తల్లుల కడుపుకోత పట్టదా! | Mothers sad story | Sakshi
Sakshi News home page

తల్లుల కడుపుకోత పట్టదా!

Aug 12 2015 1:54 AM | Updated on Sep 3 2017 7:14 AM

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల్లో తరచూ ఏదో ఒక సంఘటన

 సాక్షి, గుంటూరు : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల్లో తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతున్నప్పటికీ అక్కడి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరణిలో ఎటువంటి మార్పు రావడం లేదు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువులు అపహరణకు గురికావడం, నిర్లక్ష్యం వల్ల బాలింతలు మృతి చెందడం, బిడ్డలు మారిపోయారనే గందరగోళ పరిస్థితులు నెలకొనడం సర్వసాధారణంగా మారింది. సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసే ఆసుపత్రి ఉన్నతాధికారులు, వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంలో విఫలమవుతూనే ఉన్నారు. 

జీజీహెచ్‌లో ఐదు నెలల కాలంలో ఆరు సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా సోమవారం నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో బిడ్డ మాయమైందనే కలకలంతో అరగంట పాటు ఓ బాలింతరాలు నరకయాతన అనుభవించింది. ఇద్దరు తల్లుల పేర్లూ మార్తమ్మ కావడంతో ఒకరి బిడ్డను మరొకరికి ఇచ్చారు. దీంతో కొంత సేపు గందరగోళం నెలకొంది. చివరకు ఇద్దరు బిడ్డలూ ఉండడంతో అయోమయానికి తెరపడింది.
 
వరుస ఘటనలతో హడల్..
 జీజీహెచ్ ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల వద్ద తరచూ ఇబ్బందికర ఘటనలు జరుగుతుండడంతో రోగులు, వారి బంధువులు హడలిపోతున్నారు.

     ఏప్రిల్ 10వ తేదీన గండి అనిత, కామినేని అనిత ఇద్దరూ ఒకేసారి మగ, ఆడ శివువులకు జన్మనిచ్చారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మగబిడ్డ తనకే పుట్టాడని ఇద్దరూ గొడవకు దిగడం, ఆడపిల్లను తీసుకునేందుకు ఎవరూ అంగీకరించకపోవడం, కనీసం ఆపరేషన్ చేసేందుకు సంతకాలు చేయకపోవడంతో పరిస్థితి విషమించి పాప మృతి చెందింది.

     మే నెలలో బ్రాహ్మణపల్లికి చెందిన దోమవరపు లావణ్య స్కానింగ్ వైద్యుల కోసం వేచి చూసి నొప్పులు తట్టుకోలేక నేలపై పడిపోయి ప్రసవించిన విషయం తెలిసిందే. స్కానింగ్‌కు వెళ్లే ముందు ఆమె వెంట ఆయాను కూడా పంపలేదు సరికదా, నేలపై పడిన రక్తపు మరకలు సైతం గర్భిణి తల్లితో తుడిపించడం దారుణం.

     మే 20వ తేదీన మహారాష్ట్రకు చెందిన అనూష అనే గర్భిణి కాన్పుకోసం జీజీహెచ్ ప్రసూతి విభాగంలో చేరింది. అదే నెల 23వ తేదీన వైద్యులు సిజేరియన్ చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కడుపు నొప్పిగా ఉందని చెప్పినప్పటికీ ఓ టాబ్లెట్ వేసి వెళ్లారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. కొంత సేపటికి ఆమె బెడ్‌పైనే మృతి చెందింది. ఈ విషయాన్ని ఆరు గంటల వరకు  సిబ్బంది గుర్తించకపోవడం దారుణం.  ఆమె మృతితో ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement