చంద్రన్నా! నీకాలనీ ఎక్కడన్నా? | Officials Pakka Houses Place Given TO Entrepreneur In Chittoor | Sakshi
Sakshi News home page

చంద్రన్నా! నీకాలనీ ఎక్కడన్నా?

Aug 13 2018 11:50 AM | Updated on Aug 13 2018 11:50 AM

Officials Pakka Houses Place Given TO Entrepreneur In Chittoor - Sakshi

చంద్రబాబునాయుడు ఎస్టీ కాలనీ

చిత్తూరు, తొట్టంబేడు : సాక్షాత్తు చంద్రబాబునాయుడు పేరిట ఉన్న కాలనీలో నివాసం ఉంటున్న ఎస్టీలకు నయానోభయానో ఖాళీ చేయించి, ఆ స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్న పారిశ్రామికవేత్తకు అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు పూర్తిగా సహకరిస్తున్నారు. సర్వేనంబరు 85లో ఓ క్వారీ పక్కన ఉన్న  భూముల్లో 25 మంది రెవెన్యూ అధికారులు నివేశన పట్టాలు ఇవ్వడంతో 23 ఏళ్ల క్రితం కాలనీ నిర్మించారు. అయితే, అధికారులు సర్వే నంబర్‌ 85లో కాకుండా 82–5లో పక్కా గృహాలు నిర్మించారు. దీనికి ఓ క్వారీ యజమాని హస్తమూ ఉంది. అప్పట్లో ఎమ్మెల్యే సురాజ్, కలెక్టర్‌ నరసింగారావు ఆ ఇళ్లను ప్రారంభించారు. కొన్నేళ్లు అనివార్య కారణలతో క్వారీ పనులు ఆగడంతో పనులు లేక కొంతమంది ఎస్టీలు కాలనీ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. 2014–15లో ఉపాధి కింద రూ.5 లక్షలతో సీసీ రోడ్డును నిర్మించారు.  కాపురాలులేని ప్రాంతంలో ఎలా సిమెంట్‌ రోడ్డు వేయడంపై పత్రికల్లో కథనాలు రావడంతో సర్పంచ్‌ భర్త గంగాధరం తొట్టంబేడు పరిధిలోని కొందరు ఎస్టీలకు ఇళ్లు ఇస్తామంటూ ఇక్కడ కాలనీలో వారిని ఉంచారు. ఎస్టీలు కాపురాలు ఉండటంతో అధికారులు సిమెంట్‌ రోడ్డుకు బిల్లులు మంజూరు చేశారు.

అప్పటికే కాలనీలో ఉన్న కుటుంబాలకు ఆధార్, రేషన్, టీడీపీ సభ్యత్వ, ఓటరు గుర్తింపు కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పటి నుంచి ఎస్టీలు కూలీల పనులతో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలాన్నే మళ్లీ రెవెన్యూ అ«ధికారులు ఓ పారిశ్రామికవేత్త కుమారుడు మయూర్‌కు 2015లో వ్యవసాయ భూములుగా పట్టా మంజూరు చేసి రైతు పట్టాదారు పాసుపుస్తకాన్ని పంపిణీ చేశారు. 2018లో క్వారీకి చెందిన కాలనీ నుంచి వెళ్లిన ఎస్టీలు ఇన్నేళ్లుగా  భూముల జోలికి రాని ఆ పారిశ్రామికవేత్త క్వారీ యజమానులలో ఓ భాగస్వామి టీడీపీకి చెందిన సీనియర్‌ నాయకుడు  మృతి చెందడంతో భూములు తమవంటూ ఎస్టీలపై దాడులకు దిగుతున్నారు. ఎంజీఎం కాలనీ అంటూ ఇక్కడ ఉన్న ఇళ్లను తామే కట్టించామని ఆ పారిశ్రామికవేత్త హుంకరిస్తున్నారు. మరి చంద్రబాబునాయుడు కాలనీ ఏమైనట్లు? సాక్షాత్తు ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడీ బెదిరింపులు వారికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని ఎస్టీలు కోరుతున్నారు.

ఎస్టీలకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్ష
తొట్టంబేడు : చంద్రబాబునాయుడు ఎస్టీ కాలనీ వాసులకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకైనా సిద్ధమేనని మాజీ ఎమ్మెల్యే సురాజ్‌ ప్రకటించారు. ఆదివారం ఆయన చంద్రబాబునాయుడు ఎస్టీ కాలనీని పరిశీలించారు. కాలనీ ఎస్టీలపై చేస్తున్న దాడులకు నిరసనగా రోడ్డుపై ఆందోళన చేశారు. ఆయన మాట్లాడుతూ, 95–96లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు అప్పట్లో తానే ఈ కాలనీని ఆయన పేరిట ప్రారంభించానని, దీనిని ఆక్రమించేందుకు కొందరు ఇప్పుడు యత్నిస్తుండటం దుర్మార్గమని నిరసించారు.  ఆక్రమణదారుల దౌర్జన్యాలతో రోజుకూ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నా స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.కలెక్టర్, సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పీజేచంద్రయ్య శెట్టి, మండల వైఎస్సార్‌ సీపీ ఎస్టీ నాయకుడు వెంకీ, ఎస్టీ సంఘాల నాయకులు చందమామల కోటయ్య, సుద్దాల సుబ్రమణ్యం, ప్రజాసంఘాల నాయకులు కోగిల ధర్మయ్య, కత్తిధర్మయ్య, వీసీవెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రాణభయంతో ఉన్నాం
రాత్రిళ్లు నిద్రరావడం లేదు. ఎప్పుడు ఎం జరుగుతుందోనని హడలిపోతున్నాం. రాత్రిళ్లు ఎక్కడ జేసీలతో వచ్చి మా ఇళ్లను కూల్చేస్తారోననే భయంతో వీధుల్లో సిమెంట్‌ రోడ్డుపై పడుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి.      –కృష్ణవేణి, స్థానికురాలు

నిందితులను అరెస్ట్‌ చేయాలి
చంద్రబాబునాయుడు ఎస్టీకాలనీ ఎస్టీలపై దాడులుచేసి దౌ ర్జన్యం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలి. వారం రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలే దు. లేకపతే ఆందోళన చేస్తాం.   –చందమామల కోటయ్య,యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తొట్టంబేడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement