ఏపీకి సంపూర్ణ సహకారం : మోదీ

Modi Says We Will Suport Andhra Pradesh - Sakshi

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. వైఎస్‌ జగన్‌ తన ఆకాంక్షలకు అనుగుణంగా, తన సంకల్పంతో మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఏపీలో అభివృద్ధికి అన్ని అవకాశాలున్నాయని అన్నారు. తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ఆదివారం జరిగిన ప్రజా ధన్యవాద సభలో మోదీ ప్రసంగించారు.

ఏపీ అన్నిరంగాల్లో దూసుకుపోతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు.  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ అభివృద్ధికి కలిసి ముందుకు సాగుతాయని అన్నారు. ఏపీ ప్రజలు విజ్ఞానవంతులని ప్రధాని కొనియాడుతూ స్టార్టప్‌ కార్యక్రమంలో ఎంతో నిష్ణాతులైనవారు రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో ముందుకొచ్చారని అన్నారు.

ప్రజలు మెచ్చే పాలన..
రాబోయే రోజుల్లో ప్రజలు మెచ్చే పాలనను దేశానికి అందిస్తామని చెప్పారు. ప్రజల హృదయాలు గెలుచుకునేందుకు 365 రోజులు పనిచేస్తామని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంకన్న ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు. 130 కోట్ల ప్రజల కలలను సాకారం చేయాలని బాలాజీని వేడుకుంటానని అన్నారు. తమిళనాడు, ఏపీలో బీజేపీ మున్ముందు మరింతగా బలపడుతుందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమలే తమకు ఇంతటి ఘనవిజయం సాధించిపెట్టాయని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top