సార్వత్రిక ఎన్నికల వేళ మున్సిపాలిటీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పురపాలక సంఘాల ఎన్నికలకు తెరలేచింది. సార్వత్రిక ఎన్నికల వేళ మున్సిపాలిటీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
సాధారణ ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పడంతో పురపాలకశాఖ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో జిల్లాలోని బడంగ్‌పేట, వికారాబాద్, పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, తాండూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేయడమేగాకుండా ఆదివారం మున్సిపాలిటీల వార్డులో ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని ఆదేశించింది.
మరోవైపు మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కూడా పురపాలకశాఖ యుద్ధప్రాతిపదికన చేపట్టింది. శనివారం ఆయా వార్డుల రిజర్వేషన్లను కూడా ప్రకటించేందుకు మున్సిపల్ శాఖ సమాయత్తమవుతోంది. నగర శివార్లలోని 35 గ్రామ పంచాయతీలను కొత్త మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలనే ప్రతిపాదనలకు ఇంకా ఆమోద ముద్ర పడకపోవడంతో.. వీటిని ప్రస్తుతం ఎన్నికల నుంచి మినహాయించారు. అలాగే వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తికాని, కోర్టుల్లో కేసులు ఉన్నవాటికి కూడా ఎన్నికలు జరపడంలేదు. రెండో దశలో జిల్లాలో కొత్తగా ప్రతిపాదిస్తున్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి.