కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి హైదరాబాద్ వచ్చిన నిర్మలా సీతారామన్కు పార్టీనేతలు, కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు.
హైదరాబాద్ : కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి హైదరాబాద్ వచ్చిన నిర్మలా సీతారామన్కు పార్టీనేతలు, కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యమన్నారు. రుణమాఫీ అంశం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారమన్నారు. ఆయా పార్టీల మేనిఫెస్టోల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయని నిర్మలా సీతారామన్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో యువతకు ఉపాధి కల్పనకు అవకాశం పెరిగిందని, అందుకు తగ్గ శిక్షణ ఇవ్వాలని నిర్మాల సీతారామన్ అన్నారు. నల్లధనం వెలికితీతకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిశా నిర్థేశం ప్రకారం అందరం ఐకమత్యంగా పని చేస్తామన్నారు. మహిళలపై అఘాయిత్యాలను అరికడతామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు...ఎంపీ పార్టీ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ను సన్మానించారు. ఆదివారం జరిగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు ఆమె తెలిపారు.