పొలంలో పురాతన ఆలయం

Oldest temple on the farm - Sakshi

లోతు చేస్తుండగా బహిర్గతం

లక్ష్మీదేవి పాలరాతి విగ్రహంతో పాటు పలు శిథిలాలు లభ్యం

బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): వ్యవసాయ పనులుచేస్తుండగా చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం శీలంవారిపల్లె సమీపంలోని కోనాపురం వద్ద పురాతన ఆలయం బయల్పడింది. శిధిలమై పూడిపోయిన ఆలయ శిథిలాలతో పాటు లక్ష్మీదేవి పాలరాతి విగ్రహం లభించాయి. శీలంవారిపల్లె నుంచి కనికలతోపుకు వెళ్లే రోడ్డు పక్కన కోనాపురం అని పిలుచుకునే ప్రాంతంలో 25ఏళ్ల క్రితం అరవ చిన్నప్పకు 81 సెంట్ల భూమికి డీకేటీ పట్టా మంజూరు చేశారు. సోమవారం అతని కుమారులు జేసీబీతో పొలాన్ని లోతుగా చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి వాడే రాళ్లు భూమిలోంచి తీసేకొద్ది వస్తుండగా వాటిని పొలంలోనే కుప్పగా పోశారు. వాటిలో లక్ష్మీదేవి విగ్రహం కనిపించింది. గ్రామస్తులు విగ్రహాన్ని శుద్ధిచేసి పూజలు చేశారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్‌ఐ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. 

కోనేటిరాయ ఆలయం విరాజిల్లింది 
కోనాపురం ప్రాంతంలో కోనేటిరాయస్వామి ఆలయం విరాజిల్లినట్టు తెలుస్తోంది. అక్కడ ఆలయానికి సంబంధించిన స్తంభాలు, విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం లేదా పాలెగాళ్ల పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఆలయం వద్దనుంచే అనంతపురం జిల్లాలోని పెనుగొండ నుంచి గుర్రంకొండకు రహదారి ఉండేదని పూర్వీకులు చెప్పేవారని స్థానిక వృద్ధులు తెలిపారు. కోనేటిరాయస్వామి ఆలయం తురుష్కుల దాడుల్లో ధ్వంసం అయివుండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆ శిధిలాలే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయంటున్నారు. కోనేటిరాయ ఆలయం శి«థిలమయ్యాక కొన్ని విలువైన విగ్రహాలు, ధ్వజస్తంభాన్ని పలు ఆలయాలకు తరలించినట్లు తమ పూర్వీకులు చెప్పేవారని శీలంవారిపల్లె మాజీ సర్పంచు శీలం వేణుగోపాల్‌రెడ్డి విలేకరులకు వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top