ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పదిమందికి గాయాలయ్యాయి.
మంగళగిరి రూరల్ (గుంటూరు) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పదిమందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన కాకాని ఎన్‌ఆర్‌ఐ జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న కారు.. ఎదురుగా గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న టాటాఏస్ వాహనాన్ని ఎన్‌ఆర్‌ఐ జంక్షన్ వద్ద ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఒక వ్యక్తి మృతిచెందాడు.
అయితే ప్రమాద అనంతరం వాహనం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో.. కనిగిరి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు టాటాఏస్‌ను ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురికి తీవ్రగాయాలు కాగా.. మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.