సైలెంట్‌ కిల్లర్‌.. న్యుమోనియా | More Pneumonia Cases Filed in Guntur And Vijayawada | Sakshi
Sakshi News home page

సైలెంట్‌ కిల్లర్‌.. న్యుమోనియా

Dec 25 2019 12:39 PM | Updated on Dec 25 2019 12:39 PM

More Pneumonia Cases Filed in Guntur And Vijayawada - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవలి కాలంలో విజయవాడ, గుంటూరు నగరాల్లో న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకు వాతావరణ కాలుష్యంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో తక్కువ ప్రాంతంలో అత్యధికశాతం మంది నివాసం ఉండటం, పొగ వంటివి కారణాలుగా చెపుతున్నారు. వ్యాధి నిరోధక టీకాలు సరిగా వేసుకోని వారిలో కూడా న్యుమోనియా సోకే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు న్యుమోనియా సోకితే ప్రాణాంతకంగా మారుతుందని, పెద్దవారికి సోకినా సకాలంలో చికిత్స తీసుకోకుంటే ప్రమాదమేనని వైద్యులు అంటున్నారు. శీతాకాలంలో న్యుమోనియా మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇలా సోకుతుంది...
న్యుమోనియా వ్యాధి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజువాల వలన సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. మనం శ్యాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటుగా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి, కొద్దికాలానికి తెల్లరక్తకణాలను నిర్వీర్యం చేస్తాయి.  దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.. శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువుగా ఉన్నా, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వాటిని ఎదుర్కోలేకపోవచ్చు. ధూమపానం, మద్యపానం చేసే వారిలో, సమతుల ఆహారం తీసుకోని వారిలో మధుమేహం, హెచ్‌ఐవీ, క్యాన్సర్, గుండె, ఊపిరి తిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారిలో వ్యాధి నిరోధకశక్తి తక్కువుగా ఉంటుంది. అలాంటి వారిలో న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో రెస్సిరేటర్‌ సిన్సిషియల్‌ వైరస్‌(ఆర్‌ఎస్‌వీ), పెద్దవారిలో ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌ వలన వచ్చే జలుబు, దగ్గు తర్వాత న్యుమోనియా తరచుగా వస్తుందంటున్నారు. 

న్యుమోనియా లక్షణాలు..
చలితో కూడిన జ్వరం, దగ్గు, కఫం, ఛాతీలో నొప్పి వంటి సాధారణంగా  ఉంటాయి. కొందరిలో దగ్గుతో పాటు రక్తం కూడా పడవచ్చు. కొందరిలో కఫం చిక్కగా, కొందరిలో పలుచగా పడుతుంది. నోటి వెంట పడే కఫం రంగును బట్టీ వ్యాధి లక్షణాలు గుర్తించవచ్చు.. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు రక్తం ద్వారా ఇతర అవయవాలకు సోకే అవకాశం ఉంది. దీనినే బాక్టీరిమియా సెప్టిసీమియా అంటారని వైద్యులు చెపుతున్నారు.

నిర్ధారణ ఇలా...  
రక్త పరీక్షలో తెల్ల రక్తకణాల సంఖ్య, ఈఎస్‌ఆర్‌ వంటి పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. వ్యాధి తీవ్రతను కూడా తెలుసుకోవచ్చు.  కొన్ని సందర్భాలలో వరుసగా చేసే ఈ పరీక్షలో వ్యాధి తగ్గుముఖం పట్టిందా..లేదా అనే వి«షయం కూడా తెలుస్తుంది.. కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే, బ్రాంకోస్కోపీ వంటి వాటి ద్వారా నిర్ధారించవచ్చు.  

ముందు జాగ్రత్త ఎంతో మేలు
ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా సోకితే ప్రాణాంతకంగా మారవచ్చు. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు. బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకూ తల్లిపాలు ఇవ్వడం, చక్కని శుభ్రత పాటించడం వలన చిన్నారుల్లో న్యుమోనియా రాకుండా చాలా వరకూ నివారించవచ్చు. న్యుమోకోకల్‌ టీకాను బిడ్డకు ఇప్పించడం ద్వారా ఈ వ్యాధి రాకుండా చూడవచ్చు. సాధారణ న్యూమోనియా కన్నా, బాక్టీరియా ద్వారా సంక్రమించే న్యుమోకోకల్‌ వ్యాధులు చాలా తీవ్రమైనవి. వీటితో మెదడు వాపు, చెవిలో ఇన్‌ఫెక్షన్‌తో పాటు మరణాలకు దారితీస్తాయి, న్యుమోనియా లక్షణాలు గుర్తించి తొలిదశలో చికిత్స చేస్తే పూర్తిగా నివారించవచ్చు.   – డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.విఠల్‌రావు,  ప్రొఫెసర్,  సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement