ఊబకాయం ఉచ్చు.. !

Obesity Problems And Awareness - Sakshi

గుండె, మెదడుపోటుకు అవకాశం

పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు

ఆహార అలవాట్లే ప్రధానం

యువతపై అధిక ప్రభావం

‘‘సుబ్బారావు 21 వయసులో పోలీసు ఉద్యోగంలో చేరాడు.. చురుకుగా ఉండేవాడు.. పరిశోధనలో మెలకువలతో రాణిస్తున్నాడు.. అధికారుల మన్ననలు పొందాడు..  వేళాపాళా లేని డ్యూటీలు.. సరియైన నిద్ర కరువైంది.. ఊబకాయం వచ్చిపడింది.. ఓ రోజు మధ్యాహ్నం భోజన చేసి కూల్‌డ్రింక్‌ తాగాడు.. ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యాడు.. ఇదీ ప్రస్తుతం యువత పరిస్థితి. ’’

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రస్తుతం జీవనశైలి మారింది. ఆహార అలవాట్లు మారాయి. నిద్రతో పాటు విశ్రాంతి తీసుకునే సమయాలు మారిపోయాయి. ప్రస్తుతం యువత కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. శరీరిక శ్రమ తగ్గిపోయింది. పని పద్ధతులు మారాయి. ఎక్కువ మంది యువత ఆఫీసు కదలకండా కుర్చుని చేసే పనులు ఇష్టపడుతున్నారు. కుర్చున టేబుల్‌ వద్ద అన్ని వచ్చేస్తున్నాయి. ఫలితంగా అనేక రుగ్మతలకు గురవుతున్నారు.

ప్రధానంగా ఊబకాయం..
అమరావతి రాజధానిగా రూపాంతరం చెందిన విజయవాడ, గుంటూరు నగరాల ప్రజల్లో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. ఊబకాయం సమస్య వెంటాడుతోంది. చిన్నవయసులోనే గుండెపోటు, మెదడుపోటుకు గురవుతున్నారు. మూడు పదులు వయసు వచ్చేసరికి దీర్ఘకాలిక వ్యాధులైన  మధుమేహం, రక్తపోటుతో పాటు బారిన పడి కీళ్లనొప్పులు,నడుమునొప్పి వంటి సమస్యలుతెచ్చుకుంటున్నారు.

వ్యాధులకు కారణాలివే..
మారిన జీవనశైలి, శారీరక వ్యాయామం లేక పోవడం, మాంసాహారం అధికంగా తీసుకోవడం, కార్పొహైడ్రేడ్‌లు ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్‌ లాగించేయడంతో ఒబెసిటీతో పాటు, మధుమేహం, రక్తపోటు వంటి వాటికి గురవుతున్నారు. జనాభాలో 50 శాతం మంది ఒబెసిటీకి గురికాగా, 18 శాతం మధుమేహం, 22 శాతం మంది రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడినట్లు వైద్యుల అధ్యయనాలు చెబుతున్నారు. ఒబెసిటీ కారణంగా రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ పెరుగుతుండటంతో చిన్న వయసులోనే  గుండెపోటుకు గురవుతున్నారు. ఇటీవల 22 ఏళ్ల యువకుడు గుండెపోటుకు గురైనట్లు కార్డియాలజిస్టులు చెబుతున్నారు. రక్తపోటు అదుపులో లేకపోవడం వలన 28 ఏళ్ల వయసులోనే బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన ఘటన ఇటీవల వెలుగు చూసింది.

అవగాహనతోనే వ్యాధులకు దూరం
మన శరీరంలో ఉండాల్సిన చక్కెర స్థాయిలు, కొలస్ట్రాల్, బ్లడ్‌ ప్రషర్‌లతో పాటు, బీఎంఐ అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఇలా అదుపులో ఉంచుకోండి.

రక్తంలో చక్కెర స్థాయిలు..
హెచ్‌బీఎ1సీ(మూడు నెలల షుగర్‌ స్థాయి)– 6.5శాతం లోపు ఉంచుకునేలా చూడాలి.
పాస్టింగ్‌– 70 నుంచి 100 మధ్యలో ఉండాలి.
ఆహారం తీసుకున్న తరువాత 2 గంటలకు 160 వరకు ఉండవచ్చు.
బీఎంఐ– 18.5 నుంచి 23.5 వరకు నార్మల్‌ బీఎంఐగా పరిగణిస్తారు.
లిపిడ్‌ ప్రొఫెల్‌: శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ వంద కన్నా తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి.
గుండె జబ్బులు ఉన్న వారైతే 70 కన్నా తక్కువగా వుండేట్లు చూసుకోవాలి
మంచి కొలస్ట్రాల్‌(హెచ్‌డీఎల్‌) 40 కన్నా ఎక్కువ ఉండేలా చూడాలి.
బ్లడ్‌ ప్రెజర్‌: 80/120 నార్మల్‌గా భావిస్తారు.

జీవన శైలిలో మార్పు అవసరం
ఆహారపు అలవాట్లలో మార్పులు, సరైన వ్యాయామం లేక పోవడం, ఒత్తిడి కారణంగా అనేక మంది మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు బారిన పడుతున్నారు. తద్వారా గుండె జబ్బులు, పక్షవాతానికి గురువుతున్నారు. నిత్యం పనిలో ఎంత బిజీగా ఉన్న మన ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ప్రతిరోజు తప్పనిసరిగా కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయడంతో పాటు, యోగ, మెడిటేషన్‌పై దృష్టి సారించాలి. ఆహారంలో నూనె పదార్థాలు, స్వీట్లు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. ప్రస్తుతం మధుమేహం, రక్తపోటు మనకు సవాళ్లుగా మారాయి. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందడం కన్నా. ముందు జాగ్రత్తలే మిన్న అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.డాక్టర్‌ కె.వేణుగోపాలరెడ్డి,డయాబెటాలజిస్ట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top