పెట్టుబడులు పెడతాం.. అవకాశమివ్వండి: అంబానీ

Mukesh ambani met cm chandrababu - Sakshi

సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): వ్యవసాయ రంగంలో ప్రైవేటుగా పెట్టుబడులు పెడతామని, అందుకు అవకాశమివ్వాలని రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేష్‌ అంబానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వెలగపూడి సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్టీజీ) సెంటర్‌లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖేష్‌ మాట్లాడుతూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు దేశానికి పెద్ద సవాలు వంటివని, వాటిలో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశాలివ్వాలన్నారు. వ్యవసాయ రంగంలో తమ కంపెనీ పెట్టుబడులు పెడుతుందని, తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. ప్రస్తుతం  దేశంలోని ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

ప్రతిపాదనలతో వస్తే సహకారమందిస్తాం: సీఎం
తిరుపతికి సమీపంలోని శ్రీసిటీ వద్ద ఒక పెద్ద సెల్‌ఫోన్‌ తయారీ యూనిట్‌ పెట్టే యోచన తమకు ఉందని ముఖేష్‌ సీఎంకు తెలిపారు. నెలకు 10 లక్షల సెల్‌ఫోన్లు తయారు చేసే సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చూస్తున్నట్లు చెప్పారు. తగిన ప్రతిపాదనలతో వస్తే పూర్తి సహకారం అందిస్తామని సీఎం తెలిపారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థ గురించి సీఎం చంద్రబాబు వివరించగా బాగుందని అంబానీ కితాబిచ్చారు. అక్కడ సమావేశం ముగిసిన తర్వాత అంబానీని సీఎం రాత్రి 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి తీసుకెళ్లి విందు ఇచ్చారు. అనంతరం రాత్రి 11.30 గంటలకు అంబానీ ముంబైకి తిరిగి వెళ్లారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top