్సులతో పాటు గత కొంతకాలంగా స్థానికులు, నిర్వాసితుల సమస్యలు, బాలాజీనగర్‌ అభివృద్ధిపై చేపడుతున్న ఆందోళనలపై చర్చించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top