అనకాపల్లి బైపాస్ రోడ్డు పై ఆదివారం రాత్రి లారీ బీభత్సం సృష్టించింది.
అనకాపల్లి: అనకాపల్లి బైపాస్ రోడ్డు పై ఆదివారం రాత్రి లారీ బీభత్సం సృష్టించింది. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న లారీ బైపాస్ రోడ్డు పై ఉన్న దాబా సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా నివాసముంటున్న ప్రసాద్(38) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి దాబా హోటల్‌లో భోజనం చేసి బయటకు వచ్చి రోడ్డు పక్కన నిల్చొని ఉన్న సమయంలో లారీ అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది.
దీంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో వారికి చెందిన ద్విచక్రవాహనం నుజ్జునజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రసాద్ అంధుడు అని స్థానికులు అంటున్నారు.